Free Education: ‘చదువుకునే వారికి చదువు‘కొనే’ అవసరం లేదంటూ’.. ప్రభుత్వ కాలేజీ ‘ఫ్లెక్సీ’

సిరిసిల్ల/ సిరిసిల్ల కల్చరల్‌: ‘చదువుకునే వారికి చదువు‘కొనే’ అవసరం లేదంటూ’.. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు సాధించిన విజయాలను తెలుపుతూ స్థానిక పాతబస్టాండులోని నేతన్న చౌక్‌లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

నిజానికి ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో ప్రైవేటు కళాశాలల ఫ్లెక్సీలు కనిపిస్తుంటాయి. కానీ సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రఘునందన్‌ తమ కాలేజీ విద్యార్థులు సాధించిన విజయాలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. లక్షలు అవసరం లేకుండా లక్షణమైన ఇంజనీరింగ్‌ విద్య చదివే అవకాశం లభిస్తుందని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీటు వస్తే ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందని అందులో వివరించారు. ప్రభుత్వ కాలేజీలో చదివితే కలిగే ప్రయోజనాలు సైతం వివరించారు.

సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు సాధించిన ఇంజనీరింగ్‌ సీట్ల వివరాలు, వారు సాధించిన మార్కులు అందరికీ తెలిసేలా ఏర్పాటు చేశారు. ఓ ప్రభుత్వ కళాశాల ప్రైవేటుకు దీటుగా తాము సాధించిన ఫలితాలను తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం గమనార్హం.  

ఇద్దరు విద్యార్థులు.. ఒక టీచర్‌

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపేట గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయురాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నాయి. సొంత భవనమూ ఉంది. రెండేళ్ల క్రితం సుమారు 60 మంది విద్యార్థులు ఉండేవారు. ఆ తరువాత తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలలపై ఆసక్తి చూపడంతో సంఖ్య రెండుకు పడిపోయింది. ఉన్న ఇద్దరు విద్యార్థులు కూడా 2వ తరగతిలో కొనసాగుతున్నారు. ఇటీవల నిర్వహించిన బడిబాటలోనూ స్కూల్‌లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపలేదు.

#Tags