వివాహం

వివాహం విశ్వజనీన సామాజిక - సాంస్కృతిక విధానం. దీని ద్వారా స్త్రీ, పురుషులిద్దరూ కుటుంబ జీవితానికి నాంది పలుకుతారు. కుటుంబ వ్యవస్థకు ఆధారం వివాహమే. ఇది సమాజ అనుమతితో స్థిరమైన లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకొని సంతానాన్ని పొందడానికి వీలు కల్పించే ప్రక్రియ. సమాజం నిరంతరం కొనసాగడానికి మూలాధారం ఇదే. మరణాల ద్వారా ఏర్పడే లోటును జననాల ద్వారా భర్తీ చేయడానికి వివాహమే ఆధారం. వివాహం అన్ని సమాజాల్లోనూ ఉంది. కానీ, దీని నియమాలు వివిధ సమాజాల్లో విభిన్న రీతుల్లో ఉన్నాయి. అందువల్ల సమాజ శాస్త్రవేత్తలు దీనికి విశ్వజనీన నిర్వచనాన్ని ఇవ్వలేకపోతున్నారు.
వివాహం - నిర్వచనాలు
  • ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులు, ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది స్త్రీలతో ఆచారంతో లేదా చట్టంతో గుర్తింపు పొందిన, కొంత లాంఛనప్రాయంతో కూడి ఉన్న విధానంతో కొంతకాలం పాటు నిలకడగా ఉండే కలయిక లేదా సంబంధమే వివాహం. - ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్
వెస్టర్ మార్క్ ఇచ్చిన నిర్వచనం అన్ని సమాజాల్లోని వివాహ వ్యవస్థకు సరిపోయే విధంగా లేదు. ఉదాహరణకు కింద పేర్కొన్న సమాజాలకు ఈ నిర్వచనం సరిపోదు.
ఎ) ఒనోటోవా, టుక్ సమాజాల్లో వయసుకు రాగానే న్యాయబద్ధమైన సంతానాన్ని పొందుతారు.
బి) ‘కిబ్బుజ్ సమాజం’లో అసలు వివాహ వ్యవస్థే లేదు.
  • సంతానోత్పత్తి, పిల్లల నిర్వహణ కోసం స్త్రీ, పురుషుల మధ్య జరిగే ఒప్పందమే వివాహం. - మలినో విస్కీ
    ఈ నిర్వచనం కూడా కొన్ని సమాజాలకు మినహాయింపుగా ఉంది.
  • భార్యాభర్తల పరస్పర హక్కులు, విధులు, సదుపాయాలకు సంబంధించిన నియమాలు, నిబంధనలు ఉన్నదే వివాహం.- ల్యూండ్ బర్గ్
ల్యూండ్ బర్గ్ నిర్వచనం కూడా అన్ని సమాజాలకు వర్తించదు. ఉదాహరణకు..
ఎ) ఇజ్రాయెల్‌లోని ‘కిబ్బుజ్’ తెగలో స్త్రీ, పురుషుల మధ్య లైంగిక సంబంధం ఉంది కానీ, ఆర్థిక సహకారం లేదు.
బి) కేరళలోని ఒక తెగలో స్త్రీ, పురుషులకు సహ నివాసం లేదు, ఆర్థిక సహకారం లేదు.
వివాహానికి విశ్వజనీన నిర్వచనం లేనప్పటికీ దీనికి ప్రపంచవ్యాప్తంగా సామాజిక సమ్మతి ఉంది.

వివాహ విధులు
జైవిక విధులు:
మానవుడిలో లైంగిక వాంఛలను వివాహం ద్వారా నెరవేర్చుకుంటారు. దీని ద్వారా స్త్రీ, పురుషులు జంటగా ఏర్పడి సంతానోత్పత్తితో తమ వంశాన్ని అభివృద్ధి చేసుకుంటారు. ఇది కేవలం ఆ దంపతులనే కాకుండా వారి భావి సంతానాన్ని కూడా సూచిస్తూ సన్నిహిత సంబంధాలతో, పరస్పర అనురాగబద్ధమై ఉంటుంది. మరణం వల్ల ఏర్పడే లోటు సంతానం ద్వారా భర్తీ అవుతుంది.
సామాజిక విధులు: వివాహం దంపతుల మధ్య కొన్ని బాధ్యతలను సంస్థాగతం చేస్తుంది. దంపతులిద్దరూ వారి సంతానాన్ని ఒకరు తండ్రిగా, మరొకరు తల్లిగా సంరక్షిస్తారు. వివాహం భార్యభర్తల్లో ఒకరికి మరొకరిపై లైంగిక గుత్తాధిపత్యాన్ని కల్పిస్తుంది. స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే శ్రమ విభజనకు కూడా వివాహమే బీజం వేస్తుంది. వివాహం తర్వాత స్త్రీ.. పిల్లల రక్షణ చూస్తూ, పురుషుడికి సహాయకారిగా ఉంటూ సామాజిక మనుగడకు దోహదం చేస్తుంది. పురుషుడు ప్రధానంగా కుటుంబ బాధ్యతలను చూస్తాడు.
సంబంధ బాంధవ్యాలు కల్పించడం: వివాహం వల్ల నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. ఇది రెండు కుటుంబాలను కలపడం ద్వారా పెద్ద సంఖ్యలో బంధుత్వ వర్గాలను ఏర్పాటు చేస్తుంది. ఇరుపక్షాల వాళ్లు ఒకరికొకరు జీవనోపాధి పరంగా, రాజకీయంగా, చట్టపరంగా, మతపరంగా ఆదుకుంటారు. బంధువర్గంలో భావితరాలకు మార్గదర్శకంగా ఉంటారు. ఇతరులతో కలహం ఏర్పడినప్పుడు రక్షణగా నిలుస్తారు. వ్యవహారాల్లో అండగా ఉంటారు. ఈ సంబంధ బాంధవ్యాలు తరతరాలకు సాగిపోతూ ఉంటాయి.
విద్యా విధులు: వివాహం ద్వారా ఏర్పడిన నూతన కుటుంబం ఆ సమాజం సంస్కృతిని, అందులోని నియమ నిబంధనలు, ప్రవర్తనా రీతులను తమ సంతానానికి అందజేస్తూ వారికి విద్యాబుద్ధులు అందిస్తారు. సమాజ అభ్యున్నతికి అవసరమైన కొత్త తరాలను తయారు చేస్తారు. వివాహం ద్వారా ఏర్పడ్డ కుటుంబం పాత తరాల సంస్కృతిని కొత్త తరాలకు అందిస్తుంది.

వివాహం రకాలు
సమాజంలో వివాహానికి సంబంధించి వివిధ రకాల విధానాలున్నాయి.

అంతర్వివాహం
ఒక వ్యక్తి తమ ప్రాంతం లేదా తన సమూహానికే చెందిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎన్నుకుంటే దాన్ని ‘అంతర్వివాహం’గా పేర్కొంటారు. తన సమూహం అంటే ఆ వ్యక్తి మతం, వర్ణం, కులం, తెగ ఏదైనా కావొచ్చు.
ఈ పద్ధతి హిందూ సమాజంలోని కుల వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాచీన హిందూ సమాజంలో నాలుగు రకాల వర్ణాలు ఉన్నాయి. అవి:
1) బ్రాహ్మణులు
2) క్షత్రియులు
3) వైశ్యులు
4) శూద్రులు
వీరు కొన్ని నియమాల ప్రకారం వర్ణాంతర వివాహాలను అనుమతించారు.
ఎ) అనులోమ వివాహ పద్ధతి: హిందూ వర్ణ వ్యవస్థలో ఒక పురుషుడు తన కింది వర్ణానికి చెందిన యువతిని వివాహం చేసుకుంటే దాన్ని ‘అనులోమ వివాహం’ అంటారు. దీని ప్రకారం.. ఒక బ్రాహ్మణ యువకుడు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణానికి చెందిన స్త్రీని; క్షత్రియుడు - క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీని; వైశ్యుడు - వైశ్య, శూద్ర స్త్రీని; శూద్రుడు - శూద్ర స్త్రీని వివాహం చేసుకునే విధానం.
బి) ప్రతిలోమ వివాహం: హిందూ వర్ణ వ్యవస్థలో ఒక యువతి తన కంటే పై వర్ణానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడాన్ని ‘ప్రతిలోమ వివాహం’ అంటారు. దీని ప్రకారం.. బ్రాహ్మణ యువతి - బ్రాహ్మణ; క్షత్రియ స్త్రీ - క్షత్రియ, బ్రాహ్మణ; వైశ్య యువతి - వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ; శూద్ర స్త్రీ - శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ యువకులను వివాహం చేసుకునే విధానం.

అంతర్వివాహానికి కారణాలు:
  • తమ సమాజం విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి అంతర్వివాహాలు చేసుకునేవారు.
  • తమ సమాజ ఉనికి కాపాడటానికి ఈ రకమైన వివాహం చేసుకునేవారు.
  • తమ సంస్కృతిని కొనసాగించడానికి ఈ పద్ధతికి ప్రాధాన్యం ఇచ్చేవారు.
  • తమ ప్రాంతం అలవాటైనందువల్ల అందులోనే జీవించడానికి ఇష్టం చూపి ఈ రకమైన వివాహం చేసుకునేవారు.
  • తమ జైవిక లక్షణాలు చెడిపోకుండా ఉండటానికి దీనికి ప్రాధాన్యం ఇచ్చేవారు.
బహిర్వివాహం
ఒక సమూహానికి చెందిన వ్యక్తి మరో సమూహానికి చెందిన మహిళను జీవిత భాగస్వామిగా చేసుకునే పద్ధతిని ‘బహిర్వివాహం’ అంటారు. దీనికి సంబంధించి కొన్ని నిషేధాలు, ఎవరిని చేసుకోవాలనే విషయంలో విధి విధానాలు ఉన్నాయి.
ఉదా: హిందూ సమాజంలో స్వగోత్రికుల మధ్య వివాహం నిషేధం. దీన్ని ‘సంపద పద్ధతి వివాహం’ అంటారు. దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.

బహిర్వివాహానికి కారణాలు:
  • ప్రాచీన యుగంలో పెద్ద పెద్ద మృగాలను వేటాడటానికి సహాయం కోసం ఒక సమాజంలోని వ్యక్తులు మరో సమాజంలోని వ్యక్తులపై ఆధారపడేవారు. దీని కోసం ఒకరిపై మరొకరు నమ్మకం పెంచుకునేందుకు స్త్రీలను ఇచ్చి పుచ్చుకోవడం మొదలు పెట్టారు.
  • ఒకే సమాజంలోని స్త్రీ, పురుషుల మధ్య లైంగిక ఆకర్షణ తగ్గినందువల్ల బహిర్వివాహానికి మొగ్గు చూపారు.
  • ఒక సమాజంలో స్త్రీల కొరత ఎక్కువగా ఉండటంతో మరో సమాజానికి చెందిన యువతులను వివాహం చేసుకున్నారు.
  • ఒక సమాజంలో ఆహార కొరత తీవ్రంగా ఉండటంతో మరో ఉన్నత సమాజానికి చెందిన యువకులకు స్త్రీలను ఇచ్చేవారు. ఉదా: గంగానది పరీవాహక ప్రాంతంలో వ్యవసాయం అభివృద్ధి చెందడం వల్ల ఆహారం సమృద్ధిగా లభించేది. కానీ రాజస్థాన్‌లోని థార్ ఎడారి పరిసర ప్రాంతాల్లో అల్ప వర్షపాతం కారణంగా ఆహార కొరత ఉండేది.
  • ఒక సమాజంలోని వ్యక్తుల మధ్య గౌరవం తగ్గడం కూడా బహిర్వివాహానికి కారణం.
ఏక వివాహం
ఒక పురుషుడు, ఒక స్త్రీని ఒకేసారి వివాహమాడటాన్ని ‘ఏక వివాహం’ అంటారు. భారతీయ సమాజంతోపాటు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన, మంచి ఆదరణ ఉన్న పద్ధతి ఇది. ఏక వివాహంలో ఆప్యాయత, నిజాయితీతో కూడిన ప్రేమ, అనురాగం ఉంటాయి. పిల్లల సంరక్షణ బాగుంటుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది.
ఎ) ఏక కాలిక ఏక వివాహం: స్త్రీ సంతానవతి కానప్పుడు, భర్తకు, భార్యకు సరిపడక విడాకులు ఇచ్చుకున్నప్పుడు ‘పునర్వివాహం’ చేసుకుంటారు. దీన్నే ‘ఏక కాలిక ఏక వివాహం’ అంటారు. ఇది కొన్ని భారతీయ ఆదిమవాసి తెగల్లో కనిపిస్తుంది. ఇది నిలకడలేని వైవాహిక జీవనాన్ని ప్రతిబింబిస్తుంది. కేరళలోని ఇరుళ, యూరాళి మొదలైన ఆహార సంగ్రాహక ఆదిమ తెగల్లో ఈ రకమైన వివాహం కనిపిస్తుంది.
బి) జీవితాంతపు ఏక వివాహం: జీవితాంతం ఒకే భాగస్వామితో జీవిస్తే దాన్ని ‘జీవితాంతపు ఏక వివాహం’ అంటారు. ఇది చాలా స్థిరమైన వివాహ రూపం. భార్య, భర్త మధ్య ఉండే అన్యోన్యత, నిలకడైన దాంపత్య జీవనానికి ఇది ప్రతీకగా ఉంటుంది. జీవితాంతపు ఏక వివాహం అనేక ఆదిమ వాసి తెగల్లో ఉంది.
ఉదా:
1) గోండులు
2) భిల్లులు
3) సంతాల్‌లు
4) నాగాలు

మాదిరి ప్రశ్నలు

1. మానవ వివాహ చరిత్రను రచించిన ప్రఖ్యాత సమాజ శాస్త్రవేత్త?
ఎ) ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్
బి) మోర్గాన్
సి) మర్డాక్
డి) టైలర్


































#Tags