TS New Education Minister 2024 : తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం.. ? దాదాపు..
రాష్ట్రమంత్రివర్గ విస్తరణ రెండో దశ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి విన్నవించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మిగిలిన మంత్రి పదవులను ఎవరెవరికి కేటాయించాలనే అంశంపై అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. ప్రొఫెసర్ కోదండరాం కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది .ఎమ్మెల్యే కోటా లేదా గవర్నర్ కోటాలో కోదండరాం ను ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉంది. దీని మీద అతి త్వరలోనే స్పష్టత రానుంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో.. కోదండరాంకు మంత్రిని చేసి విద్యాశాఖ అప్పగించటం ద్వారా ప్రొఫెసర్‌గా ఆయన అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఇక మిగిలిన అయిదు మంత్రి పదవుల్లో..
కోదండరాంకు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా బీఆర్ఎస్ పైన నైతికంగా పై చేయి సాధించవచ్చనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక మిగిలిన అయిదు మంత్రి పదవుల్లో షబ్బీర్ అలీకి ఖాయమని చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్యే పోటీ నడుస్తోంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిసారు. రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకంతో ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావ్ కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. అయినప్పటికీ మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్ పోటీలో ఉన్నా..షబ్బీర్ అలీకి ఓకే అయితే ఫిరోజ్‌ఖాన్‌కి అవకాశాలు సన్నగిల్లుతాయి. అదే సమయంలో కీలకమైన హోం శాఖ ఎవరికి అప్పగిస్తారనేది తేలాల్సి ఉంది.
ఈ జనవరి నెలాఖరులోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీలో ప్రచారం సాగుతోంది. నామినేటెడ్ పోస్టులను కొన్నింటిని ప్రకటించేందుకు కసరత్తు తుది దశకు చేరినట్లు సమాచారం.
☛ Telangana New Cabinet: తెలంగాణలో కాంగ్రెస్ మంత్రులుకు కేటాయించిన శాఖలు ఇవే..
కీలక బేటీ.. దాదాపు..
తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ సారించింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో శనివారం సాయంత్రం నుంచి కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షీలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు ఖాళీగా ఉన్న మంత్రి పదవులపైనా ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన వెలువడవచ్చని సమాచారం. ఈ భేటీకి ముందు.. టీపీసీసీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. అంతకు ముందు.. శనివారం మధ్యాహ్నాం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులో భాగంగానే ఈ వరుస భేటీలనేది స్పష్టమవుతోంది.
సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసి తీరతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లారాయన. ఇక.. ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహణకు రంగం సిద్ధమైన నేపథ్యంలో.. అభ్యర్థుల ఎంపికపైనా ఆయన అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు.