FA-1 exams in AP: నేటి నుంచి ఫార్మేటివ్‌ – 1 పరీక్షలు

విశాఖ విద్య: ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో మంగళవారం నుంచి ఫార్మేటివ్‌ – 1 / క్లాస్‌ రూమ్‌ బేస్డ్‌ అసెస్మెంట్‌ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. వీటి నిర్వహణకు విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల విద్యాశాఖాధికారులు అంతా సిద్ధం చేశారు. 2023 – 24 విద్యా సంవత్సరానికి ఇవే తొలి పరీక్షలు కావడం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా టోఫెల్‌ పరీక్ష నిర్వహిస్తుండడంతో విద్యాశాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ప్రైవేటు పాఠశాలల్లో సొంతంగా తయారు చేసుకున్న ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించుకునే వారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన పాఠ్య పుస్తకాలతోనే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధన సాగుతున్నందున, ఒకే విధానంలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖాధికారులు ఆదేశించారు. ప్రశ్నాపత్రాలను కూడా ఎస్‌సీఈఆర్‌టీ ద్వారానే సరఫరా చేస్తున్నారు. క్లాస్‌ రూమ్‌ బేస్డ్‌ అసెస్మెంట్‌ నిర్వహణ కోసం ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులందరికీ ఎస్‌సీఈఆర్‌టీ తయారు చేసిన ప్రశ్నాపత్రాలతోపాటు, ఓఎమ్మార్‌ షీటు కూడా ఇస్తారు. జవాబులను ప్రశ్నాపత్రంలో టిక్‌ చేయటంతోపాటు రాయాలి. అదేవిధంగా ఓఎమ్మార్‌ షీట్‌లో బబుల్‌ చేయాలి. పరీక్షలకు అవసరమైన సామాగ్రిని జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు ద్వారా పాఠశాలలకు సరఫరా చేశారు.

60 మంది విద్యార్థులకు కళ్ల కలక

తొలిసారిగా టోఫెల్‌ పరీక్ష
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన సాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు తొలిసారిగా ‘టోఫెల్‌’ పరీక్ష నిర్వహిస్తున్నారు. ‘ఇంగ్లిష్‌ పేపర్‌ పార్ట్‌ – బీ’లో టోఫెల్‌కు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానెల్‌, స్మార్ట్‌ టీవీలు అందుబాటులో ఉన్న పాఠశాలల్లో టోఫెల్‌ పరీక్షను తప్పనిసరిగా నిర్వహించాలని, మిగతా చోట్ల ఉపాధ్యాయుల ఆసక్తి మేరకు నిర్వహించొచ్చని విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఫార్మేటివ్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రశ్నాపత్రాలను పాఠశాలలకు సరఫరా చేశాం. టోఫెల్‌ పరీక్షను తొలిసారిగా నిర్వహిస్తున్నందున ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. జవాబు పత్రాల మూల్యాంకనం సకాలంలో పూర్తి చేసి, ఉన్నతాధికారులకు నివేదించాలి.
– ఎం.వి.కృష్ణ కుమార్‌, డీసీఈబీ సెక్రటరీ, ఉమ్మడి విశాఖ జిల్లా

School Education Department: క్లాస్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు తేదీలు ఇవే

#Tags