Supreme court Orders on Government Jobs : ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌కాలపై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు.. ఇక‌పై...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాల‌ను విడుద‌ల చేసింది. ఏదైన‌ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యలో అర్హతా ప్రమాణాలు మార్చడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

నియామక ప్రక్రియ మధ్యలో అవసరాన్ని బట్టి నిబంధనల్లో మార్పులు చేస్తామని ముందుగా సమాచారం ఇవ్వకుండా నిబంధనలను మార్చకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. నవంబ‌ర్ 7వ తేదీన‌ తేజ్‌ ప్రకాష్‌ పాఠక్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ హైకోర్టు కేసును జడ్జీలు సుప్రీంకోర్టు జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ హృషీకేశ్‌రాయ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ పంకజ్‌ మిథల్, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. 

75 శాతం మార్కులు తప్పనిసరి అనే..
రాజస్థాన్‌ హైకోర్టు 2007 సెప్టెంబర్‌ 17వ తేదీన 13 అనువాదకుల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీచేసింది. తొలుత ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తామని, అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేపట్టడం ద్వారా నియామక ప్రక్రియ ముగుస్తుందని పేర్కొంది. ఆ పరీక్షకు మొత్తం 21 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో మూడు ఉద్యోగాలకు ముగ్గురిని ఎంపిక చేశారు. కనీసం 75 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులనే ఉద్యోగాలకు ఎంపిక చేశామని హైకోర్టు తన ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే నోటిఫికేషన్‌లో 75 శాతం మార్కులు తప్పనిసరి అనే విషయాన్ని స్పష్టంచేయలేదు. నిబంధనలు సవరించిన తర్వాత ఆ ముగ్గురిని మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేశారని మిగతా అభ్యర్థులు ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందంటూ బాధిత అభ్యర్థులు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2010 మార్చిలో ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. 

దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు గత ఏడాది జూలై 18వ తేదీన తీర్పును రిజర్వ్‌చేసి న‌వంబ‌ర్ 7వ తేదీన (గురువారం) వెలువరిచింది. ఏదైనా నియామక ప్రక్రియ అనేది దరఖాస్తుల స్వీకరణకు ఇచ్చిన అడ్వర్‌టైజ్‌మెంట్‌ ప్రకటనతో మొదలవుతుంది. పోస్టుల భర్తీతో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో నియమాలను మార్చడానికి వీల్లేదు. ఒకవేళ మార్చాల్సి వస్తే నోటిఫికేషన్‌ వెలువడటానికి ముందే మార్చాలి. లేదంటే మధ్యలో మార్చాల్సి రావొచ్చేమో అని విషయాన్ని నోటిఫికేషన్‌లోనే ప్రస్తావించాలి. అలాంటివేవీ చెప్పకుండా హఠాత్తుగా అభ్యర్థులను హుతాశులను చేసేలా ఆట నియమాలను మార్చొద్దు. ఒకవేళ మారిస్తే అవి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14ను, వివాదాలను తట్టుకుని నిలబడగలగాలి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

ఈ సందర్భంగా 2008లో సుప్రీంకోర్టు ఇచ్చిన పాత కె మంజుశ్రీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసు తీర్పును కోర్టు సమర్థించింది. దీంతోపాటు సుభాష్‌చంద్‌ మార్వా కేసునూ కోర్టు ప్రస్తావించింది. సెలక్ట్‌ జాబితా నుంచి ఉద్యోగుల ఎంపికను మార్వా కేసు స్పష్టంచేస్తే, సెలక్ట్‌ జాబితాలోకి ఎలా చేర్చాలనే అంశాలను మంజుశ్రీ కేసు వివరిస్తోంది అని పేర్కొంది.

#Tags