చదువా? ఉద్యోగమా? వీసాకి వెళ్ళక ముందే స్పష్టంగా ఉండండి
స్టూడెంట్ వీసాకి అతి ముఖ్యమైన ఒక ముందస్తు అవసరం గురించి నేను ఇంతకు ముందు వీలైనప్పుడల్లా ప్రస్తావించాను. ఆ ముఖ్యావసరం-- యు.ఎస్. లో చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థికి అమెరికాలో స్థిరపడే ఉద్దేశం (ఇమిగ్రెంట్ ఇంటెంట్) లేకుండా ఉండడం. ఒక విద్యార్థి చదువు పూర్తయిన తర్వాత కూడా తను అమెరికాలోనే ఉండిపోయే అవకాశం ఉంది (పొటెన్షియల్ ఇమిగ్రెంట్) అనిపిస్తే అతనికి/ఆమెకి యు.ఎస్. కాన్సులేట్లో వీసా రిజెక్ట్ అవుతుంది. ఇలా రెండు ఉద్దేశాలతో (డ్యూయల్ ఇంటెంట్‌తో) వెళ్లి యు.ఎస్ కాన్సులేట్ వీసా విండోల దగ్గర విద్యార్థులు అపజయాన్ని ఎదుర్కోకుండా చూడాలని నాకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఈ అంశాన్ని హైలైట్ చేస్తూనే వచ్చాను.
అయితే నేను ‘హలో అమెరికా’ డైలీఫీచర్ రాయడం మొదలుపెట్టిన తర్వాత ఈ అయిదు నెలలకు పైబడిన కాలంలో నాకు ఈమెయిల్స్ రాసిన లేదా ఫోన్లు చేసిన విద్యార్థులలో అత్యధికభాగం అమెరికాలో ఉద్యోగం మీద గురిపెట్టినవారే కావడం నాకు ఆశ్చర్యం కలిగించకపోయినా దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరాన్ని మాత్రం అది నాకు గట్టిగానే సూచించింది. వీరిలో దాదాపు అందరూ కాన్సులేట్‌లలో వీసా రావడం కోసం -- ‘‘మీరు అమెరికాలో ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నారా?’’ అని వీసా అధికారి అడిగినప్పుడు ‘‘లేదు’’ అనే జవాబు చెబుతారు. కాన్సులర్ అధికారి నమ్మి వీసా ఇస్తే అమెరికా వెళ్లి అక్కడ చదువు/ఓ.పి.టి. పూర్తికాగానే చాలామంది ఖచ్చితంగా హెచ్-1 జాబ్ కోసం ప్రయత్నిస్తారు. ఒకవేళ వీసా ఇవ్వకపోతే తమ అమెరికా కల చెదిరి ఒక జీవితకాలం నిరాశలో గడుపుతారు.
‘‘ఎలాగైనా సరే అమెరికా చేరుకోవాలి’’ అనే బలీయమైన కోరికతో పోల్చితే ‘‘వీసా నిబంధనల్ని పాటించడం’’ అనే అతి ముఖ్యమైన అంశం చాలామంది విద్యార్థులలో అంతగా ప్రాధాన్యం పొందలేకపోవడం ఒక దురదృష్టకరమైన అంశం. ఒక్క ఉద్యోగం విషయంలోనే కాదు, మరికొన్ని ఇతర అంశాలలో కూడా ఏదో ఒకటి చెప్పి వీసా సంపాదించి అమెరికా చేరిపోతే చాలనుకునేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఒక విద్యార్థి అడిగిన ఈ ప్రశ్న చూడండి-- ‘‘నాకు బ్యాక్ లాగ్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్‌లో ఎం.ఎస్. కి వెళ్లాలంటే వీసా ఇవ్వరేమో? ఎలెక్ట్రికల్‌కి అని చెప్పి వీసా తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్యూటర్స్‌కి మార్చుకోవచ్చా?’’
అమెరికాలో ఉద్యోగాలు చెయ్యాలని ఆశించడం తప్పు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కోర్సు మార్చుకోవడం లేదా మరొక యూనివర్శిటీకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం కూడా నిబంధనలకు వ్యతిరేకం ఏమీ కాదు. అయితే అటువంటి ఉద్దేశాలను ముందుగానే ఏర్పరచుకుని స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలలో వాటిని దాచిపెట్టడం అప్లికెంట్ల నుంచి నిజాయితీని, చిత్తశుద్ధిని ఆశించే వీసా వ్యవస్థలో ఉత్తరోత్రా సమస్యలకు దారితీయవచ్చు. విద్యార్థి వీసా మీద వెళ్లాలనుకునేవారు ముందుగా తాము చదవాలనుకునే కోర్సు మీద, దానిని విజయవంతంగా పూర్తి చెయ్యడం పైన మాత్రమే మనసు లగ్నం చెయ్యడం, అమెరికాలో ఉద్యోగం సంపాదించడం గురించి మొదటి నుంచే తీవ్రమైన ఆలోచనలు, ప్రణాళికలు లేకుండా ఉండడం వీసా రావడానికే కాదు, విద్యాభ్యాసం బాగా జరగడానికి కూడా ఉపయోగపడుతుంది.
యు.ఎస్.లో చదువు పూర్తయిన తర్వాత అప్పటికి విద్యార్థి పరిస్థితులు మారి అక్కడే ఉద్యోగం చెయ్యాలనుకుంటే, ఒక మంచి అవకాశం లభిస్తే, చట్టబద్ధంగా హెచ్-1కి మారే వెసులుబాటు ఎటూ ఉండనే ఉంది. అమెరికాలో విద్యాభ్యాసం ఒక కొలిక్కి వస్తున్న దశలో లేదా ఓ.పి.టి.లో ఉండగా ఆలోచించవలసిన హెచ్-1 గురించి స్టూడెంట్ వీసాకి వెళ్ళే దశలోనే ఆలోచనలు చెయ్యకుండా ఉండడం ‘‘యు.ఎస్. కల’’ని విజయవంతంగా నెరవేర్చుకోవాలనుకునే విద్యార్థులందరికీ మంచిది.