TREIRB Gurukulam Results Out: ‘గురుకుల’కు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు విడుదల చేసింది. ఫిబ్రవరి 7న తెల్లవారుజామున 3గంటల సమయంలో సంక్షేమ గురకుల డిగ్రీ కాలేజీల్లోని ఫిజికల్‌ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్‌ ఉద్యోగాలకు, సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్‌ ఉద్యోగాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో ప్రాథమిక జాబితాలను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

అదేవిధంగా గురువారం రాత్రి గురుకుల పాఠశాలల్లోని ఫిజికల్‌ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్, పోçస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ.... వాటిని బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

1:2 నిష్పత్తిలో అర్హత సాధించిన అభ్యర్థులకు గురుకుల బోర్డు ఫోన్‌లలో సంక్షిప్త సమాచారం(ఎస్‌ఎంఎస్‌) ద్వారా సమాచారం ఇచ్చింది. సాంకేతిక కారణాలతో టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌ మొరాయించడంతో అభ్యర్థులు జాబితాలను పరిశీలించుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. గురువారం సాయంత్రం తర్వాత వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు అధిగమించడంతో వెబ్‌సైట్‌ తిరిగి తెరుచుకుంది. 


నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన... 
ఫిజికల్‌ డైరెక్టర్, లైబ్రేరియన్‌ ఉద్యోగాలకు సంబంధించి టీఆర్‌ఈఐఆర్‌బీ 1:2 నిష్పత్తిలో విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభించనుంది. వివిధ కేటగిరీల్లో ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 9వ తేదీన ఉదయం 9గంటల నుంచి చైతన్యపురి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల న్యాయ కళాశాల(ఉమెన్‌)లో ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది.

అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్సుపత్రాలు, సెల్ఫ్‌ అటెస్టేషన్‌ పత్రంతో హాజరు కావాల్సి ఉంటుంది. చెక్‌లిస్టును బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని గురుకుల బోర్డు కన్వీనర్‌ అభ్యర్థులకు సూచించారు. 

10 నుంచి డెమో పరీక్షలు... 
ప్రస్తుతం విడుదల చేసిన 1:2 జాబితాల్లో ఎంపికైన అభ్యర్థులకు డెమో పరీక్షలను గురుకుల బోర్డు నిర్వహించేందుకు కసరత్తు వేగవంతం చేసింది. గురుకుల జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు సంబంధించి ఫిజికల్‌ డైరెక్టర్, లైబ్రేరియన్‌ ఉద్యోగాలకు అదేవిధంగా పాఠశాలల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి డెమో పరీక్షలు నిర్వహిస్తారు.

తుది జాబితాలో అర్హత సాధించిన వారికి ఫిబ్రవరి 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు సంక్షేమ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.  
 

#Tags