Civil Services 2023: సివిల్స్‌–2023 మెయిన్స్‌ ఫలితాల వెల్లడి.. ఇంటర్వ్యూలో మెరిసేలా!

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి.. 21 కేంద్ర సర్వీసుల్లో అధికారుల ఎంపికకు చేపట్టే నియామక ప్రక్రియ! ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఇలా మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. సివిల్స్‌ 2023కి సంబంధించి రెండో దశ.. మెయిన్‌ ఎగ్జామినేషన్‌ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఎంపిక ప్రక్రియలో అత్యంత కీలకమైన చివరి దశ ఇంటర్వ్యూలు (పర్సనాలిటీ టెస్ట్‌).. జనవరి 2 నుంచి ప్రారంభమవుతాయని యూపీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. సివిల్స్‌ పర్సనాలిటీ టెస్ట్‌లో సత్తా చాటి తుది విజేతలుగా నిలిచేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం..
  • సివిల్స్‌–2023 మెయిన్స్‌ ఫలితాల వెల్లడి
  • జనవరి 2వ తేదీ నుంచి పర్సనాలిటీ టెస్ట్‌
  • ఇందులో ప్రతిభతోనే తుది నియామకాలు
  • భావ వ్యక్తీకరణ, విశ్లేషణ నైపుణ్యాలతో విజయం

సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 275. ఇందులో పది, పదిహేను మార్కు­ల వ్యత్యాసంతో సర్వీసులు, ర్యాంకులు తారుమారు అయ్యే పరిస్థితి ఉంటుంది. రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా.. ఇంటర్వ్యూలో ఎక్కు­వ మార్కుల సాధించి.. తుది ఫలితాల్లో మంచి సర్వీసులు పొందిన వారు ఎందరో! కాబట్టి మెయి­న్స్‌ విజేతలు..ఇంటర్వ్యూలో రాణించేందుకు సమగ్రంగా సన్నద్ధమవ్వాలి అంటున్నారు నిపుణులు.

2,916 మంది ఎంపిక
సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2023కు సంబంధించి.. చివరి దశ పర్సనాలిటీ టెస్ట్‌/ ఇంటర్వ్యూకు మొత్తం 2,916 మంది ఎంపికయ్యారు. వీరిలో తెలుగు రాష్ట్రాలు(ఏపీ, తెలంగాణ) నుంచి 80 నుంచి 100 మంది వరకు ఉంటారని అంచనా. యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ 2023 నోటిఫికేషన్‌లో మొత్తం 1,105 పోస్ట్‌లను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

చ‌ద‌వండి: UPSC Notification 2024: యూపీఎస్సీ–కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(1), 2024 నోటిఫికేషన్‌ విడుదల

ప్రత్యేక దృష్టి
సివిల్స్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ అకడమిక్‌ నేపథ్యం,ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రొ­ఫెషన్, కుటుంబ నేపథ్యం, స్థానిక రాష్ట్రం తదితర అన్ని అంశాలపై దృష్టి పెట్టాలి. వీటితోపాటు మె­యిన్‌ ఎగ్జామ్‌కు ముందు అందించిన డీఏఎఫ్‌–1, ఇంటర్వ్యూకు ముందు ఇవ్వాల్సిన డీఏఎఫ్‌–2లలో పొందుపరిచిన వివరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.

మీ గురించి చెప్పండి
ముందుగా ‘మీ గురించి చెప్పండి’అంటూ.. బోర్డ్‌ అడిగే ప్రశ్నకు మెప్పించే విధంగా సమాధానం చెప్పేలా అభ్యర్థులు సన్నద్ధం కావాలి. ఆ తర్వాత డీఏఎఫ్‌లో పేర్కొన్న అంశాలు, సర్వీస్‌ ప్రాథమ్యతలు, సమకాలీన అంశాలపై ఇంటర్వ్యూ కొనసాగుతుంది. సివిల్‌ సర్వీసెస్‌నే ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? అనే ప్రశ్న సాధారణంగా ఎదురవుతుంది. చాలా మంది ఈ ప్రశ్నకు సామాజిక సేవ లక్ష్యం అనే సమాధానం చెబుతుంటారు. అయితే ఈ సమాధానాన్ని బలపరచుకునే సపోర్టింగ్‌ పాయింట్స్‌ సిద్ధం చేసుకోవాలి.

సమకాలీన అంశాలపై పట్టు
అభ్యర్థులు తమ ఇంటర్వ్యూ తేదీ వరకు జరిగే సమకాలీన అంశాలపై పట్టు సాధించాలి. ఎందుకంటే..‘ఈ రోజు పేపర్‌లోని ముఖ్య వార్తలు ఏంటి? మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న వార్త ఏంటి? అందుకు కారణం.. ఆ వార్త ప్రాధాన్యం? తదితర ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఇంటర్వ్యూ రోజున కూడా కనీసం రెండు ప్రామాణిక దినపత్రికల చదవాలి. వాటిలో ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వివరాలు గ్రహించాలి.
ముఖ్యంగా ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, గాజా ఉద్రికత్తలు, మన విదేశాంగ విధా­నం, జీ–20 నిర్వహణ, పొరుగుదేశాలతో దౌత్య సంబంధాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. జాతీయ స్థాయిలో ఇటీవల చర్చనీయాంశంగా మారుతున్న అంశాల(ఉదా: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఎల్‌ఐసీ ఐపీఓ, బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలు తదితర) గురించి అన్ని కోణాల్లో తెలుసుకోవాలి.

చ‌ద‌వండి: UPSC Notification 2024: యూపీఎస్సీ - ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌(1) 2024 మొదటి విడత నోటిఫికేషన్‌ విడుదల

భౌగోళిక నేపథ్యం
సివిల్స్‌ ఇంటర్వ్యూకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు తమ భౌగోళిక నేపథ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. తమ స్వస్థలానికి సంబంధించి ఏదైనా సామాజిక, చారిత్రక ప్రాధాన్యం ఉంటే దాని గురించి తెలుసుకోవాలి. అదే విధంగా ప్రస్తుతం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకున్న సమస్యలు, వాటి పరిష్కారానికి అభ్యర్థులు ఇచ్చే సమాధానాలను సైతం రాబట్టేలా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి స్థానిక పరిస్థితులు, సమస్యలపై అవగాహనతోపాటు, పరిష్కార మార్గాలతో సన్నద్ధంగా ఉండాలి.

అలవాట్లు.. అప్రమత్తంగా
సివిల్స్‌ ఇంటర్వ్యూ అభ్యర్థులు.. తాము అప్లికేషన్‌లో పేర్కొన్న హాబీలపై ఇప్పటి నుంచే ప్రత్యేకంగా కసరత్తు చేయాలి. చాలామంది బుక్‌ రీడింగ్, వాచింగ్‌ టీవీ, సింగింగ్, ప్లేయింగ్, మూవీస్‌ వంటి వాటిని పేర్కొంటారు. ఇంటర్వ్యూ సమయంలో వీటిపైనా ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని గమనించాలి. బుక్‌ రీడింగ్‌ హాబీకి సంబంధించి నిర్దిష్టంగా ఒక రచయిత పేరును పేర్కొన్న అభ్యర్థులు.. సదరు రచయిత ప్రచురణల్లో ముఖ్యమైనవి, వాటిలో పేర్కొన్న ముఖ్యమైన కొటేషన్లు, సదరు రచన సారాంశం వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. సదరు రచయిత రాసిన ఫలానా పుస్తకం చదివారా? అందులో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? లేదా అందులో వివాదాస్పదమైన అంశం ఏంటి? వంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. 

చ‌ద‌వండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

బలాలు, బలహీనతలు
అభ్యర్థులు వ్యక్తిగత బలాలు, బలహీనతల విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేయాలి. సివిల్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ అంటే..ఒక విభాగానికి, లేదా ఒక ప్రాంతానికి పూర్తి స్థాయి అధికారిక పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో వ్యక్తిగత లక్షణాలు కూడా కీలకంగా నిలుస్తాయి. అందుకే ఇటీవల కాలంలో అభ్యర్థుల వ్యక్తిగత బలాలు, బలహీనతలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు తమ బలహీనతల గురించి చెప్పేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. ‘అగ్రెసివ్‌నెస్‌’, ‘సహనం తక్కువ’ వంటివి చెప్పకపోవడమే మేలు.

సూటిగా, స్పష్టంగా
ఇంటర్వ్యూలో అభ్యర్థుల వ్యక్తిగత వ్యవహార శైలి కూడా విజయాన్ని నిర్దేశిస్తుంది. ప్రధానంగా అభ్యర్థులు తమ అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పగలిగే నేర్పును అలవర్చుకోవాలి. ఇందుకోసం తమ అభిప్రాయాలను బలపరిచే ∙అంశాలను ఉదహరించేలా వ్యవహరించాలి. సానుకూల లేదా ప్రతికూల అభిప్రాయం ఏదైనా సరే తమ అభిప్రాయాన్ని ఎదుటి వారిని మెప్పించే రీతిలో సూటిగా చెప్పాలి. వ్యవహార శైలి పారదర్శకంగా ఉండాలి. అంతేకాకుండా సివిల్స్‌ పర్సనాలిటీ టెస్ట్‌ కొన్నిసార్లు చర్చ రూపం కూడా సంతరించుకోవచ్చు. ఇంటర్వ్యూ అంటే కేవలం ప్రశ్న, సమాధానం అనే కోణంలోనే కాకుండా.. ఒక చర్చా వేదికగానూ భావించి ముందడుగు వేయాలి. 

ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌
గత కొన్నేళ్లుగా ఇంటర్వ్యూల శైలిని పరిగణనలోకి తీసుకుంటే బోర్డ్‌ సభ్యులు.. అభ్యర్థుల్లోని ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌ను పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు..‘మీరు ఒక ఐఏఎస్‌ అధికారిగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఫలానా సమస్య ఎదురైంది? దీనికి తక్షణ పరిష్కారంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?’ వంటివి. ఇలాంటి వాటికి..ప్రభుత్వ విధానాలను గౌరవిస్తూ.. రాజ్యాంగానికి అనుగుణంగా పరిష్కార చర్యలు చేపడతామనే విధంగా సమాధానాలు చెప్పాలి.

వస్త్రధారణ
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు వ్యక్తిగత ఆహార్యంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి. పురుష అభ్యర్థులు లైట్‌ కలర్‌ షర్ట్స్‌ ధరించడం హుందాగా ఉంటుంది. అదే విధంగా మహిళా అభ్యర్థులు శారీ, లేదా సల్వార్‌ కమీజ్‌లను ధరించి ఇంటర్వ్యూకు హాజరవడం సదభిప్రాయం కలిగేలా చేస్తుంది. ఇంటర్వ్యూ సమయంలో సమాధానాలిచ్చేటప్పుడు బాడీ లాంగ్వేజ్‌ కూడా ఎంతో ముఖ్యం. హావ భావాలను నియంత్రించుకోవాలి.

చ‌ద‌వండి: Civils Prelims Study Material

ప్రాక్టికల్‌ అప్రోచ్‌
సివిల్స్‌ పర్సనాలిటీ టెస్ట్‌లో ప్రధానంగా అభ్యర్థుల్లోని ప్రాక్టికల్‌ అప్రోచ్‌ను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. అదే విధంగా పాలన దక్షతను, నాయకత్వ లక్షణాలను కూడా పరీక్షిస్తారు. నిర్దిష్టంగా ఒక సమస్య పట్ల స్పందించే తీరు, నిర్ణయాలు తీసుకునే విధానం వంటి వాటిని పరిశీలిస్తారు. ఈ నైపుణ్యాలు పెంచుకోవాలి.

ఇంటర్వ్యూ మార్కులే కీలకం
మొత్తం 2025 మార్కులకు నిర్వహించే మూడంచెల సివిల్స్‌ ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూకు కేటాయించిన 275 మార్కులు తుది జాబితాలో నిలిపేందుకు అత్యంత కీలకంగా మారుతున్నాయి. కార­ణం.. ఇంటర్వ్యూ అంతా ముఖాముఖి విధానంలో ఉండడం, బోర్డ్‌ సభ్యులు అడిగిన ప్రశ్నలు లేదా ఆయా అంశాలపై అవగాహనను, వ్యక్తిత్వ లక్షణాలను పరిశీలించే విధంగా ఇంటర్వ్యూ జరగడమే. ఈ విషయంలో ఏ మాత్రం తడబాటుకు గురైనా.. కొద్ది మార్కుల తేడాతో విజయం చేజారే ప్రమాదం లేదా కోరుకున్న సర్వీసు రాకపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు అన్ని కోణాల్లో నైపుణ్యాలు సొంతం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలి.

#Tags