Asha Workers: ‘ఆశా’ల నియామకాల్లో అక్రమాలు!

భువనగిరి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తల నియామకాల్లో అక్రమాలకు తెరలేపారు.

వివిధ కారణాలతో కొన్ని సంవత్సరల క్రితం కొంత మంది ఆశా కార్యకర్తలు రాజీనామా చేశారు. దీంతో ఖాళీలు ఏర్పడిన స్థానాల్లో కొత్త వారిని నియమించుకునేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో కొత్త వారి ఎంపికకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. కాగా జిల్లాలో కొందరు వైద్యులు, సిబ్బంది గతంలో డ్రాప్‌ అవుట్‌ అయిన వారి వివరాలు సేకరించి ఆయా పోస్టుల్లో మిమ్ములనే నియమించేలా చేస్తామని ఆశజూపి వారినుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చదవండి: Asha Workers Demands: ఆశ వర్కర్లు డిమాండ్లు ఇవే.. ఫిక్స్‌డ్‌ వేతనం ఇన్ని వేలు?

ఖాళీ పోస్టులు పదమూడే..

జిల్లాలో మొత్తం 707 ఆశా కార్యకర్తలు ఉండాలి. ఇందులో డ్రాప్‌అవుట్‌, మృతి చెందడం, అనారోగ్య కారణాలతో రాజీనామాలు చేయడంతో 13 సబ్‌ సెంటర్‌ పరిధిలో 13 ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ప్రస్తుతం జిల్లాలో 694 మంది ఆశా కార్యకర్తలే పనిచేస్తున్నారు.

తొలిసారి ఆశా కార్యకర్తల నియామకం జరిగేటప్పుడు 7వ తరగతి విద్యార్హతతో పాటు స్థానికంగా నివాసం ఉండాలి. గ్రామ పంచాయతీలో ఎంపికకు సంబంధించి తీర్మానం చేయాలి. కానీ అధికారులు అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు.

కొనసాగుతున్న వసూళ్ల పర్వం

ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల్లో కొత్త వారిని ఎంపిక చేసుకునే విషయంలో కొందరు వైద్యులు, సిబ్బంది గతంలో డ్రాప్‌ అవుట్‌ అయిన వారినే మరలా నియమించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వారి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో ఈ పోస్టులకు తక్కువ వేతనం ఉండేది. ప్రస్తుతం రూ.10 వేల వరకు వేతనం చెల్లిస్తుండగా తమ వేతనం రూ.18వేలకు పెంచాలని ఇటీవల ఆశా కార్యకర్తలు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు తిరిగి మంచి డిమాండ్‌ ఏర్పడింది.

ఒకరికి బదులు మరొకరు విధులు

జిల్లాలో ప్రస్తుతం 694 మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు తమ బదులు మరొకరి చేత విధులు నిర్వహింపజేస్తూ వారికి నెలకు రూ.2 నుంచి రూ.3వేల వరకు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కొందరు ప్రజాప్రతినిధులు సతీమణిలు ఆశా కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. వీరిలో కొందరు హైదరాబాద్‌లో ఉంటూ వారి స్థానంలో మరొకని పెట్టి పచిచేయిస్తూ జీతం తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.

#Tags