10th class news: 10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్...
కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతి పరీక్షలు పూర్తయి ఇటీవలే ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పుడు సంబంధిత విద్యార్థులంతా పది అనంతరం చేరాల్సిన కోర్సులపై దృష్టిని కేంద్రీకరించారు. ఇప్పటికే పాలిసెట్, రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్షలు పూర్తయి ఫలితాలు కూడా ప్రకటించారు.
దీంతో పలువురు విద్యార్థులు వారి ఆసక్తిని బట్టి ఏ కోర్సులో చేరాలా అని ఆలోచనలో ఉన్నారు. అయితే అధికశాతం మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరుతున్నారు. ఇంకా విద్యార్థులు టెక్నికల్ కోర్సులైన పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యమిస్తారు.
పదవ తరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐ కోర్సులతో ఒక చక్కటి బాటను ఏర్పాటు చేస్తాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
18 ఏళ్లు దాటగానే
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు...
ఐటీఐ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటిస్ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఐటీఐ ఒక చక్కటి మార్గంగా ఉంటుంది. విద్యుత్తు, రైల్వే, రక్షణ, పలు ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు త్వరితగతిన లభిస్తాయి. అయితే ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు స్కిల్ తప్పని సరిగా ఉండాలి. ఆయా ట్రేడుల్లో నైపుణ్యం సంపాందించిన విద్యార్థులకు ఉపాధి తప్పని సరిగా లభిస్తుంది. ఇదిలా ఉంటే రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ, ఐటీఐల్లో స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య అంశాలపై శిక్షణ కూడా ఇస్తోంది. ఉద్యోగం, ఉపాధితోపాటు స్వయం ఉపాధి సైతం ఐటీఐ కోర్సు ఎంతో దోహదం చేస్తుంది.
జిల్లాలో 32 ఐటీఐలు...
జిల్లాలో 10 ప్రభుత్వ, 22 ప్రైవేటు ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి కడపలో డీఎల్‌డీసీ, మైనార్టీ ఐటీఐ, బాలికల ఐటీఐలతోపాటు చక్రాయపేట, వేముల, లింగాల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైలవరం, తొండూరులలో ఉన్నాయి. ఇందులో కడపలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో హాస్టల్ వసతి కూడా ఉంది. ఇందులో ఉచిత వసతిలోపాటు భోజనం సౌకర్యం కూడా ఉంది. వీటిల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి పదవ తరగతి మార్కులతోపాటు మెరిట్, రూల్స్ అఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. మిగతా 22 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి.
కోర్సుల వివరాలు ఇలా...
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ఏడాది, రెండు సంవత్సరాలకు సంబంధించిన పలు కోర్సులు ఉన్నాయి. ఇందులో రెండు సంవత్సరాలకు సంబంధించి ఎలక్ట్రికల్, ఫిట్టర్, మోటర్ మెకానిక్, డ్రాఫ్ట్‌స్‌మన్ సివిల్, టర్నర్, మిషినిస్టు కోర్సులు ఉన్నాయి. అలాగే ఏడాదికి సంబంధించిన కోర్సుల్లో డ్రస్ మేకింగ్, కంప్యూటర్ కోర్సు(కోప) డీజల్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్ కోర్సులు ఉన్నాయి. ఇందులో ఏడాదికి సంబంధించిన డ్రస్ మేకింగ్ కోర్సు కడప ప్రభుత్వ బాలికల ఐటీఐలో మాత్రమే ఉంది. ఇందులో చేరిన బాలికలకు భోజనంతోపాటు ఉచిత వసతి సౌకర్య ఉంది.
ఉన్నత చదువులకు అవకాశం...
ఐటీఐలో రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులు పూర్తి చేసిన వారికి ఉన్నత చదువులకు అవకాశం ఉంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు బీటెక్‌లో ప్రవేశం పొందవచ్చు. ఈ విధంగా ఏటా పలువురు లేటరల్ ఎంట్రీని పొంది ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగ అవకాశాలను పొందుతున్నారు.
టెక్నికల్ కోర్సులతో
విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
పారిశ్రామిక శిక్షణ ప్రవేశాలకు తొలి దశ నోటిఫికేషన్ విడుదల
వివిధ ట్రేడుల్లో అడ్మిషన్లకు
జూన్ 10 తుది గడువు
వైఎస్సార్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 3934 సీట్లు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి...
ఐటీఐలో చేరదలిచే విద్యార్థులు జూన్ 10వ తేదీలోగా ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సమీప ప్రభుత్వ ఐటీఐలకు విధిగా వెళ్లి వెరిిఫికేషన్ చేయించుకోవాలి. కౌన్సిలింగ్ షెడ్యూల్ వివరాలను విద్యార్థులకు మొబైల్ నంబర్‌కు పంపిస్తాం. పదవ తరగతిలో విద్యార్థి పొందిన మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అడ్మిషన్లు ఉంటాయి.