ఎన్నో కష్టాలు, వేధింపులను ఎదుర్కొని...నేడు ఈ స్థాయికి

బిడ్డ ఆశయాన్ని గుర్తించింది. ఆమె కలను నెరవేర్చాలని ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంది. ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారి..ఎదురొడ్డి నిలిచింది.

తన బిడ్డకు అండగా నిలబడింది. చివరకు ఆమె కృషి ఫలించింది. కన్నబిడ్డను కలెక్టర్‌ను చేసింది..ఆ కలెక్టర్‌కు అమ్మగా ఎనలేని సంతోషాన్ని మూటగట్టుకుంది కర్నాటక ఐఏఎస్‌ అధికారిణి రోహిణీ సింధూరి తల్లి శ్రీలక్ష్మీరెడ్డి. విదేశాలకు వెళ్లమంటే తిరస్కరించి..కలెక్టర్‌నవుతానంటూ మారాం చేసిన సింధూరి కలను నిజం చేసిన శ్రీలక్ష్మీరెడ్డి..ఆ క్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, కష్టాలు, సవాళ్ల గురించి 'సాక్షి'తో పంచుకున్నారు. ఆ విషయాలు శ్రీలక్ష్మీరెడ్డి మాటల్లోనే...

కుటుంబ నేప‌థ్యం :
మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామం. మావారు దాసరి జయపాల్‌రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. మాది చాలా పెద్ద కుటుంబం. మా పెద్దమ్మాయి రోహిణీ సింధూరిని విదేశాలకు పంపించి ఉన్నత చదువులు చదివించాలనుకున్నాం. కానీ సింధూరి ఒప్పుకోలేదు. ఇండియాలోనే ఉంటానని ఖరాకండిగా చెప్పేసింది. చేసేదేం లేక ఇంజనీరింగ్‌లో చేర్పించాం. ఇంజనీరింగ్‌ చదువుతున్న సమయంలో కూడా మళ్లీ అమెరికా గురించి అడిగితే చిరాకుపడింది. ఇక వదిలేశాం.

ఈ కోరికతోనే సివిల్స్‌ వైపు దృష్టి...
నాకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. 1990 నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాను. నా సేవా కార్యక్రమాలు చూసి సింధూరి ఇన్‌స్పైర్‌ అయింది. తాను కూడ ప్రజలకు సేవచేయాలనుకుంది. అందుకు ఐఏఎస్‌ బెస్ట్‌ మార్గం అనుకుంది. ''అమ్మా నేను కలెక్టర్‌ అవుతా'' అన్నది. ''కలెక్టర్‌ అయితే ఎంచక్కా ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు సేవ చేయోచ్చు. కాబట్టి నన్ను సివిల్స్‌లో చేర్పించండంటూ'' కోరింది. ఆమె కోరిక మేరకు హిమాయత్‌నగర్‌లోని ఆర్‌.సి.రెడ్డి కోచింగ్‌ సెంటర్‌లో సివిల్స్‌లో చేర్పించాం.

మెయిన్స్‌ సమయంలో యాక్సిడెంట్‌ అయినా...
మెయిన్స్‌ కోసం సింధూ ఢిల్లీ వెళ్లింది. ఆ సమయంలో పొద్దున్నే తను పాలప్యాకెట్‌ కోసం కిరాణా స్టోర్‌కి వెళ్లింది. పాలు తీసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో కారు ఢీకొంది. ఆ సమయంలో సింధూ తీవ్ర గాయలపాలయ్యింది. మాకు చెబితే మేం కంగారు పడ్తాం అని తన స్నేహితురాలికి ఫోన్‌ ద్వారా చెప్పింది. ఆమె నాకు ఫోన్‌ చేసి చెప్పడంతో నేను ఢిల్లీ పయనమై వెళ్లి అక్కడ ఒక ఇల్లు తీసుకుని ఉన్నాం. బెడ్‌ మీద పడుకునే చార్ట్‌లపై క్వశ్చన్స్‌ అండ్‌ ఆన్సర్స్‌ని రాసుకోవడం, వీల్‌ఛైర్‌లో కూర్చుని గోడలపై పెద్దపెద్ద అక్షరాలతో రాతలు రాయడం చేసింది. ఆఖరికి బాత్‌రూమ్‌లోని గోడలపై కూడా తను రాతలు రాసి ప్రిపేర్‌ అయింది. ఆ రోజులు గుర్తొస్తే...కన్నీరు ఆగదు నాకు.

అమ్మా నేను ఇంకా కాలేజీకి వెళ్లను అన్నది...
సింధూకి దేవుడు అందమైన రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపం కోసం ఎందరో పోకిరీలు ఎన్నో సందర్భాల్లో సింధూని వేధించారు. తను కాలేజీకి వెళ్తున్న సమయంలో చాలా మంది వెంటపడి ఏడిపించిన సందర్భాలు ఉన్నాయి. ''అమ్మా నేను ఇంకా కాలేజీకి వెళ్లను. ప్రతి ఒక్కడు నాతో మాట్లాడు, లేదంటే బాగోదు అంటూ బెదిరిస్తున్నారు'' అని చెప్పి ఏడ్చేది. చేసేదేమీ లేక మూడు కాలేజీలు మార్చాం. ఎన్ని కాలేజీలు మార్చినా సింధూపై వేధింపులు మాత్రం ఆగలేదు. ఆ సమయంలో తల్లిగా నేను తనలో ధైర్యాన్ని నింపాను. సమాజంలో ఎలా ఉండాలి, అబ్బాయిల నుంచి వేధింపులు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఓ స్నేహితురాలిగా వివరించా. అప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ ఎదురించి నిలబడింది.

వచ్చేదా..చచ్చేదా అన్నారు...
బంధువుల నుంచి సింధూకి ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. తనకు నచ్చకపోవడం వల్ల మేం తిరస్కరించాం. ఆ సమయంలో ‘ఏంటి మీరు లక్షలు పోసి చదివిస్తున్నారు? అసలు ఆమెకు ఐఏఎస్‌ వచ్చేదా..చచ్చేదా..? ఏం..మా వాడికిచ్చి పెళ్లి చేస్తే ఏమౌవతదంట? అంటూ ఎంతో మంది సూటిపోటి ప్రశ్నలతో నన్ను వేధించారు. కానీ నేను ఏనాడూ సింధూ వద్ద ప్రస్తావించలేదు. తను కలెక్టర్‌ అయ్యాక కానీ వారంతా నోరుమసూకున్నారు. నా బిడ్డ నన్ను తల ఎత్తుకునేలా చేసిందని గర్వపడుతున్నాను. అసలు మా వంశంలో కలెక్టర్‌ అయినవారు ఏవరూ లేరు.

 
ఆమె కోసం జనం రోడ్లెక్కారు అంటే..
రోహిణీ సింధూరి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌ జిల్లా డీసీగా పనిచేస్తున్నారు. అక్కడి ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో స్థానికుల నుంచి ఆమెకు పెద్దఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. ఇటీవల రెండు, మూడు ఇష్యూస్‌లో అక్కడి మంత్రులు ఆమెను విభేదించారు. ట్రాన్స్‌ఫర్‌ చేయాలని పట్టుబట్టారు. దీంతో ఆమెకు ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్స్‌ కూడా వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజానీకం ఆమెను ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి వీలు లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనం రోడ్లెక్కి ధర్నాలు, ఉద్యమాలు చేయడంతో ప్రభుత్వం మూడుసార్లు ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్స్‌ ఇచ్చి వెనక్కి తీసుకుంది. నిజాయితీ కలిగిన ఓ కలెక్టర్‌ని వేధిస్తే..ప్రజల నుంచి ఎలా ఇబ్బందులు వస్తాయో..ప్రభుత్వమే స్వయంగా గుర్తించింది.
 

మ‌రిన్ని స‌క్సెస్ స్టోరీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి







#Tags