PG Medical Admissions: ఏం చేద్దాం?.. హైకోర్టు తీర్పుతో కౌన్సెలింగ్‌పై సర్కార్ సమాలోచనలు.. అసలు వివాదం ఇదీ..
‘స్థానిక’ వివాదంతో నిలిచిన ప్రవేశాలు
గత అక్టోబర్ నెలాఖరున 2024–25 సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. కాళోజీ వర్సిటీకి, నిమ్స్‌కు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.
నీట్ పీజీ–2024లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు. వెంటనే కౌన్సెలింగ్ ప్రారంభమవ్వాల్సి ఉండగా.. ’స్థానికత’ నిబంధనపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
ఈ జాప్యం ఇప్పటికే పీజీ మెడికల్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన పీజీ విద్యార్థులకు సైతం ఇబ్బందిగా మారింది. ఈ విద్యా సంవత్సరానికి మొదటి ఏడాది అడ్మిషన్లు పూర్తయితే తప్ప.. ఇప్పటికే మొదటి సంవత్సరం పూర్తయినవారు అక్కడి నుంచి రిలీవ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది.
వివాదం ఇదీ..
- తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులు సైతం ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ పూర్తి చేస్తే.. వారు తెలంగాణలో పీజీ మెడికల్ అడ్మిషన్లలో స్థానికేతరులు అవుతారని ప్రభుత్వం జారీచేసిన 148, 149 జీవోల్లో స్పష్టం చేయడంతో వివాదం మొదలైంది.
- అలాగే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించిన పీజీ మెడికల్ నోటిఫికేషన్ ప్రకారం స్థానిక అభ్యర్థి అంటే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వరుసగా నాలుగు సంవత్సరాలకు తక్కువ కాకుండా తెలంగాణలో చదివి ఉండాలి. ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్ కూడా ఇక్కడే చదివి ఉండాలి.
- విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చదివిన తెలంగాణ విద్యార్థులు కూడా స్థానికులేనని కాళోజీ వర్సిటీ ప్రకటించింది.
- ఈ ఉత్తర్వుల వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వారు అటు ఏపీలో, ఇటు తెలంగాణలోనూ స్థానికులు కాకుండా పోతున్నారనే ఆందోళన వ్యక్తమైంది.
- నీట్ పరీక్ష కారణంగా తెలంగాణకు చెందిన టాప్ ర్యాంకర్లు ఎక్కువగా జాతీయస్థాయిలో ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్‌లో చేరుతున్నారు. వారు ఈ జీవోల వల్ల రాష్ట్రంలో పీజీ మెడికల్ అడ్మిషన్లలో స్థానికేతరులు అవుతున్నారు.
- ఇంటర్మీడియేట్ వరకు ఇతర రాష్ట్రాల్లో చదివి, ఎంబీబీఎస్ తెలంగాణలో చదివినప్పటికీ జీవో 148, 149 వల్ల స్థానికేతరులే అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ స్థానికత ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ చదివినా.. తెలంగాణ స్థానికత లేకుండా ఇక్కడ ఎంబీబీఎస్, బీడీఎస్ చదివినా కూడా స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |