Govt High School: ఇది మా స్కూలేనా..!

‘మా రోజుల్లో బ్లాక్‌బోర్డులు ఉండేవి.. ఇప్పుడు వీరికి ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ ఉన్నాయి. మాకు టాయిలెట్స్‌ కూడా సరిగా లేవు. ఇప్పుడున్న వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటయ్యాయి. మేమున్నప్పుడు గచ్చులైతే పాడైపోయి ఉండేవి. ఈ స్టూడెంట్లకు గ్రానైట్‌ పలకలతో ఫ్లోర్‌ వేశారు. ఆర్‌ఓ ప్లాంట్‌, కిచెన్‌ రూమ్‌, సైన్స్‌ ల్యాబ్‌.. ఇన్ని ఉన్నాయా ఇక్కడ..? ఇదసలు మన స్కూలేనా..’ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన పాత విద్యార్థుల అభిప్రాయమిది. రెండు రోజుల పాటు తాము చదువుకున్న బడిని చూసిన మాజీ విద్యార్థులు ఇక్కడ జరిగిన మార్పులు గమనించి అబ్బురపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న కృషిని మనసారా మెచ్చుకున్నారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధ, గురువారాల్లో పూర్వ విద్యార్థులు పరిశీలించారు. తాము చదువుకున్న రోజుల్లో పాఠశాలను, ప్రస్తుత తరగతి గదులను పోల్చి చూసి ఆశ్చర్యపోయారు. డిజిటల్‌ తరగతులు చూసి చాలా మంది అబ్బురపడిపోయారు. తరగతుల్లో నల్లబల్ల స్థానంలో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ (ఐఎఫ్‌పీ)లను అమర్చి ఉండటాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. సైన్స్‌ ల్యాబులు, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌, టాయిలెట్లు చూసి ఆనందించారు. వీటిలో కొన్ని సౌకర్యాలు పూర్వ విద్యార్థులు సమకూర్చినట్టు హెచ్‌ఎం చెప్పారు. ఇదే పాఠశాలలో చదువుకున్న నటుకుల మోహన్‌, దుప్పల రవీంద్ర, బొత్స వెంకటరావు, ప్రకాష్‌బాబు బుక్స్‌ స్టాల్‌ శివ, మ్యాథ్స్‌ అసిస్టెంట్‌ గుప్తా, వివిధ బ్యాచ్‌లుగా వచ్చి పాఠశాలలో జరిగిన నాడు–నేడు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు గోవిందరావు, రవికుమార్‌, తేజేశ్వరరావు, మల్లేశ్వరరావు, ఖగేశ్వరరావు, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీఈఓ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం బడులకు కొత్త శోభ ను తీసుకువచ్చిందని తెలిపారు. ఇందులో భాగంగానే మనబడి నాడు–నేడు పేరిట ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనే సంకల్పంతో సరికొత్త సంస్కరణకు నాంది పలికారని తెలిపారు.

సీఎం ఆలోచన చాలా గొప్పది..
ఈ స్కూల్‌లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకుని 1985 రిలీవ్‌ అయ్యాను. 30 సంవత్సరాల కింద మేము చదువుకున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఒక పాఠశాలకు కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలను ప్రభు త్వం సమకూర్చుతోంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. సీఎం జగన్‌ ఆలోచన, దూరదృష్టి చాలా గొప్పదని చెప్పక తప్పదు.
– దుప్పల రవీంద్ర, పూర్వ విద్యార్థి, వ్యాపారవేత్త

తమ పాఠశాలను చూసి అబ్బురపడిన శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు నాడు–నేడు పనులు చూసి ముచ్చటపడిన వైనం ప్రభుత్వ కృషిని మనసారా మెచ్చుకున్న ఓల్డ్‌ స్టూడెంట్లు

రూ.1.16 కోట్ల నిధులతో..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫేజ్‌–2లో రూ. కోటీ 16 లక్షల నిధులతో అదనపు తరగతుల భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. 10 తరగతి గదులతో నిర్మించిన భవనంలో అనేక వసతులు, సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దినట్టు ఆ పాఠశాల హెచ్‌ఎం, శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి ఎం.విజయకుమారి పేర్కొన్నారు.

నాడు–నేడు పేరుకు తగ్గట్టుగానే ఉంది..
నేను ఇదే పాఠశాలలో 1970 నుంచి 1980 వరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నాను. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉందని అనే కంటే.. వంద శాతం తేడా ఉందనే చెప్పాలి. మాకు బ్లాక్‌బోర్డు ఉండేది. టాయ్‌లెట్స్‌ ఉండేవి కావు. తాగునీరు ఉండేది కాదు. ఇంటి నుంచి ఎవరి భోజనం వారే తెచ్చుకునేవారం. ఉపాధ్యాయుల కొర త ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం నాడు–నేడు పేరుతో అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించింది. డిజిటల్‌ విద్య పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంది. సీఎం విజన్‌కు హ్యాట్సాఫ్‌.
– నటుకుల మోహన్‌, పూర్వ విద్యార్థి

ప్రభుత్వం విద్యకు పెద్దపీట
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యకు పెద్దపీట వేస్తోంది. అమ్మఒడి మొదలుకుని విద్యాకానుక, గోరుముద్ద, సీబీఎస్సీ సిలబస్‌, ఇంగ్లీషు మీడియం, మిర్రర్‌ ఇమేజ్‌ పాఠ్యపుస్తకాలు ఇలా ఎన్నో పథకాలు, కార్యక్రమాలు తీసుకువచ్చారు. నాడు–నేడుతో పాఠశాలలను స మూలంగా మార్చారు. అన్ని వసతులు, సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. పాఠశాలలో రూ.1.16 కోట్ల నిధులతో 10 అదనపు తరగతులతో కూడిన భవనాన్ని నిర్మించారు.
– ఆర్‌.విజయకుమారి, హెచ్‌ఎం/ శ్రీకాకుళం డివిజన్‌ ఉప విద్యాశాఖాధికారి

#Tags