No Bag day news: నో బ్యాగ్‌ డే న్యూస్‌

no bag day news

ఎల్లారెడ్డి: శారీరక, మానసిక వికాసంతోపాటు విద్యను అందించాల్సిన పాఠశాలలు అధిక బరువు బ్యాగులు మోస్తున్న విద్యార్థులతో దర్శనమిస్తున్నాయి. విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్‌ మోసే తిప్పలను తప్పించేందుకు ప్రభుత్వం నెలలో ప్రతి నాలుగో శనివారం ‘నోబ్యాగ్‌ డే’ను అమలు చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేసినా.. ఆ నిర్ణయం కాగితాలకే పరిమితమైంది.

Anganwadis Free Tabs News: గుడ్‌న్యూస్‌ అంగన్‌వాడీలకు ఉచిత 5G ట్యాబ్‌లు

స్కూల్‌ బ్యాగ్‌ల అధిక బరువు విషయంలో కేంద్ర ప్రభుత్వం యశ్‌పాల్‌ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ –2020 పేరిట చేసిన మార్గదర్శకాలు మూలనపడ్డాయి. కమిటీ సిఫార్సుల మేరకు 1, 2 తరగతుల విద్యార్థుల స్యూల్‌ బ్యాగ్‌ బరువు 1.6 నుంచి 2.2 కిలోల వరకు, 3 నుంచి 5 తరగతుల స్యూల్‌ బ్యాగ్‌ 2 నుంచి 3 కిలోల వరకు, 6 నుంచి 10వ తరగతి స్కూల్‌ బ్యాగ్‌ 4 నుంచి 5 కిలోల వరకు మాత్రమే బరువుండాలి.

విద్యార్థుల స్కూల్‌ బ్యాగ్‌ల బరువు ఆ విద్యార్థి శరీర బరువులో 10 శాతానికి మించొద్దని సిఫార్సు చేసింది. అయితే, కమిటీ సూచనలు కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం దేశ వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. దిగువ ప్రాథమిక విద్యార్థుల స్కూల్‌ బ్యాగ్‌ బరువే 7 కిలోలకు పైగా ఉండగా 10వ తరగతి స్కూల్‌ బ్యాగ్‌లు 15 కిలోల వరకు ఉంటున్నాయి.

పాఠ్య పుస్తకాలు, క్లాస్‌ వర్క్‌, హోం వర్క్‌, నోట్‌ బుక్స్‌, వర్క్‌ బుక్స్‌, స్పెషల్‌ క్లాస్‌ బుక్స్‌ తదితర పుస్తకాలతోపాటు టిఫిన్‌ బాక్స్‌, వాటర్‌ బాటిల్‌ తదితర వస్తువులను ప్రతిరోజూ తమ భుజాలపై మోస్తున్న విద్యార్థులు శారీరకంగా అవస్థలు పడుతూ జబ్బుల బారిన పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేట్‌ పాఠశాలల స్కూల్‌ బ్యాగ్‌ బరువు మరింత ఎక్కువగా ఉంటున్నది.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విద్యా సంవత్సర కాలెండర్‌లో ప్రతి నాలుగో శనివారం విద్యార్థులు స్కూల్‌ బ్యాగ్‌ లేకుండా బడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో 1032 ప్రభుత్వ పాఠశాలల్లో 86,611 మంది విద్యార్థులు చదువుకుంటుండగా ఏ పాఠశాలల్లో కూడా నో బ్యాగ్‌ డే అమలు కావడం లేదని తెలుస్తోంది.

‘నోబ్యాగ్‌ డే’ నిర్ణయం తీసుకున్న కొత్తలో విద్యార్థులు బ్యాగులు లేకుండా స్కూళ్లకు వెళితే తల్లిదండ్రులు అవగాహన లేక మళ్లీ బ్యాగులు పంపించారని, ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి.

తల్లిదండ్రులే ముందుకు రావాలి..

తమ పిల్లల శారీరక సమస్యలకు కారణమవుతున్న స్కూల్‌ బ్యాగ్‌ల అధిక బరువుపై తల్లిదండ్రులే పాఠశాల యాజమాన్యాలతో మాట్లాడాల్సి ఉందనే అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతోంది. పాఠశాలల యాజమాన్యాలు బ్యాగు బరువును తగ్గించేలా చర్యలు తీసుకునేందుకు ఒత్తిడి తేవాల్సి ఉంది. ఇంటి వద్ద కాకుండా బడిలోనే ఉపయోగించే పాఠ్య, నోట్‌ పుస్తకాలు వంటివాటిని అక్కడే ఉంచేందుకు విద్యార్థులు రెండో సంచిని ఉపయోగించుకునే అవకాశం కల్పించాలి.

సంచి బరువు శారీరక సమస్యలకు దారి తీయకుండా వెడల్పు పట్టీలున్న స్కూల్‌ బ్యాగులను తల్లిదండ్రులు తమ పిల్లలకు అందజేసి బరువు శరీరంపై రెండు వైపులా సమానంగా పడేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి.

తల్లిదండ్రుల ఒత్తిడే కారణం

నో బ్యాగ్‌ డే రోజున స్కూల్‌బ్యాగ్‌లు తీసుకురావొద్దని విద్యార్థులకు సూచించినా వారి తల్లిదండ్రులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. స్కూల్‌ బ్యాగ్‌ లేకుండా పాఠశాలలకు వెళ్లడమేమిటని వారే బలవంతంగా పిల్లలను బ్యాగ్‌లతో పంపుతున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలను మినహాయిస్తే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నో బ్యాగ్‌ డే అమలుకు ప్రయత్నిస్తున్నాం. – వెంకటేశం, మండల విద్యాశాఖ అధికారి, ఎల్లారెడ్డి

#Tags