Employment Registration: ఇంటి నుంచే కొలువుల వేట.. న‌మోదు చేసుకోండిలా..

ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొత్తదనం సంతరించుకుంది.

ఉద్యోగాల్లో ప్రాధాన్యం కోసం తమ విద్యార్హతలతో ఎంప్లాయిమెంట్‌ కార్యాలయాలకు పరుగులు తీసి, చాంతాడంత క్యూలైన్లలో నిలబడి దరఖాస్తులు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ స్వరూపంతో పాటు పేరును కూడా మార్చుకుంది. చేతిలో మొబైల్‌ ఉంటే.. నిరుద్యోగులు ఇంటి నుంచే కొలువులకు దరఖాస్తులతో పాటు కొలువుల వివరాలు తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఇక నుంచి నిరుద్యోగులకు వ్యయప్రయాసలు తప్పనున్నాయి.

ఒంగోలు టౌన్‌: పూర్వం రోజుల్లో పదో తరగతి పూర్తయితే చాలు వెంటనే ఎంప్లాయిమెంటు రిజిస్ట్రేషన్‌ కోసం పరుగులు తీసేవారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల నియమాకాలు తగ్గి ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగాలు పెరిగిన తరువాత ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించేవారి సంఖ్య భారీగా తగ్గింది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంపై దృష్టి సారించింది. ఎంప్లాయిమెంట్‌ కార్యాలయాల ద్వారా జాబ్‌మేళాలు, నైపుణ్య శిక్షణ శిబిరాలను నిర్వహించడం వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడంతో తిరిగి ఎంప్లాయిమెంట్‌ చేసేవారి సంఖ్య క్రమంగా పెరిగింది. 

ఇన్ఫోసిస్‌లాంటి పెద్ద కంపెనీలు తీసుకొచ్చి క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించడం, చదువులు పూర్తికాగానే ఏదో ఒక ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం లభించే ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలోనే ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఇప్పటి వరకు అమలులో ఉన్న పాత విధానాన్ని పక్కన పెట్టి ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్‌ సులువవడమే కాకుండా డబ్బుకు డబ్బు, సమయానికి సమయం ఆదా అవుతోంది. అలాగే ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పేరును మోడల్‌ కెరీర్‌ సెంటర్లుగా మార్చనున్నారు. త్వరలోనే ఉపాధి కార్యాలయాలు ఎంసీసీ సెంటర్లుగా కీలకపాత్ర పోషించనున్నాయని చెప్పొచ్చు.

Basara IIIT Admissions: బాసర ట్రిపుల్‌ఐటీలో దరఖాస్తుల స్వీకరణ.. చివరి తేదీ ఎప్పుడంటే..

అబ్బాయిల రిజిస్ట్రేషన్లే ఎక్కువ..
రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక సచివాలయాల ద్వారా 1.36 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. అలాగే కరోనా సమయంలో ప్రభుత్వాస్పత్రుల్లో పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించారు. ఈ కారణంగా 2019 నుంచి 2022 వరకు ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలుస్తోంది. 2019 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 11,791 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్లలో అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది.

రిజిస్ట్రేషన్‌ విధానం నాడు..
నిన్నా మొన్నటి వరకు అమలులో ఉన్న మాన్యువల్‌ విధానాన్ని అరుంధతి రిజిస్ట్రేషన్‌ విధానం అనేవారు. ఈ విధానం ద్వారా ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు అభ్యర్థి నేరుగా ఎంప్లాయిమెంటు కార్యాలయానికి వెళ్లాలి. ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కార్యాలయంలో చూపించి జిరాక్స్‌ కాపీలను దాఖలు చేసేవారు. వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసేవారు. మూడేళ్ల తరువాత మళ్లీ రెన్యువల్‌ చేసుకోవాల్సి వచ్చేది. దీనికి 6 నెలల గ్రేస్‌ పిరియడ్‌ ఉండేది. ఈ విధానంలో ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం దూర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు అనేక వ్యయప్రయాసలతో ఇబ్బందులు పడేవారు. 

జిల్లాలో యర్రగొండపాలెం, పుల్లల చెరువు, దోర్నాల, పెద్దారవీడు, అర్ధవీడు, రాచర్ల, గిద్దలూరు మండలాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందులు పడేవారు. తెలవారుజామున బయలుదేరి రెండు మూడు బస్సులు మారి ఒంగోలు చేరుకునేవారు. తిరిగి ఏ అర్ధరాత్రికి కానీ ఇంటికి చేరే పరిస్థితి ఉండేది. అంతేకాకుండా 10వ తరగతి విద్యార్థి అంటే 15 ఏళ్ల బాలుడు, బాలికలు ఉండేవారు కనుక వారిని ఒంటరిగా పంపించేవారుకాదు. తోడుగా ఎవరో ఒకరు వచ్చేవారు. ఇద్దరికి కలిపి బస్సు చార్జీలు, భోజనాల ఖర్చులు కలిసి తడిసి మోపెడయ్యేవి. అదనపు అర్హతలను నమోదు చేయాలంటే కూడా ఒంగోలుకు రావలసి వచ్చేది. 
అయితే విభిన్న ప్రతిభావంతులకు మాత్రం కొంత వెసులుబాటు ఉండేది. ఒకసారి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే తిరిగి చేయించాల్సిన అవసరం ఉండేది కాదు. తొలిసారి రిజిస్ట్రేషన్‌కే అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ నమోదు ప్రక్రియ కూడా జిల్లా కేటగిరీలోని ఉద్యోగాలకే పరిమితమయ్యేది. ప్రొఫెషనల్‌ కోర్సులు చదివిన వారిని యూనివర్శిటీ పరిధిలోనే రిజిస్ట్రేషన్‌ చేసేవారు.

 

Agriculture Polytechnic: అగ్రి కోర్సులతో కచ్చితమైన ఉపాధి.. తక్కువ ఫీజుకే నాణ్యమైన వ్యవసాయ విద్యా కోర్సులు

మార్కాపురంలో సబ్‌ సెంటర్‌..
జిల్లా మొత్తం మీద కేవలం ఒకేఒక్క ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఉండడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతో జిల్లాకు దూరంగా ఉంటున్న పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురంలో ఒక సబ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేశాయి. దీంతో మార్కాపుంలో సబ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

నేడు ఇంటి నుంచే రిజిస్ట్రేషన్లు:
మారిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఇంటి నుంచి బయటకు కాలుకదపకుండా మొబైల్‌ ఫోన్‌లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. www.employment.ap.gov.in అనే పోర్టల్‌ను జనవరి 2024న ప్రభుత్వం ఆవిష్కరించింది. దీనిద్వారా మారుమూల ప్రాంతాల విద్యార్థులు సైతం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఒంగోలు, మార్కాపురం వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు.

ఉద్యోగ ఖాళీలు తెలుసుకోవచ్చు..
ఈ ఎంప్లాయిమెంట్‌ పోర్టల్‌లోకి వెడితే రిజిస్ట్రేషన్‌ మాత్రమే కాకుండా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యూలను సరిగ్గా అటెండ్‌ చేయలేక పోతున్నామని బాధపడేవారు ఈ పోర్టల్‌ లోనే కౌన్సిలర్లను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ లాంటి పత్రికలు సైతం ఇందులో ఉచితంగా చదువుకునే అవకాశం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే నిరుద్యోగులకు ఈ పోర్టల్‌ ఒక మార్గదర్శిలాంటిది.

న‌మోదు చేసుకోండి ఇలా..
ఆన్‌లైన్‌ విధానంలో ఎంప్లాయిమెంటు రిజిస్ట్రేషన్‌ చేయడానికి ముందు ప్రతి విద్యార్థి ఒక జాబ్‌ సీకర్‌ ఐడీని మొబైల్‌ ఫోన్‌ ద్వారా క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
✦ పోర్టల్‌ క్లిక్‌ చేయగానే జాబ్‌సీకర్‌ లాగిన్‌ వస్తుంది.
✦ జాబ్‌ సీకర్‌లాగిన్‌ క్లిక్‌ చేయగానే లాగిన్‌ నౌ అని వస్తుంది. దాని కింద యూజర్‌ నేమ్‌ అడుగుతుంది. అక్కడ ఇచ్చిన కాలంలోనే మొబైల్‌ నెంబర్‌ను కూడా నమోదు చేయాలి.

Polytechnic Admissions: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్ర‌వేశానికి నోటిఫికేష‌న్ జారీ..

✦ పాస్‌ వర్డ్‌ కొట్టి క్యాప్చాను నమోదు చేయాలి.
✦ న్యూ జాబ్‌ సీకర్‌ అని ఆప్షన్‌ పై క్లిక్‌ చేయాలి. న్యూ జాబ్‌ సీకర్‌ ఐడీ నమోదు చేసుకునేందుకు గాను ఈ మెయిల్‌, ఆధార్‌, మొబైల్‌ నంబర్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
✦ 10వ తరగతి సర్టిఫికెట్‌ ప్రకారం పేరు తదితర వివరాలు నమోదు చేయాలి. సర్‌ నేమ్‌లో పూర్తి పేరు రాసి, లాస్ట్‌ నేమ్‌ అనే కాలంలో ఇంటిపేరు నమోదు చేయాలి.
✦ మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్లను అన్నీ ఆప్షన్లలోనూ ఒకేలా ఇవ్వాలి. ఆధార్‌ నంబర్‌ కొట్టిన తరువాత క్యాప్చా టైప్‌ చేసి సబ్‌మిట్‌ను కొట్టాలి. సక్సస్‌ఫుల్‌ రిజిస్టర్‌ పక్కన ఓకే కొట్టాలి.

✦ మళ్లీ హోం పేజీలోకి వచ్చి లాగిన్‌ నౌ అడుగుతుంది. యూజర్‌ నేమ్‌ అడుగుతుంది. పాస్‌వర్డ్‌ పూర్తి చేసి క్యాప్చా టైప్‌ చేయాలి. లాగిన్‌ కొట్టాలి.
✦ అప్పుడు డాక్యుమెంట్ల వివరాలతో గైడ్‌లైన్స్‌ పేజీ వస్తుంది. అందులో సూచించిన ప్రకారం డాక్యుమెంట్లను స్కాన్‌ చేసి దగ్గర ఉంచుకోవాలి.
✦ ఆ తరువాత అప్లికేషన్‌ ఫాం ఫ్రం ఫ్రెష్‌ రిజిస్ట్రేషన్‌ అనే పేజీ వస్తుంది. అందులోని విషయాలను జాగ్రతగా చదువుకొని నమోదు చేసుకోవాలి.
✦ నేమ్‌ ఆఫ్‌ ది కాండిడేట్‌ కాలంలో సర్‌ నేమ్‌ తో సహా పూర్తి పేరు నమోదు చేయాలన్నది మరచిపోకూడదు.
✦ ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే క్యాస్ట్‌ సర్టిఫికెట్లను అడుగుతుంది. కనుక సిద్ధంగా ఉంచుకోవాలి.

Govt Exams June Month Calendar : జూన్‌ నెలలో జరగనున్న పరీక్షల షెడ్యూల్‌ ఇదే.. నెలంతా పరీక్షలే!

నిరుద్యోగులకు వరం ఈ పోర్టల్‌
ప్రభుత్వం రూపొందించిన ఎంప్లామెంట్‌ పోర్టల్‌ నిరుద్యోగులకు వరం లాంటిది. ఈ పోర్టల్‌లో ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడమే కాకుండా ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఎక్కడ ఏఏ ఉద్యోగాలు ఉన్నాయో, వాటి ఖాళీల వివరాలు సైతం తెలుసుకొని ప్రయత్నాలు చేసుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ సమాచారం కూడా లభ్యమవుతుంది. ఇది ప్రభుత్వ పోర్టల్‌ కనుక నిరుద్యోగులకు సమగ్రమైన సేవలు అందజేస్తుంది. – భరద్వాజ్‌, జిల్లా ఉపాధి అధికారి.

#Tags