Tribal DSC: ప్రత్యేక ట్రైబల్‌ డీఎస్సీ ప్రకటించాలని వినతి

ములుగు: ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక ట్రైబల్‌ డీఎస్సీని ప్రకటించాలని కోరుతూ ఆదివాసీ సేవా సమితి ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 29వ తేదీ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్కనును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

2011లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ట్రైబల్‌ డీఎస్సీ నిర్వహించిందని గుర్తుచేశారు. జనరల్‌ డీఎస్సీలో సైతం ఏజెన్సీలో ఖాళీలను గిరిజనులతో నింపాలని కోరారు. స్పందించిన మంత్రి ట్రైబల్‌ డీఎస్సీపై ఆ శాఖ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఐటీడీఏలను సెక్టార్లుగా తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. లేని పక్షంలో గిరిజన నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. తక్షణమే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని సీతక్క సూచించారు. 
ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వజ్జ రాజు, ప్రధాన కార్యదర్శి గొంది అశోక్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్ధబోయిన రమేష్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మద్దెల చందు, జిల్లా ఆదివాసీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు మంకిడి రవి, ఈసం రాములు తదితరులు పాల్గొన్నారు. 

అనంతరం మంత్రి సీతక్క జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రవేశ ప్రచార కరపత్రాన్ని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రవేశాలు ఎక్కువగా నమోదు కావడానికి ప్రణాళిక రూపొందించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి వారిని ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కొప్పుల మల్లేశం మంత్రికి రాజ్యాంగప్రతిని బహుమానంగా అందించారు.

చదవండి: TS DSC 2024 Notification: 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. విభాగం, పోస్టుల సంఖ్య ఇలా..

 

#Tags