Goodnight Killers: గురుకులంలో ‘గుడ్‌నైట్‌ కిల్లర్స్‌’

కోరుట్ల: ‘గుడ్‌నైట్‌ కిల్లర్‌’.. ఇది మన ప్రాంతంలో జీవించే ప్రాణాంతకమైన కట్లపాముకు మారుపేరు. ఈ పాము కుడితే కాట్లు ఉండవు.. దోమ కుట్టినంత నొప్పి కూడా ఉండదు.

 కుట్టిన విషయాన్నీ గుర్తించలేం. విషం మాత్రం ప్రమాదకరం. సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించకుంటే 8 నుంచి 10 గంటల వ్యవధిలో ప్రాణాలు పోతాయి. నిద్రలో ఉన్న వారిని కాటేసి తెల్లారేసరికి ప్రాణాలు తీసే గుణం ఉన్న పాము కావడంతో దీన్ని గుడ్‌నైట్‌ కిల్లర్‌ అని పిలుస్తుంటారు.

పెద్దాపూర్‌ గురుకులంలో పదిహేను రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం.. మరో ఆరుగురు అస్వస్థతకు గురికావడానికి ఇలాంటి కట్ల పాము కాటు కారణమై ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న పారిశుధ్య పనుల్లో గురుకులం ఆవరణలో పెద్ద ఎత్తున పాములు బయటపడటం ఈ అనుమానాలకు ఊతమిస్తోంది.

చదవండి: NMMS Scheme for Students : విద్యార్థుల‌ ప్ర‌తిభ‌కు ఎన్ఎంఎంఎస్ ప్ర‌వేశ ప‌రీక్ష‌.. ఈ విద్యార్థుల‌ నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ఇలా..

రాత్రివేళ మాత్రమే..

రాత్రి సమయంలో చల్లదనానికి చురుకుగా సంచరించే ఈ కట్లపాము ఎక్కువగా ఎలుకలను వేటాడి తింటుంది. ఎలుకలు తమ ఆహారం కోసం మనుషులు ఉండే ప్రాంతాల్లో సంచరిస్తే వాటి కోసం కట్ల పాము జనావాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. పెద్దాపూర్‌ గురుకుల పాఠశాల పరిసరాల్లో పొలాలు, చేలు, గడ్డిమైదానం ఉండడం కట్లపాముల సంచరానికి కారణంగా తెలుస్తోంది.

దీనికితోడు విద్యార్థులు ఉండే గదుల్లో తినుబండారాలు, ఇతరత్రా ఆహార పదార్ధాలు ఉండే క్రమంలో ఎలుకల సంచారం ఎక్కువగానే ఉంది. పాత తరగతి గదుల పరిసరాల్లోనే విద్యార్థులు తినగా మిగిలిన పదార్థాలు పడవేయడంతో ఆయా ప్రాంతాల్లో ఎలుకల సంచారం ఎక్కవగా ఉంది. ఎలుకలు తరగతి గదుల్లో విద్యార్థులు పడుకునే గదుల్లో సంచరించడం సహజమే.

ఈ క్రమంలో ఎలుకల వాసన పసిగట్టి మరీ వచ్చే కట్లపాము వాటి కోసం అవి వెళ్లిన మార్గంలోనే వెళ్లి విద్యార్థులు పడుకునే గదుల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. నిద్రలో ఉన్న విద్యార్థుల కదలికలకు బెదిరిపోయి కట్లపాములు కాటేయడానికి ఆస్కారం ఉంది.
 

#Tags