Junior Lineman: జేఎల్‌ఎంలకు స్తంభం పరీక్ష.. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తూ ఈ జాబితా

కొత్తపల్లి(కరీంనగర్‌): క్షేత్రస్థాయిలో కరెంట్‌ సరఫరాలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంతో పాటు మెరుగైన విద్యుత్‌ను వినియోగదారులకు సరఫరా చేయాలన్న లక్ష్యంతో జేఎల్‌ఎంల నియామకానికి విద్యుత్‌ సంస్థ శ్రీకారం చుట్టింది.

 క్షేత్రస్థాయిలో తలెత్తే విద్యుత్‌ సమస్యలను వెనువెంటనే పరిష్కరించే సామర్థ్యం గల అభ్యర్థుల ఎంపికకు 2018 ఫిబ్రవరిలో టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని 16 సర్కిళ్ల పరిధిలో 2,553 జూనియర్‌ లైన్‌మెన్‌(జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ కావడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2018 ఏప్రిల్‌ 8న రాత పరీక్ష నిర్వహించారు.

రాత పరీక్షలో మెరిట్‌ సాధించిన అభ్యర్థులను రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తూ స్తంభం పరీక్షకు పిలిచారు. జేఎల్‌ఎం ఉద్యోగాల ఎంపికకు సర్కిల్‌ను యూనిట్‌గా తీసుకొని స్తంభం పరీక్షకు జాబితా తయారు చేశారు. ఈ జాబితాపై అభ్యర్థుల నుంచి వినతులు సమర్పించగా.. మరికొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు కొంతమందికి స్తంభం పరీక్షలు నిర్వహించారు.

చదవండి: TSSPDCL Recruitment 2023: జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టుల భర్తీకి కమిటీ

మూడు విడతలుగా జేఎల్‌ఎంల స్తంభం పరీక్ష పూర్తి కాగా.. నాల్గో విడతగా విద్యుత్‌ సంస్థ పరిధిలోని సర్కిళ్లలో 264 మంది అభ్యర్థులకు ఫిబ్రవరి 1న స్తంభం పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలోని జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్‌ సర్కిళ్ల పరిధిలో 52 మంది జేఎల్‌ఎం అభ్యర్థులకు స్తంభం పరీక్ష నిర్వహించేందుకు కాల్‌ లెటర్లు పంపించారు. అయితే 52 మంది ఉత్తీర్ణత సాధిస్తారా.. లేదా అన్న విషయం తేలనుంది. ఇక ఇప్పటికే ఈ జేఎల్‌ఎం నియామక ప్రక్రియ ఐదేళ్లుగా కొనసాగుతోంది.

చదవండి: Andhra Pradesh: సర్కారు వరం.. వారంతా ఇక పర్మినెంట్‌ ఉద్యోగులు

1:1 పద్ధతిలో ఈ నియామక ప్రక్రియ చేపట్టడం వల్ల నియామక ప్రక్రియ మరింత ఆలస్యం కానుందని పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ నియామక ప్రక్రియ పూర్తి చేసి జేఎల్‌ఎంలకు పదోన్నతులు కల్పించి మరో నోటిఫికేషన్‌ వేయాల్సిన ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించి జేఎల్‌ఎంల నియామక ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సీజీఎం పర్యవేక్షణలో..

ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు కేటాయించిన 52 జేఎల్‌ఎం పోస్టులకు గాను 1:1 పద్ధతిలో భర్తీ చేసేందుకు స్తంభం పరీక్ష గురువారం నిర్వహిస్తున్నారు. టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ సీజీఎం(హెచ్‌ఆర్డీ) ప్రభాకర్‌ పర్యవేక్షణలో కరీంనగర్‌ సర్కిల్‌ కార్యాలయ ఆవరణలో అభ్యర్థుల స్తంభం పరీక్ష జరగనుంది. సీజీఎంతో పాటు కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ గంగాధర్‌, సీనియర్‌ డీఈ, డీఈ(టెక్నికల్‌), విజిలెన్స్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఒకరు సభ్యుల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. స్తంభం ఎక్కే దృశ్యాలను వీడియోలో చిత్రీకరించి ఎంపిక చేయనున్నారు.

ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్‌ సర్కిల్‌ కార్యాలయ ఆవరణలో స్తంభం పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్తంభాలు ఎక్కే క్రమంలో జారిపడ్డా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉనక పొట్టును అందుబాటులో ఉంచారు. మెడికల్‌ క్యాంపు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక పోలీసుల సహాయాన్ని కోరారు. స్తంభం ఎక్కే ప్రదేశాన్ని జ‌నవ‌రి 31న‌ ఎస్‌ఈ వడ్లకొండ గంగాధర్‌ పరిశీలించారు.

#Tags