Private School Vehicles: ప్రైవేటు పాఠశాలల వాహనాలకు మార్గదర్శకాలు విడుదల
చైన్నె: ప్రైవేటు పాఠశాలలకు చెందిన వాహనాలకు మార్గదర్శకాలు గురువారం విడుదలయ్యాయి. ప్రైవేటు పాఠశాలల ఇయక్కం ఈ వివరాలను ప్రకటించింది. ప్రైవేటు పాఠశాలల బస్సులు, వ్యాన్లలో విద్యార్థులను తరలిస్తున్నారు. ఈ వాహనాలు సామర్థ్యంగా, పటిష్టంగా ఉన్నాయా, ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలపై ప్రతి ఏటా సెలవుల సమయంలో అధికారులు తనిఖీ చేస్తుంటారు.
ఈ ప్రక్రియకు ముందుగా ఆయా పాఠశాలల వాహనాలకు మార్గదర్శకాలను ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నుంచి అదనంగా కొన్ని మార్గదర్శకాలను చేర్చారు. ఇందులో ప్రతి వాహనంలోనూ ఒక మహిళా అసిస్టెంట్ తప్పనిసరి చేశారు. ఈ వాహనాలలో అసిస్టెంట్లను నియమించే సమయంలో వారిపై ఏదేని కేసులు ఉన్నాయాని పోలీసుల నుంచి సర్టిఫికెట్ పొందాల్సిన ఉంటుంది. అలాగే, వైద్యుల నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు.
వారంలో ఒక రోజు పాఠశాలల ఉపాధ్యాయినులు, బాలికలతో సమావేశం కావడం, వారికి వాహనాలలో ఏదేని సమస్యలు ఎదురవుతున్నాయా అని ఆరా తీయడం, ఏదేని సమస్యలు ఉంటే విచారణ చేపట్టడం వంటి మార్గదర్శకాలను పొందుపరిచారు. అలాగే పదేళ్లు అనుభవం కలిగిన వారినే డ్రైవర్లుగా నియమించే విధంగా , వారి లైసెన్సుల రెన్యువల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టే రీతిలో మరికొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. నిర్ణీత సంఖ్య కంటే అధికంగా పిల్లలను వాహనాలలో ఎక్కిస్తే చర్యలు తప్పవన్న హెచ్చరికలు జారీ అయ్యాయి.