APPSC Group 2 Exam Pattern : ఇక‌పై గ్రూప్‌–2లో రెండు పేపర్లే.. ఈసారి నుంచి ఈ విధానంలోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రూప్‌–2 పోస్టులకు నిర్వహించే పరీక్ష విధానంలో మార్పులు చేసింది. ఇప్పటివరకు గ్రూప్‌–2 మెయిన్స్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని రెండుకు కుదించింది.
appsc group 2 new exam pattern 2023 details

ఈ మేరకు జ‌న‌వ‌రి 6వ తేదీన (శుక్రవారం) జీవో 6ను విడుదల చేసింది. పరీక్ష విధానం, సిలబస్‌పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రభు­త్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమో­దిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

చదవండి: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

ఈసారి నుంచి ఈ విధానంలోనే..
గతంలో గ్రూప్‌–2 స్క్రీనింగ్‌ టెస్టును 150 మార్కులకు నిర్వహించేవారు. మెయిన్స్‌లో పేపర్‌–1 జనరల్‌ స్టడీస్‌ ఉండేది. అలాగే మరో రెండు పేపర్లుండేవి. పేపర్‌కు 150 చొప్పున 450 మార్కులకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి నుంచి ఈ విధానంలో మార్పులు చేశారు. గతంలో మెయిన్స్‌లో పేపర్‌–1గా ఉన్న జనరల్‌ స్టడీస్‌ను రద్దు చేసి దాన్ని స్క్రీనింగ్‌ టెస్టుకు మార్చారు. దీన్ని గతంలో మాదిరిగానే 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇక మెయిన్స్‌ను రెండు పేపర్లకు తగ్గిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున 300 మార్కులు ఉంటాయి. ఈ క్రమంలో మెయిన్స్‌ సిలబస్‌ అంశాల్లోనూ మార్పులు చేశారు.

చ‌ద‌వండి: APPSC Group 1 Preparation Tips: గ్రూప్‌-1.. గురి పెట్టండిలా!

కొత్త విధానం ప్రకారం.. గ్రూప్‌–2 పరీక్ష, సిలబస్‌ మార్పులు ఇవే..

స్క్రీనింగ్‌ టెస్ట్‌:

జనరల్‌ స్టడీస్‌  –మెంటల్‌ ఎబిలిటీ :    150 మార్కులు 

మెయిన్‌ పరీక్షలు పేపర్‌–1: (150మార్కులు)
1. సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఏపీ సామాజిక చరిత్ర, సాంస్కృతోద్యమాలు)
2. జనరల్‌ ఓవర్‌ వ్యూ ఆఫ్‌ ద ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌

మెయిన్‌ పరీక్షలు పేపర్‌–2:  (150మార్కులు)
1. ఇండియన్‌ ఎకానమీ అండ్‌ ఏపీ ఎకానమీ
2. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

చ‌ద‌వండి: Indian Polity Preamble Notes: వివాదాలు - సుప్రీంకోర్టు తీర్పులు.. ప్రముఖుల అభిప్రాయాలు 
 

182 పోస్టులకు అనుమతి..

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 182 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. దీంతో ఇందులో డిప్యూటీ తహసీల్దార్‌–30, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2–16, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, కోపరేటివ్‌–15, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3–05, ఏఎల్‌వో (లేబర్‌)–10, ఏఎస్‌వో (లా)–02, ఏఎస్‌వో(లేజిస్లేచర్‌)–04, ఏఎస్‌వో(సాధారణ పరిపాలన)–50, జూనియర్‌ అసిస్టెంట్స్‌(సీసీఎస్‌)–05, సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)–10, జూనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)–20, సీనియర్‌ అడిటర్‌(స్టేట్‌ ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌)–05, ఆడిటర్‌(పే అండ్‌ అలవెన్స్‌ డిపార్ట్‌మెంట్‌)–10 తదితర పోస్టులు ఉన్నాయి. త్వరలో వెలువడే గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో ఈ సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది.

AP RBK Jobs : ఏపీలో 7,384 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

గ్రూప్‌-2 విజయం సాధించాలంటే..?

గ్రూప్‌–2 పరీక్షలో గెలుపు కోసం సిలబస్‌ అంశాలపై పట్టు సాధించడం చాలా ముఖ్యం. అందుకే అభ్యర్థులు తొలుత సిలబస్‌ ఆసాంతం అవగాహన చేసుకోవాలి. ఆయా అంశాలకు ఉన్న వెయిటేజీకి అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను సాగించాలి. ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశాలను గుర్తించాలి. వాటి కోసం సమయం కేటాయించాలి.

గ్రూప్‌–1తో సమన్వయం చేసుకుంటూ..
ఇటీవల ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఈ పరీక్షకు పోటీ పడే వారిలో అధిక శాతం మంది గ్రూప్‌–2కు కూడా దరఖాస్తు చేసుకుంటారు. ఇలాంటి అభ్యర్థులు గ్రూప్‌–1తో సమన్వయం చేసుకుంటూ సిద్ధమైతే.. గ్రూప్‌–2లోనూ విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.గ్రూప్‌–1, గ్రూప్‌–2 సిలబస్‌లో దాదాపు 80 శాతం అంశాలు ఒకే మాదిరిగా ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు గ్రూప్‌–1 ఓరియెంటేషన్‌తో.. డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో ముందుకు సాగితే.. గ్రూప్‌–2 సిలబస్‌పైనా పట్టు సాధించే అవకాశం ఉంది.

➤ ఈ మూడు వ్యూహాలు పాటిస్తే.. ప్రభుత్వ ఉద్యోగం మీదే..

ఈ సబ్జెక్ట్‌ల్లో పట్టు సాధించడంతోపాటు..
సిలబస్‌ అంశాలను చదివేటప్పుడు వాటిని సమకాలీన అంశాలతోనూ సమన్వయం చేసుకుంటూ ప్రిపేరవ్వాలి. తద్వారా కోర్‌ సబ్జెక్ట్‌ల్లో పట్టు సాధించడంతోపాటు సమకాలీన పరిణామాలపైనా అవగాహన వస్తుంది. ముఖ్యంగా గ్రూప్‌–1 అభ్యర్థులకు ఇది కలిసొచ్చే అంశం.

ఇలా గురి పెట్టితే..

☛ ఆయా అంశాలను చదివేటప్పుడు విశ్లేషణాత్మక దృక్పథాన్ని అనుసరించాలి. సమకాలీన అంశాలపై పూర్తి స్థాయి అవగాహన, విశ్లేషణ, స్వీయ అభిప్రాయ దృక్పథం పెంచుకోవాలి. ముఖ్యమైన అంశాలకు సంబంధించి సినాప్సిస్, నేపథ్యం, ప్రభావం, ఫలితం, పర్యవసానాలు.. ఇలా అన్ని కోణాల్లో అవగాహన పెంచుకోవాలి. 
☛ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. ముఖ్యంగా నవరత్నాలు, ఇతర అన్ని సంక్షేమ, అభివృద్ది పథకాలు, లక్షిత వర్గాలు, బడ్జెట్‌ కేటాయింపులు, ఇప్పటివరకు లబ్ధి పొందిన వారి సంఖ్య తదితర వివరాలను అవపోసన పట్టాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న ఆర్థిక విధానాలు, వాటిద్వారా కలిగిన అభివృద్ధిపై దృష్టి సారించాలి. 
☛ జాతీయ స్థాయిలో తాజా రాజ్యాంగ సవరణలు, నూతన జాతీయ విద్యా విధానం, ఇటీవల కాలంలో కీలకమైన తీర్పుల గురించి అవగాహన అవసరం.

☛ APPSC & TSPSC : సైన్స్ అండ్ టెక్నాలజీ స‌బ్జెక్ట్‌ను ఎలా చ‌ద‌వాలంటే..?

ఈ కీలక అంశాలపై ప‌ట్టు సాధిస్తే..

☛ హిస్టరీలో రాష్ట్ర చరిత్ర,సంసృతికి సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. ప్రాచీన చరిత్ర మొదలు ఆధునిక చరిత్ర వరకూ..ముఖ్యమైన అంశాలపై పట్టు పెంచుకోవాలి. జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర గురించి అధ్యయనం చేయాలి. ఇదే తీరులో భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలనూ అధ్యయనం చేయాలి.
☛ భౌగోళిక శాస్త్రానికి సంబంధించి.. రాష్ట్రంలోని భౌగోళిక వనరులు, అడవులు, జీవ సంపద, వ్యవసాయ వనరుల గురించి తెలుసుకోవాలి. వీటిని తాజా పరిస్థితులతో అన్వయం చేసుకోవాలి. గతేడాది కాలంలో చేపట్టిన వ్యవసాయ, నీటి పారుదల ప్రాజెక్ట్‌లు.. వాటి ద్వారా లబ్ధి చేకూరే ప్రాంతాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

☛ పాలిటీ విభాగంలో రాణించేందుకు రాజనీతి శాస్త్రం, రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలు, భావనలు మొదలు తాజా పరిణామాలు(రాజ్యాంగ సవరణలు వాటి ప్రభావం) వరకూ తెలుసుకోవాలి. గవర్నెన్స్, లా, ఎథిక్స్‌కు సంబంధించి సుపరిపాలన దిశగా చేపడుతున్న చర్యలు, పబ్లిక్‌ సర్వీస్‌లో పాటించాల్సిన విలువలు, ప్రజాసేవలో చూపించాల్సిన నిబద్ధత, అంకిత భావం వంటి విషయాలపైనా అవగాహన పెంచుకోవాలి. వాస్తవానికి దీనికి సంబంధించి ప్రత్యేక పుస్తకాలు లేనప్పటికీ.. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పుస్తకాలు కొంత మేలు చేస్తాయి. న్యాయపరమైన అంశాలపైనా పట్టు సాధించాలి. ప్రాథమిక హక్కులు, విధులు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు.. వీటికి సంబంధించి న్యాయ వ్యవస్థకున్న అధికారాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా, సివిల్, క్రిమినల్‌ లా, కార్మిక చట్టాలు, సైబర్‌ చట్టాలు, ట్యాక్స్‌ లాస్‌లను చదవాలి. 
☛ ఎకానమీ ప్రిపరేషన్‌ ప్రారంభ దశలో మౌలిక భావనలు మొదలు తాజా వృద్ధి రేట్ల వరకూ.. గణాంక సహిత సమాచారం సేకరించుకుని పరీక్షకు సన్నద్ధం కావాలి. ఇటీవల కాలంలో చేపట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణలు, వాటిద్వారా లబ్ధి చేకూరే వర్గాలు; జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తాజాగా తీసుకొచ్చిన విధానాలపై పట్టు సాధించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు, ఎకనామిక్‌ సర్వేలను అధ్యయనం చేయాలి. 
☛ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమలవుతున్న కొత్త విధానాలు, ప్రధాన సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఐసీటీ విధానాలు, ఇండియన్‌ స్పేస్‌ ప్రోగ్రామ్, డీఆర్‌డీఓ, ఇంధన వనరులు, విపత్తు నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు పర్యావరణ సంబంధిత అంశాలపైనా దృష్టి సారించాలి. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానాలపై అవగాహన పెంచుకోవాలి.

Sankranthi Holidays 2023 : తెలంగాణ‌లో సంక్రాంతి సెల‌వులు ఇవే.. ఏపీలో మాత్రం భారీగానే..

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014పై..
గ్రూప్‌–2 అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. జనరల్‌ స్టడీస్, ఎకానమీ, హిస్టరీ పేపర్లు అన్నింటిలోనూ.. ఈ చట్టం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి అభ్యర్థులు పునర్విభజన చట్టాన్ని ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి. విభజన తర్వాత ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు.. వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి తెలుసుకోవాలి.

ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 పరీక్ష విధానంలో మార్పుల పూర్తి ఇవే..

 

#Tags