Skip to main content

నా సివిల్స్ ఇంటర్వ్యూలో బోర్డు ప్రశ్నలు-సమాధానాలు

ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఎలా సిద్ధం కావాలి? తదితర సందేహాలతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన సహజం. ఇంటర్వ్యూలో విజయానికి స్వీయ సన్నద్ధతతోపాటు.. గత విజేతల సూచనలు, సలహాలు తప్పనిసరి. అందుకే సాక్షి సివిల్స్‌లో ఆరో ర్యాంకు సాధించిన ‘కొత్తమాసు దినేష్ కుమార్’తో మాట్లాడింది. వినయ్ మిట్టల్ నేతృత్వంలోని ప్యానెల్ తనను ఇంటర్వ్యూ చేసిందని.. ఎక్కువగా సమకాలీన అంశాలు, ప్రొఫైల్ ఆధారిత ప్రశ్నలే అడిగారంటున్నారు దినేష్ కుమార్. ఆ ఇంటర్వ్యూ పూర్తి వివరాలు...
ప్రశ్న. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)ను వదిలి, సివిల్ సర్వీసెస్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారు?
జవాబు.
భారత్ పెట్రోలియంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నా.. అయితే సివిల్ సర్వీస్‌తో మరింత మెరుగైన కెరీర్ అవకాశాలు లభిస్తాయి. ఈ సర్వీస్‌కే సొంతమైన వైవిధ్యమైన పని స్వభావం, క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశం, సమాజానికి తిరిగి ఇచ్చే క్రమంలో పొందే ఉద్యోగ సంతృప్తి.. నన్ను సివిల్స్ వైపు నడిపించాయి.

ప్ర. బీసీసీఐ, లోధా కమిటీ మధ్య ఏం జరుగుతోంది?
జ.
బీసీసీఐ జాతీయ క్రికెట్ జట్టును ఎంపిక చేయడంతోపాటు క్రికెట్ సంబంధిత వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఇది సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం కింద రిజిష్టర్ అయిన పబ్లిక్ బాడీ. కానీ, దీని నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయి. దీంతో బీసీసీఐలో సంస్కరణలు తెచ్చేందుకు సుప్రీంకోర్టు లోధా కమిటీని నియమించింది. ఈ కమిటీ బీసీసీఐ ప్రక్షాళనకు కొన్ని సిఫారసులు చేసింది.

ప్ర. లోధా కమిటీ చేసిన సిఫారసుల్లో కొన్ని చెప్పండి?
జ. వన్ స్టేట్-వన్ క్రికెట్ బాడీ; బీసీసీఐను సమాచార హక్కు చట్టం కిందకు తీసుకురావడం; రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులను పాలకమండలికి దూరంగా ఉంచడం.

ప్ర. వన్ స్టేట్-వన్ బాడీ ఎందుకు?
జ.
సర్, వన్ స్టేట్-వన్ బాడీ అవసరం. జట్టులో బిహార్, ఈశాన్య రాష్ట్రాలతో పోల్చితే.. మహారాష్ట్ర వంటి వాటికి ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తోంది. దీంతో ప్రస్తుత విధానంలో ‘సమాన అవకాశాలు’ అనే సూత్రానికి ఆస్కారమే లేదు. అదే ‘వన్ స్టేట్-వన్ బాడీ’ ఉంటే అందరికీ అవకాశాలు లభిస్తాయి.

ప్ర. ఇలాంటి విషయాల్లో రాజ్యం జోక్యం అవసరమా?
జ.
ప్రభుత్వ లక్ష్యం.. సంక్షేమాన్ని ప్రోత్సహించడం. ఆటలు, విద్య, వైద్యం, ఉద్యోగాలు తదితర అంశాల్లో సమానత్వం కోసం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాజ్యం జోక్యాన్ని సమర్థించొచ్చు.

ప్ర. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమాన్యుయేల్ మేక్రన్ ఎంపికపై మీ అభిప్రాయం?
జ.
ఆయన ఎంపిక లిబరల్ ప్రపంచానికి సంకేతం. దీన్నిబట్టి ప్రజల మూడ్‌ను అర్థంచేసుకోవచ్చు. ఫ్రాన్స్ ప్రజలు రైటిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. మొత్తంగా చూస్తే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. జర్మనీలో జరగబోయే ఎన్నికలతో పూర్తి స్పష్టత వస్తుంది. వెంటనే బోర్డ్ సభ్యులు కల్పించుకొని జర్మనీలో రైటిస్ట్ పార్టీల గురించి అడిగారు. నాకు వాటి పేర్లు గుర్తు లేవని చెప్పాను.

మొదటి సభ్యుడు :
క్రికెట్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారింది. బ్యాలెన్స్ చేయడానికి సూచనలు?
ప్ర.
టీ20 యుగంలో క్రికెట్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారిన మాట వాస్తవమే. దీన్ని గుర్తించి గ్రాఫైట్ కోటింగ్ లేకుండా బ్యాట్‌లను తయారు చేయాలి. బౌలర్లకు ప్రయోజనం చేకూరేలా బ్యాట్ కొలతలను మార్చాలి. బౌలర్లను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పవర్ ప్లే పరిమితుల్లో మార్పులు తీసుకురావాలి.

ప్ర. గ్రాస్ రిఫైనరీ మార్జిన్ అంటే? (గతంలో చేసిన ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్న)
జ.
X అనేది ఇన్‌పుట్ కాస్ట్.. Y అనేది ఔట్‌పుట్ కాస్ట్ అయితే.. Y-X ను గ్రాస్ రిఫైనరీ మార్జిన్ అంటారు.

ప్ర. నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్స్ అంటే?
జ. సెకండరీ పెట్రోలియం ఉత్పత్తుల రిఫైనరీ కొలత.

ప్ర. ప్రైవేటు రిఫైనరీ కేంద్రాలతో పోల్చితే ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు ఎందుకు పేలవంగా ఉంటుంది?
జ.
పబ్లిక్ సెక్టార్ యూనిట్లు చాలా ఏళ్ల కిందట ఏర్పాటు చేసినవి. కొత్తగా వచ్చిన ప్రైవేటు సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ఒక అధ్యయనంలో కీలకమైన పెర్ఫార్మెన్స్ పరామితుల ప్రకారం ప్రభుత్వ శుద్ధికేంద్రాలు 74 శాతం స్కోరు సాధించాయి. తాజాగా ఈ లెక్క 80 శాతానికి చేరింది. కాబట్టి సాపేక్షికంగా పీఎస్‌యూలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని చెప్పొచ్చు. పీఎస్‌యూలకు కేవలం లాభాపేక్షే లక్ష్యం కాదు.. సామాజిక న్యాయానికి తోడ్పడటం వీటి ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. దీంతో పీఎస్‌యూల గ్రాస్ రిఫైనరీ మార్జిన్ మీద ఒత్తిడి పెరుగుతుంది.

ప్ర. బీపీసీఎల్‌లో మీ విధుల గురించి చెప్పండి?
జ.
నేను జలంధర్‌లో సైట్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరాను. ఎంబీ లాల్ సిఫారసుల మేరకు చేపట్టిన ప్రాజెక్టులను చూసుకునే వాడిని.

రెండో సభ్యుడు :
ప్ర. ప్రస్తుత జమ్మూకశ్మీర్ పరిస్థితిపై మీ అభిప్రాయం?
జ.
భారత ప్రభుత్వం చెబుతున్నట్లుగా అక్కడ అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని నేను భావించడం లేదు.

ప్ర. గుంపును నియత్రించే క్రమంలో పెల్లెట్ గన్స్ వాడకంపై మీ అభిప్రాయం?
జ.
తుపాకుల వినియోగం హింసను సూచిస్తుంది. కాబట్టి వాటిని ఉపయోగించకూడదు. శాంతిభద్రతల పరిరక్షణ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. ఇందులో భాగంగా ప్రాణహాని తక్కువగా ఉండే పెల్లెట్ గన్ వినియోగాన్ని సూచించొచ్చు. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. కమిటీ సిఫారసులను అనుసరించడం మేలని నా అభిప్రాయం.

ప్ర. అవినీతిని ఎలా నియంత్రిచొచ్చు?
జ.
అవినీతి.. సప్లై, డిమాండ్ పద్ధతిలో కొనసాగుతుంది. సప్లై సైడ్ అవినీతిని ప్రజల్లో ప్రశ్నించేతత్వం పెంపొందించి నియంత్రించొచ్చు. డిమాండ్ సైడ్ అవినీతిని నిఘా విభాగాన్ని పటిష్టం చేయడం, అవినీతిపరులకు కఠిన శిక్షలు పడేలా చేయడం ద్వారా నియత్రించొచ్చు.

ప్ర . ప్రభుత్వం అవినీతి నియంత్రణ దిశగా వేసిన అడుగులు?
జ.
అవినీతిని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ-గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టింది.

ప్ర. ఈ-సేవ అంటే ఏమిటి?
జ.
ఇంటర్నెట్/ఆన్‌లైన్ ద్వారా సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-గవర్నెన్స్‌నే ఈ-సేవ అంటారు. ఇది విజయవంతమైన ప్రభుత్వ ప్రాజెక్ట్.

మూడో సభ్యుడు :
ప్ర. జస్టిస్ కర్ణన్ సమస్యపై మీ అభిప్రాయం?
జ.
ఆ సమస్య కంటే న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత కొరవడడం నన్ను మరింత బాధిస్తుంది.

ప్ర. మీడియా.. జస్టిస్ కర్ణన్‌ను ఇంటర్వ్యూ చేయొద్దని, హైలైట్ కూడా చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై మీ అభిప్రాయం?
జ. ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం. కాబట్టి మీడియా హక్కులను కుదించడం మంచి పరిణామం కాదు. మీడియా తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తుంది. దానికి జస్టిస్ కర్ణన్ సమస్యను కవరేజీ చేయడానికి అనుమతివ్వాలి.

నాలుగో సభ్యురాలు :
ప్ర.మీరు ఖమ్మంలో జన్మించారు కదా, అక్కడి విశేష అంశాలు చెప్పండి?
జ.
ఖమ్మం సహజవనరుల నిల్వలకు పెట్టింది పేరు. అక్కడ బొగ్గు వంటి సహజ నిక్షేపాలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. గిరిజన జనాభా ఎక్కువగా ఉంటుంది. అడవుల శాతం కూడా ఎక్కువ.

దినేష్‌కుమార్ ప్రొఫైల్..
పరీక్ష:
సివిల్ సర్వీసెస్-2016
సొంత రాష్ర్టం: ఆంధ్రప్రదేశ్
చదువు: బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, నిట్-వరంగల్
రాతపరీక్షలో మొత్తం మార్కులు: 912
ఇంటర్వ్యూలో మార్కులు: 179
ఆల్ ఇండియా ర్యాంక్: 6
Published date : 14 Feb 2018 05:09PM

Photo Stories