TG LAWCET & PGLCET Toppers: లాసెట్‌లో 72.66 శాతం ఉత్తీర్ణత

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాద విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (లాసెట్‌)లో ఈ ఏడాది 72.66 శాతం మంది అర్హత సాధించారు.

మూడేళ్ల కాలపరిమితి ఉన్న లా కోర్సులో 73.27 శాతం, ఐదేళ్ల లా కోర్సులో 65.12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పోస్టు–గ్రాడ్యుయేషన్‌ లాసెట్‌ (పీజీఎల్‌సెట్‌)లో 84.65 శాతం మంది అర్హత సాధించారు. లాసెట్‌ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి జూన్ 13న‌ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా లాసెట్‌ కన్వినర్‌ బి.విజయలక్ష్మి మాట్లాడుతూ, మూడేళ్ల లా కోర్సుకు 27,993 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 25,510 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఐదేళ్ల కోర్సుకు 8,412 మంది హాజరుకాగా, 5,478 మంది ఉత్తీర్ణులయ్యారని, పీజీఎల్‌సెట్‌కు 3,863 మంది హాజరుకాగా, 3,270 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. లాసెట్, పీజీఎల్‌సెట్‌కు ఈసారి మొత్తం 50,684 మంది దరఖాస్తు చేసుకోగా, 40,268 మంది హాజరయ్యారని చెప్పారు.

చదవండి:Artificial Intelligence: ఏఐని నియంత్రించడానికి ఈయూ చట్టం

వారిలో 29,258 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఈసారి లాసెట్‌కు ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు హాజరైన నలుగురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రిజి్రస్టార్‌ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్‌ జి.బి.రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్లు వి.వెంకటరమణ, ఎస్‌కే మహమూద్, కార్యదర్శి శ్రీరామ్‌ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

టాపర్లు వీరే.. 

మూడేళ్ల లా కోర్సులో హైదరాబాద్‌కు చెందిన పీజీఎం అంబేడ్కర్‌ 97.49 మొదటి ర్యాంకు, గచ్చిబౌలికి చెందిన ప్రత్యూష్‌ సరస 96.65 రెండో ర్యాంకు, ఖమ్మం జిల్లా సింగరేణికి చెందిన తల్లూరి నరేష్‌ 95.74 మార్కులతో మూడు ర్యాంకు సాధించారు. అలాగే ఐదేళ్ల లా కోర్సులో మియాపూర్‌కు చెందిన శ్రీరాం బొడ్డు 87 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, కామారెడ్డికి చెందిన పిప్పిరిశెట్టి దినేష్‌ 87 మార్కులతో రెండో ర్యాంకు, మల్కాజిగిరికి చెందిన ఆర్పీ విజయనందిని 84 మార్కులతో మూడు ర్యాంకు పొందారు. 

పీజీఎల్‌సెట్‌లో సికింద్రాబాద్‌కు చెందిన పెరి బాలసాయి విష్ణువర్ధన్‌ 76 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాకు చెందిన అభినీతి జాసన్‌ 70 మార్కులతో రెండో ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన నిమన్‌ సిన్హా 67 మార్కులతో మూడో ర్యాంక్‌ సాధించారు.  
 

#Tags