Free Inter Admissions: త్వరలోనే విద్యా కమిషన్‌.. టెన్త్‌లో ఈ జీపీఏ వచ్చిన విద్యార్థులకు ఇంటర్‌లో ఉచితంగా అడ్మిషన్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరలోనే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు.

పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్‌ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పా రు. టెన్త్‌లో పదికి పది జీపీఏ వచ్చిన విద్యార్థుల కు ఇంటర్‌లో ఫీజుల్లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. జూన్ 10న‌ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్‌ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.

సీఎం రేవంత్‌ ముఖ్య అతిథిగా హాజరై.. టెన్త్‌లో పది జీపీఏ సాధించిన విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్‌ తరపున ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం రేవంత్‌ మాట్లాడారు.

చదవండి: Schools start in AP: పాఠశాలల పునఃప్రారంభం ఒకరోజు వాయిదా

మౌలిక వసతులు తక్కువగా ఉన్నా.. కార్పొరేట్‌ స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు పోటీపడటం అభినందనీయమని చెప్పారు. ఇప్పుడున్న సివిల్‌ సర్వీస్‌ అధికారుల్లో చాలా మంది ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని.. తనతోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా సర్కారీ స్కూల్లోనే చదివామని రేవంత్‌ చెప్పారు. 

విద్యార్థులు లేరని స్కూళ్లు మూసేయబోం.. 

  • రాష్ట్రంలో ప్రతీ గ్రామం, తండాకు విద్యను తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమని, అందుకోసమే మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నామని రేవంత్‌ చెప్పారు. విద్యార్థులు లేరంటూ స్కూళ్లు మూసేసే పరిస్థితి ఉండబోదని పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న సర్కారీ స్కూల్‌ భవనాల మరమ్మతుల కోసం రూ.2 వేల కోట్లు వెచ్చించనున్నట్టు చెప్పారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలతో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్‌ వచ్చిందన్నారు. ఈ క్రమంలో ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ ఇస్తూ.. సెమీ రెసిడెన్షియల్‌గా మార్చాలన్న ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకే ఇస్తున్నామన్నారు. సరికొత్త రీతిలో బడిబాట చేపట్టి స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. విద్య మీద వెచ్చించేది ఖర్చు కాదని, పెట్టుబడి అని పేర్కొన్నారు. టెన్త్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులు ఇంటర్‌లోనూ మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్య కమిషనర్‌ దేవసేన, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, యశోద ఫౌండేషన్‌ చైర్మన్‌ రవీందర్‌రావు, వందేమాతరం ఫౌండేషన్‌ అధ్యక్షుడు టి.రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.   

#Tags