Mid Day Meals: సార్‌.. ఈ అన్నం మాకొద్దు.. ప్రజావాణికి ఫిర్యాదు

కరీంనగర్‌/జగిత్యాలటౌన్‌: మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామంటూ రెండుచోట్ల విద్యార్థులు ఆందోళనకు దిగా రు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని పురాతన పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కగా, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరెపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి చేరుకొని కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌లోని పురాతన పా ఠశాలలో 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సోమవారం 217 మంది పాఠశాలకు హాజరయ్యారు.

కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న ఈ పాఠశాలలో వారంరోజులుగా ఉడికీఉడకని అన్నం పెడుతున్నారని, అడుగు భాగం మెత్తగా, ముద్దగా మారి మాడిపోతోందని, ఆ అన్నం ఎలా తినేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అరగంట పాటు ఆందోళన చేసినా ఉన్నతాధికారులెవరూ పాఠశాలకు రాలేదు. దీంతో విద్యార్థులు అన్నం తినకుండానే పడేశారు.  

చదవండి: Govt School Timings : ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల స‌మ‌యం మార్చ‌డం స‌రికాదు..

ఆరెపల్లి పాఠశాలలో వంట మనిషిని మార్చాలని కోరుతూ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని, రుచిలేని అన్నం వడ్డిస్తున్నారని, ప్రశ్నిస్తే ఇష్టమున్నచోట చెప్పుకోమంటూ వంట మనుషులు బెదిరిస్తున్నారని ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకున్నారు.

నాలుగు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ప్రజావాణి ఆడిటోరియంలోకి వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. వంటమనిషిని తొలగించి సరైన భోజనం అందించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని నిరసన విరమింపజేశారు.

#Tags