ఘన విజయాలు అందుకున్న వారి కోసం ఓ-1 వీసా

సైన్సు ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్, అథ్లెటిక్స్ రంగాలలో అసాధారణ ప్రతిభ కలిగి ఉండి అద్భుత విజయాలు నమోదు చేసుకున్న విదేశీయులు ఓ-వీసాల మీద అమెరికా వెళ్ళవచ్చు. టెలివిజన్, సినిమా, సృజనాత్మకర రంగాలైన మేకప్ ఆర్టిస్టులు, సెట్ డిజైనర్లు, ఫొటోగ్రాఫర్లు, కార్పెంటర్లు లాంటి వారు ఈ వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆయా రంగాలలో బాగా పేరు పొందిన విదేశీ కళాకారులను మాత్రమే ఓ-1 వీసాకి పరిశీలిస్తారు.

ఓ-1 అప్లికెంటు తనకు తానుగా ఈ వీసా కోసం నేరుగా యు.ఎస్. కాన్సులేట్‌కి వెళ్లడం కుదరదు. యు.ఎస్.లో ఒక కంపెనీ, లేదా ఒక యు.ఎస్. ఏజెంటు వీరి తరపున పిటిషన్ పెట్టుకున్న తర్వాత ఆ పిటిషన్ ఆమోదం పొంది వస్తే అప్పుడు ఆ దరఖాస్తుదారుడు దానిని తీసుకుని; ఇతర వీసా నిర్దేశితాలని (రిక్వయిర్మెంట్లని) కూడా పరిపూర్తి చేసి, సమీపంలోని యు.ఎస్. కాన్సులేట్‌కి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అనేక అంశాలని పరిశీలించిన తర్వాత వీసా అధికారి ఆ ఓ-1 దరఖాస్తుపైన ఒక నిర్ణయం తీసుకుంటారు.

ఓ-1 వీసా మీద యు.ఎస్. వెళ్లిన వారు తమ వీసా అమలులో ఉన్న కాలంలో అమెరికా వెలుపలికి యథేచ్ఛగా వెళ్లిరావచ్చు. తమకి యు.ఎస్.లో అవసరమైన సపోర్ట్ పర్సనెల్ కోసం ఓ-2 వీసాలకి దరఖాస్తు చెయ్యవచ్చు. తమతో పాటు అమెరికాకు ప్రయాణించే తమ డిపెండెంట్స్ కోసం వీరు ఓ-3 వీసాలకు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో వీరు ఓ-స్టేటస్‌లో ఉండగా యు.ఎస్.లో శాశ్వత నివాసం కోసం కూడా అప్లయ్ చేసుకునే వీలుంటుంది.

ఓ-వీసాలని యు.ఎస్.సి.ఐ.ఎస్. అప్రూవ్ చేస్తుంది. ఆ అప్రూవల్ ఏ కార్యక్రమం కోసం అయితే ఇస్తారో ఓ-వీసా మీద ఉన్న వారు ఆ కార్యక్రమంలో మాత్రమే పని చెయ్యాలి. ఒకరి కంటె ఎక్కువ ఎంప్లాయర్లతో పని చెయ్యాలనుకున్న ఓ-1 వీసా హోల్డర్ల కోసం అందులోని ప్రతి ఒక్క ఎంప్లాయర్ కూడా విడివిడిగా ఫామ్ ఐ-129ని యు.ఎస్.ఐ.ఎస్.కి సమర్పించాలి. యు.ఎస్.సి.ఐ.ఎస్. ఇచ్చిన తేదీ నుంచి యు.ఎస్.లో పని ప్రారంభించి మళ్ళీ యు.ఎస్.సి.ఐ.ఎస్. పేర్కొన్న ముగింపు తేదీకి అక్కడ పని విరమించి తీరాలి.

యు.ఎస్.లో తమ కార్యక్రమం ముగిసే వరకు-మూడేళ్ళ గరిష్ట కాల పరిమితికి లోబడి ఓ-1 వీసా హోల్డర్లు అమెరికాలో ఉండవచ్చు. తప్పనిసరైనప్పుడు ఒక ఏడాది కాలానికి వీరు వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓ-1 వర్క్ వీసా మీద ఉన్నవారు ఆ వీసా స్టేటస్‌లో ఉండగా యు.ఎస్.లో పార్ట్ టైమ్ విద్యాభ్యాసం మాత్రం చెయ్యవచ్చు.

ఓ-1 వీసాకి దరఖాస్తు చేసుకోవడానికి పూర్వం ఒక కన్సల్టింగ్ సంస్థ లేదా ఒక లేబర్ ఆర్గనైజేషన్ నుంచి వీరు అసాధారణ ప్రతిభా నైపుణ్యాల గురించి, అమెరికాలో మీరు చెయ్యబోయే పనికి ఆ ప్రతిభా నైపుణ్యాల ఆవశ్యకత గురించి ఒక అడ్వయిజరీ ఒపీనియన్ (సలహాని) తీసుకోవలసి వుంటుంది. మీ రంగంలో మీకు గల అసాధారణ ప్రతిభాపాటవాలను ధ్రువీకరించే మీ అవార్డులు, ప్రెస్ క్లిప్పింగులు, ప్రచురణలు, మీ హై-శాలరీ/రెమ్యునరేషన్ వివరాల్లాంటి ఆధారాలు మీకు ఇందులో ఉపయోగపడతాయి.

అప్రూవ్ అయిన ఓ-1 పిటిషన్‌లో తీవ్రమైన తప్పులు ఉన్నా, అమోదించిన పిటిషన్‌లోని నిబంధనలను ఉల్లంఘించినా, పిటిషన్‌లో ఇచ్చిన వివరాలు నిజమైనవి గాదని, సవ్యంగా లేవని తెలిసినా; పిటిషన్‌లో తొలుత పేర్కొన్న దరఖాస్తుదారుని హోదా ఆ తర్వాత మారినా ఓ-1 పిటిషన్‌ని రద్దు చేస్తారు.

#Tags