EPFO New Rules: ఈపీఎఫ్‌వోలో కొత్త ఏడాది ముఖ్యమైన మార్పులు ఇవే..

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మార్గదర్శకాలు, విధానాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురానుంది. వీటిలో చాలా మార్పులు రాబోయే ​కొత్త సంవత్సరంలో అమలులోకి వస్తాయని భావిస్తున్నారు. వీటితోపాటు పలు కొత్త సేవలను పరిచయం చేయనుంది. పీఎఫ్‌ ఖాతాదారులకు సౌకర్యాన్ని మెరుగుపరచడమే ఈ అప్‌డేట్‌ల ప్రధాన లక్ష్యం. కొత్త ఏడాదిలో ఈపీఎఫ్‌వోలో వస్తున్న ముఖ్యమైన మార్పులు.. చేర్పులు ఏంటన్నది ఇక్కడ తెలుసుకుందాం.

ఉద్యోగి కంట్రిబ్యూషన్ పరిమితి

ఈపీఎఫ్‌వో ముఖ్యమైన అప్‌డేట్‌లో ఉద్యోగుల ఈపీఎఫ్‌ ( EPF ) కంట్రిబ్యూషన్ పరిమితి తొలగింపు ఒకటి. ప్రస్తుతం, ఉద్యోగులు ప్రతి నెలా వారి ప్రాథమిక వేతనంలో 12% తమ ఈపీఎఫ్‌ ఖాతాకు కేటాయిస్తున్నారు.

ఈ బేసిక్‌ వేతనాన్ని రూ. 15,000 లుగా ఈపీఎఫ్‌వో నిర్దేశించింది. దీనికి బదులుగా ఉద్యోగులు తమ వాస్తవ జీతం ఆధారంగా ఈపీఎఫ్‌ ఖాతాకు కేటాయించుకునేలా కొత్త ప్రతిపాదన ఉంది. ఇది అమలులోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు పదవీ విరమణ నిధిని భారీగా కూడగట్టుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా నెలవారీ పెన్షన్ చెల్లింపు ఎక్కువగా ఉంటుంది.

చదవండి: EPFO : ఈపీఎఫ్‌వో గణనీయంగా పెరిగిన స‌భ్య‌త్వం..

ఏటీఎం నుంచి పీఎఫ్‌ డబ్బు

ఈపీఎఫ్‌వో సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బును ఏటీఎం ( ATM ) కార్డ్‌తో విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో చందాదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా నిధులను ఉపసంహరించుకోవచ్చు.

ఏటీఎం ఉపసంహరణ సౌకర్యం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కానుంది. ఇది అందుబాటులోకి వస్తే సభ్యులు తమ బ్యాంకు ఖాతాల్లోకి పీఎఫ్‌ డబ్బును పొందడానికి 7 నుండి 10 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా విలువైన సమయం ఆదా అవుతుంది.

చదవండి: EPS Pension: పింఛన్‌దారులకు శుభ‌వార్త‌.. పింఛను ఇకపై ఎక్కడి నుంచైనా..!

ఈపీఎఫ్‌వో ఐటీ సిస్టమ్ అప్‌గ్రేడ్

పీఎఫ్‌ హక్కుదారులు, లబ్ధిదారులు తమ డిపాజిట్లను సులభంగా ఉపసంహరించుకునేలా ఈపీఎఫ్‌వో తన ఐటీ (IT) వ్యవస్థను మెరుగుపరుస్తోంది. ఈ అప్‌గ్రేడ్ 2025 జూన్ నాటికి పూర్తవుతుందని అంచనా. ఐటీ వ్యవస్థ అప్‌గ్రేడ్ పూర్తయిన తర్వాత, సభ్యులు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లు, మెరుగైన పారదర్శకత, మోసపూరిత కార్యకలాపాల తగ్గుదలని ఆశించవచ్చు.

ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్

ఈపీఎఫ్‌వో సభ్యులను ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ ( ETF ) పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పు పీఎఫ్‌ ఖాతాదారులకు వారి ఫండ్‌లను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది.

ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్

ఈపీఎఫ్‌వో పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం.. పింఛనుదారులు అదనపు ధ్రువీకరణ లేకుండా తమ పెన్షన్‌ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుండి అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు రానుంది. 

#Tags