రెండేళ్ల శ్రమకు దక్కిన ఫలితం.. డాక్టర్ మడిపల్లి రవిజేత, పీజీఎంఈటీ ఫోర్త్ ర్యాంకర్

రెండేళ్ల పాటు తీవ్రంగా శ్రమించా.. దాంతో మంచి ర్యాంకు వచ్చింది. రాబోయే రోజుల్లో మెడికల్ పీజీలో పోటీ ఎక్కువవుతుంది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆసుపత్రి నిర్మించి వైద్యసేవలు అందించాలనేది తన జీవిత లక్ష్యం అంటున్న పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రెన్స్ 2013 నాలుగో ర్యాంకర్ డాక్టర్ మడిపల్లి రవిజేత సక్సెస్ స్టోరీ...

నమ్మలే నంత ఆనందం
మాది హైదరాబాద్, నాన్న వెంకటాచలం కాంట్రాక్టర్. అమ్మ ఫార్వరివెంకట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఇంటర్ వరకూ ఇక్కడే చదివా. మెడిసిన్ గుంటూరు ఎన్.ఆర్.ఐ మెడికల్ కాలేజ్‌లో పూర్తిచేశా. పదోతరగతి చదువుతున్నపుడు మా వదినకు ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చింది. అప్పుడే మొదటిసారి.. మెడిసిన్ అంటే తెలిసింది. పదోతరగతిలో 497, ఇంటర్‌లో 777 మార్కులు వచ్చాయి. మెడిసిన్ ఎన్.ఆర్.ఐ(గుంటూరు)లో 67.67 శాతంతో పాసయ్యా. పీజీ ఎంట్రన్స్‌లో 163 మార్కులు వచ్చాయి. గాంధీ, ఉస్మానియలో పీజీ చేయాలనుంది. టాప్ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది.

శ్రమకు ఫలితం:
చాలా తీవ్రమైన పోటీ. వచ్చే సంవత్సరం నుంచి నీట్ తప్పదనే భయంతో ఎవరికి వారు.. చాలా సీరియస్‌గా పరీక్షకు సిద్ధమయ్యారు. నేనైతే రెండేళ్లపాటు రోజుకు ఏడెనిమిది గంటలపాటు శ్రమించా. చెన్నైకు చెందిన కోచింగ్‌సెంటర్‌లో తీసుకున్న శిక్షణ బాగా ఉపకరించింది. కోచింగ్‌కు వెళుతూనే.. బేసిక్స్, సబ్జెక్టుకు సంబంధించి నోట్స్ తయారుచేసుకున్నా. కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా చదివా. సొంతగా మెటీరియల్ తయారచేసుకున్నా. ఏ సందేహం వచ్చినా వెంటనే నోట్‌బుక్‌లో వెతికేవాణ్ని. దీంతో సమస్య వచ్చినపుడు.. నోట్‌బుక్‌లో సమాధానం ఎక్కడుందో ఠక్కున గుర్తుకొచ్చేది.

పోటీకి తగినట్లుగా చదవాలి:
రాబోయే రోజుల్లో మెడికల్ పీజీలో పోటీ ఎక్కువవుతుంది. ఇప్పటికే ఉన్న కాంపిటేషన్‌లో
నెగ్గుకురావటం కష్టంగా ఉంది. జాతీయస్థాయిలో పరీక్ష నిర్వహిస్తే.. వేలాదిమందితోకాదు.. బయట రాష్ట్రాల నుంచి వచ్చే వారితోనూ పోటీపడాలి. అందుకే ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచే పీజీ లక్ష్యం కావాలి. సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలి. హౌస్‌సర్జన్ పూర్తయ్యాక చూద్దాంలే! అనుకుంటే కుదరదని గుర్తించాలి.

సేవలందిస్తా:
జనరల్ మెడిసన్‌లో చేరతా. రోగులకు దగ్గరగా ఉండి, వైద్యం అందించేందుకు ఏకైకమార్గం జనరల్ ఫిజీషియన్. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆసుపత్రి నిర్మించి వైద్యసేవలు అందించాలనేది నా జీవిత లక్ష్యం. ఉన్నత వర్గాలకు డబ్బుంది.. పేదప్రజలకు ప్రభుత్వం సాయం చేస్తుంది. కాబట్టి.. వైద్యానికి సంబంధించినంత వరకూ ఆ రెండు వర్గాలకు పెద్దగా ఇబ్బంది ఉండదనేది నా అభిప్రాయం.








#Tags