Group 3 Exam Questions: ముతక జననాలు.. ముతక మరణాలు!.. గ్రూప్‌–3 పరీక్షల్లో ఈ ప్రశ్నలు!.. శ్రద్ధ పెట్టలేదని టీజీపీఎస్సీపై విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌: ముతక జననాలు.. ముతక మరణాలు.. ఇదేంటి ఏవో కొత్త పదాల్లా ఉన్నాయా? వీటి అర్థమేమిటనే సందేహం వస్తోందా? ఇవేకాదు గ్రూప్‌–3 పరీక్షల తెలుగు అనువాదంలో ఇలాంటి సరికొత్త పదాలు మరెన్నో ఉన్నా­యి. భారత జనాభా వృద్ధిరేటుకు సంబంధించిన ప్రశ్నలో.. ‘ది క్రూడ్‌ బర్త్‌ రేట్‌’ అనే ఆంగ్ల పదానికి ‘ముతక జననాల రేటు’ అనే అనువాదం చేశారు.

మరో ప్రశ్నలో ‘క్రూడ్‌ డెత్‌ రేటు’ అంటే.. ‘ముతక మరణాల రేటు’ అని తెలుగులో ఇచ్చా­రు. కొన్ని ప్రశ్నలలో తెలుగులో పదాలే లేనట్టుగా నేరు­గా ఇంగ్లిష్‌ పదాలనే తెలుగు లిపి ఇచ్చారు. దీనిపై అభ్య­ర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు మీడియం వారి పరిస్థితి ఏమిటి?..:

సాధారణంగా టీజీపీఎస్సీ ఉద్యోగ పరీక్షల ప్రశ్నపత్రాలను ఆంగ్లంలో రూపొందించి, తెలుగులోకి అనువాదం చేస్తుంటారు. రెండు భాషల్లోనూ ప్రశ్నలు ఇస్తుంటారు. ప్రశ్నలు ఆంగ్లంలో సరి­గానే ఉన్నా.. తెలుగు అనువాదం మాత్రం దారుణంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

చాలా మంది తెలుగు మీడియంలో చదివినవారే ఉంటారు. వారు తెలుగులో పరీక్ష రాసేందుకు మొగ్గు చూపుతుంటారు. అలాంటి వారికి ఇంగ్లిష్‌లోని ప్రశ్న ఏమాత్రం అర్థంకాకపోయినా, తెలుగులోని అనువాదం సరిగా లేకుంటే సమాధానాలు సరిగా రాయలేని పరిస్థితి ఉంటుంది. 

చదవండి: TGPSC Group-3 2024 Paper 1 QP With Key

కానీ అధికారులు ప్రశ్నపత్రాలను తెలుగులోకి అనువాదం చేసే అంశాన్ని కనీసం పట్టించుకున్నట్టు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతు­న్నాయి.

తెలుగులోని కొన్ని ప్రశ్నల­ను చూస్తుంటే ఏదో కొత్త భాష చదువుతున్నట్టుగా ఉందని అభ్యర్థులు వాపోతు­న్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ఇంత తేలికగా తీసుకోవడం ఏమిటని మండిపడుతున్నారు.  లిప్యంతరీకరణ చేయడమేంటని అడుగు­తు­న్నారు.

చదవండి: TGPSC Group-3 2024 Paper 2 QP With Key

యూపీ­ఎస్సీ వంటి జాతీయ పరీక్షల్లో ఎలాగూ ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఇస్తుంటారని.. కనీ­సం రాష్ట్ర స్థాయిలో రాసే పరీక్షల్లోనైనా తెలుగులో చూసుకుని పరీక్ష రాసే పరిస్థితి లేదని వాపోతున్నారు.

‘‘గ్రూప్‌–3 పరీక్ష మా­త్ర­మే కాకుండా రాష్ట్రంలో జరిగే అన్ని రకాల పోటీ పరీక్షల్లో అనువాదం సమస్య ఇలాగే ఉంటోంది. ఈ విషయంలో టీజీపీఎస్సీ ఎందుకు చొరవ తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. దీనితో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది’’ అని కృష్ణ ప్రదీప్‌ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌ పేర్కొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

మూడు సెషన్ల హాజరు 50.24 శాతం

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–3 ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించిన అర్హత పరీక్షలు సోమవారంతో ముగిశా­యి. రెండు రోజుల పాటు మూడు సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు 50.24  శాతం మంది అభ్యర్థులు హాజర­య్యా­రు.

ఈ పరీక్షల కు మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా.. 76.4 శాతం మందే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆ ప్రక్రియలోనే పావు వంతు అభ్యర్థులు పరీక్షలకు దూరమవగా.. మరో పావు వంతు మంది హాల్‌టికెట్లు తీసుకుని కూడా పరీక్షలు రాయలేదు.

#Tags