JEE Mains 1st Ranker Nilkrishna Success Story : అదో మారుమూల గ్రామం.. ఓ సాధారణ రైతు బిడ్డ.. నెం-1 ర్యాంక్ కొట్టాడిలా.. కానీ..
జేఈఈ మెయిన్స్-2024 పరీక్షలో ఒక సాధారణ రైతు బిడ్డ సత్తా చాటాడు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి తన కల నెరవేర్చుకున్నాడు. రోజుకు దాదాపు 10 గంటలకు పైగా కష్టపడి చదివి జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఈ విద్యార్థే మహారాష్ట్ర వాసీం పరిధిలోని బెల్ ఖేడ్‌కు చెందిన నిల్ కృష్ణ గజరే. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్-2024 ఫస్ట్ ర్యాంకర్ నిల్ కృష్ణ గజరే సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
నిల్ కృష్ణ గజరే.. మహారాష్ట్ర వాసీం పరిధిలోని బెల్ ఖేడ్‌కు చెందిన వారు. తండ్రి నిర్మల్. ఈయన ఒక సాధారణ రైతు. ఎంతో కష్టపడి తన కుమారుడిని చదివిస్తున్నాడు.
ఎడ్యుకేషన్ :
నిల్ కృష్ణ ప్రాథమిక విద్య ఆకోలాలో గల రాజేశ్వర్ కాన్వెంట్ స్కూల్‌లో జరిగింది. వాసీంలో గల కరంజ లాడ్‌లో గల జేసీ స్కూల్‌లో హైస్కూల్ విద్య కొనసాగింది. హైస్కూల్ చదువు కోసం బంధువుల వద్ద ఉండి చదివాడని నిల్ కృష్ణ తండ్రి నిర్మల్ తెలిపారు. షెగన్‌లో గల శ్రీ ధ్యనేశ్వర్ మస్కుజి బురుంగలే సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నత విద్య కొనసాగింది.
ప్రతి రోజు ఇలా..
ప్రతి రోజు తన కుమారుడు రోజు 4 గంటలకు లేచే వాడని నిర్మల్ తెలిపాడు వివరించారు. 2 గంటలు చదివి, ప్రాణాయం చేసేవాడని వివరించారు. ఉదయం 8.30 గంటలకు తిరిగి చదివేవాడని పేర్కొన్నారు. ప్రతి రోజు రాత్రి 10 గంటలకు పడుకునేవాడని స్పష్టం చేశారు. చక్కగా చదువుకోవాలని చెప్పేవాడని వివరించారు. తన కుమారుడికి ఫస్ట్ ర్యాంక్ రావడంతో మాటలు రావడం లేదని అతని తండ్రి నిర్మల్ అన్నారు. నీల్ కృష్ణ అద్భుతమైన విద్యార్థి అని, క్రీడల్లో నిష్ణాతుడని, ఆర్చరీలో జిల్లా, జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొన్నడాని అతని తండ్రి నిర్మల్ తెలిపారు.
నిల్ కృష్ణ లక్ష్యం ఇదే..
ఐఐటీ బాంబేలో చదవాలనేది నిల్ కృష్ణ ఆశ అని, సైంటిస్ట్ అవుతానని చెబుతుంటారని వివరించారు. చదువులోనే కాదు నిల్ కృష్ణ ఆటల్లో మంచి ప్రతిభ కనబరిచాడని తండ్రి నిర్మల్ అంటున్నారు. వచ్చేనెలలో జరిగే జేఈఈ అడ్వాన్స్ పరీక్ష కోసం నిల్ కృష్ణ సిద్దం అవుతున్నాడు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే నిల్ కృష్ణ ఆశించినట్టు ఐఐటీ ముంబైలో సీటు సాధించడం తేలిక అవుతుంది.
☛ JEE Main Results 2024 Toppers: జేఈఈ మెయిన్‌లో 22 మంది తెలుగు విద్యార్థులకు వంద పర్సంటైల్
తండ్రి పడే కష్టాలను చూసి..
ఓ రైతు బిడ్డ తన తండ్రి పడే కష్టానికి తగిన ఫలితాన్ని అందించాడు. తల్లిదండ్రులు కన్న కలలను తీర్చేందుకు అహర్నిషలు కష్టపడి చదివి జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ సాధించాడు నీలకృష్ణ గజారే. తండ్రేమో రైతు. వ్యవసాయంపైనే ఆధారపడి కుటుంబం జీవిస్తోంది. తండ్రి పడే కష్టాలను చూసి వారి బాధలను తొలగించేందుకు ఎలాగైనా తాను ప్రయోజకుడిని కావాలని నీలకృష్ణ గజారే నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే జేఈఈ కోసం సన్నద్ధమయ్యాడు. రెండేళ్ల నుంచి నీలకృష్ణ గజారే పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు ప్రిపేరయ్యాడు. అనుకున్నట్టే విజయం సాధించాడు.