Indian Students Choosing Canada Over US For Higher Education: విదేశీ విద్య కోసం అమెరికాతో పోలిస్తే కెనడానే బెస్ట్‌ అంటున్న విద్యార్థులు

ఒకప్పుడు విదేశీ చదువులంటేనే గుర్తొచ్చే పేరు అమెరికానే. ఏటా లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు పయనమవుతుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం మనోళ్లు అమెరికాతో పోలిస్తే కెనడా వైపు చూస్తున్నట్లు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది.

NFAP ప్రకారం.. గత రెండు దశాబ్దాలలో విదేశీ విద్య కోసం కెనడాకు వెళ్తున్న బారతీయుల సంఖ్య 5,800% కంటే ఎక్కువ పెరిగింది. 2000-21 వరకు అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య కేవలం  45% మాత్రమే పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.సుమారు 2013 నుంచి కెనడాకు వెళ్లే భారతీయుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

అప్పటి నుంచి పరిస్థితి మారింది..
గత రెండు దశాబ్దాలలో కెనడాకు వచ్చే విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ భాగం భారతీయ విద్యార్థులదే. కరోనా విపత్తు, ట్రంప్‌ పాలనకు ముందు వరకూ విదేశీ విద్య అంటే అమెరికాకే పయనమయ్యేవాళ్లు. కానీ 2019 నుంచి మార్పు మొదలైంది. 2016-19 వరకు యూఎస్‌ విశ్వవిద్యాలయాలకు వెళ్లే భారతీయుల సంఖ్య 13% తగ్గింది. ఇదే సమయంలో కెనడాకు వెళ్లే భారతీయుల సంఖ్య 182% పెరిగింది.

America Entrance Exams Which Is Better AP vs SAT or ACT: అమెరికాలో హైస్కూల్‌ స్టడీ.. AP లేదా SATలో ఏది తీసుకోవాలి?

 

అమెరికాను కాదని భారత విద్యార్థులు కెనడాను ఎంచుకోవడానికి ప్రధాన కారణం అమెరికా వీసా విధానాలే అని చెప్పొచ్చు. 2017లో ఆ దేశానికి డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వీసాల జారీని కఠినతరం చేయడం, ఉపాధి ఆధారిత హెచ్-1బీతో పాటు ఇతర వీసాల్లో మార్పులు చోటు చేసుకోవడం, మన విద్యార్థులపై అక్కడి పోలీసుల నిఘా వంటి కారణాలు భారత విద్యార్థులను అమెరికాకు దూరం చేశాయి.

కెనడాకు వెళ్లడానికి కారణమిదే
అదే సమయంలో కెనడా విదేశీ విద్యార్థులను ఆకర్షించే విధంగా స్టూడెంట్ వీసాలను జారీని సులభతరం చేయడంతో పాటు పలు వెసులుబాటులు కల్పించింది. ఒక్క ఏడాది కోర్సుకు రెండేళ్ల వర్క్ పర్మిట్, రెండేళ్ల పీజీ కోర్సుకు మూడేళ్ల పాటు వర్క్ పర్మిట్ ఇవ్వడం చేస్తోంది.

అలాగే కెనడాలో పర్మినెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం రెండు నుంచి మూడేళ్లలోనే వచ్చేస్తుంది. ఇలా వీసా విధానంలో పలు కీలక మార్పులు చేయడంతో భారతీయ విద్యార్థులు కెనడాకు క్యూ కడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. 

దీంతో పాటు  కెనడాలో ఒక్క ఏడాదిలో మాస్టర్‌ విద్య పూర్తిచేసి రెండేళ్లపాటు కొలువు చేసుకోవచ్చు. అంతేకాకుండా అమెరికా కంటే 30 శాతం వరకు ఫీజులు, ఖర్చులు తక్కువగా ఉంటుండడంతో అమెరికాతో పోలిస్తే కెనడాకు వెళ్లేందుకే మనోళ్లు జై కొడుతున్నారు. 


 

#Tags