Telangana Formation Day: ఈ దినం ప్ర‌తి తెలంగాణ బిడ్డ గ‌ర్వంగా తలెత్తుకునే రోజు.. ఎందుకంటే..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయింది. అరవై ఏళ్లలో రెండు ఉత్తుంగ తరంగాల్లా సాగిన ఉద్యమం ఫలితంగా.. ఎట్టకేలకు సకల జనుల కలను సాకారం చేస్తూ ‘తెలంగాణ’ ఆవిర్భవించింది.
Telangana Formation Day

ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో జనం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌కు ఉద్యమపార్టీ హోదాలో అధికారాన్ని కట్టబెట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉరికించామని ప్రభుత్వం చెబుతోంది.

ఆ దినం ఒక చారిత్రాత్మకం..  
తెలంగాణకు సంబంధించి 2014 జూన్‌ 2 ఒక చారిత్రాత్మక దినం. ఆ రోజు తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన రోజు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నిర్మాత కె. చంద్రశేఖర్‌రావు స్వప్నం సాకారమైన రోజు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు! కొత్త రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు. తమ భవిష్యత్తు మీద ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్న రోజు!!

ఏ తెలంగాణ బిడ్డ అయినా..
ఎనిమిదేళ్ల తరువాత వెనక్కి తిరిగి చూసు కుంటే... తెలంగాణ ప్రజల ఆశలు చాలా వరకు నెరవేరినట్లే అనిపిస్తుంది. ఏవో కొద్ది ప్రాంతాల్లో తప్ప తెలంగాణ అంతటా సాగునీటికీ, తాగునీటికీ ఇబ్బందులు తొలగాయి. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను పక్కకు నెట్టేసి మనం ముందుకుపోతామని ఏ తెలంగాణ బిడ్డ అయినా అనుకున్నాడా!  పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏటా వేల రూపాయలు అంది స్తారని ఏ రైతైనా ఊహించాడా?  

మంచినీళ్ల కోసం..
రైతు చనిపోతే కుటుంబం వీధినపడే పరిస్థితి నుంచి రూ. 5 లక్షల బీమా సొమ్ముతో ప్రభుత్వమే కుటుంబాన్ని నిలబెడుతుందని అనుకున్నామా? 24 గంటల కరెంటు సరఫరాను ఊహించామా! ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం ప్రభుత్వమే చేస్తుందనీ, మంచినీళ్ల కోసం బిందెలు భుజాన పెట్టుకొని ఫర్‌లాంగ్‌ల కొద్దీ నడిచిన ఆడపడుచులకు ఇంటి ముంగిట నల్లా తిప్పు కుంటే నీళ్లు వచ్చే రోజులు వస్తాయనీ భావించారా!

దిక్కులేని పరిస్థితుల నుంచీ..
గాంధీ, ఉస్మానియా తప్ప.. మరో ఆస్పత్రి దిక్కులేని పరిస్థితుల నుంచీ... ప్రతి ఒక్కరికీ అందు బాటులో ఆస్పత్రి ఉంటుందని కలలోనైనా అను కున్నారా? చదువుకు గతిలేని పరిస్థితుల నుంచి దేశంలోనే అత్యధిక రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని ఏ పండితు డైనా భాష్యం చెప్పాడా? చేనేత కార్మికులకు నూలే ఉరితాడయ్యే దశ నుంచి... ‘బతుకమ్మ చీరల’తో భవిష్యత్తుకు భద్రత లభిస్తుందని ఎవరైనా భరోసా ఇచ్చారా? 

ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒక బక్కాయన అసాధ్యాన్ని  సుసాధ్యం చేశాడు. తెలంగాణ ముఖ చిత్రాన్నే మార్చేశాడు. ఇందుకు ఆయన ప్లానింగ్, దార్శనికత, ముందుచూపు, విషయ పరిజ్ఞానం, కృషి, పట్టుదలలే కారణం. ఇవే ఆయననూ, తెలం గాణ రాష్ట్రాన్నీ ముందుకు నడిపించాయి. తెలంగాణ అస్తిత్వ, ఆత్మగౌరవాలకు ప్రతీక కేసీఆర్‌!!

ఇంకా సాధించాల్సింది ఎంతో..! 
తెలంగాణ  రాష్ట్రం సిద్ధించి అప్పుడే 8 ఏండ్లు పూర్తయ్యింది. ఈ ఎనిమిదేండ్లలో కేసీఆర్‌ పనితీరు ఎలా ఉంది? టీఆర్‌ఎస్‌ ఒక రాజకీయ పార్టీగా అవలంబిస్తున్న విధానాలు, చేపట్టిన ప్రాజెక్ట్‌లు, పథకాలు; పదవుల పంపకాలు, పంచాయితీలు వంటి అనేక అంశాలు ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి.

మా నిధులు మాకే.. అన్న క‌ల‌ను..
తెలంగాణ  రాష్ట్రం వస్తే ఏం వచ్చిందని అడిగితే.. ఆత్మ స్థైర్యం వచ్చిందనీ, ఆత్మ గౌరవం పెరిగిందనీ,‘మాది తెలంగాణ ’ అని సగర్వంగా చెప్పుకునే సాధికారికత సిద్ధించిందనీ చెప్పుకోగలిగిన స్థితిలో ఉన్నాం. మన పండుగలు, మన భాష యాస, మన పాటలు, పాఠాలతో తలెత్తుకొని నిలబడి గెలిచి నిలుస్తోంది తెలంగాణ.. ‘మా నిధులు మాకే’ అన్న కల నిజమైన వాస్తవాన్ని హర్షించకుండా ఉండలేం. రాష్ట్రం తన నిర్ణయాలను తానే తీసుకుంటూ, తన తప్పుల్ని తానే సరిదిద్దుకుని, తన ముద్రను బలంగా వేస్తూ.. జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో తన వాణిని వినిపిస్తున్న నేప థ్యంలో ‘తెలంగాణ  నాది’ అని సగర్వంగా చెప్పకుండా ఉండలేం. అయినా అందుకోవాల్సిన లక్ష్యాలూ, నెరవేర్చాల్సిన ఆకాంక్షలూ ఉన్నాయి.

కొద్దికాలంలోనే 426 పథకాలను..
ఆరు దశాబ్దాలుగా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలకు మరింత చేయూతను అందించాల్సిన అవసరం కనబడుతోంది. ప్రతి రంగంలో ఇక్కడి భూమి పుత్రులకే అవకాశాలు దక్కేలా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. ఏ రాష్ట్రం పోటీ పడలేని విధంగా కొద్దికాలంలోనే 426 పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. సంతోషమే! కానీ, రాష్ట్రం ఏర్పడక ముందు టీఆర్‌ఎస్‌ ప్లీనరీలలో, బహిరంగ సభల్లో; తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలలో పేర్కొన్న అనేక అంశాలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంది. సమర్థ నాయకత్వం సమాజానికి లభించినప్పుడు సక్రమమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. సమాజానికి ప్రశ్నించేతత్వం ఉన్నప్పుడు నాయకత్వం మరింతగా సమర్థమంతమవుతుంది. అప్పుడే సకల జనుల అభివృద్ధీ సాధ్యమవుతుంది.
అమరవీరుల కుటుంబాల సంగతేమిటి?

60 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో.. ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై  ఎనిమిదేళ్లయింది. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి అమరులయ్యారు. అయితే రాష్ట్రం సిద్ధించినా అమరుల కుటుంబాల పరిస్థితి ఇంకా మారలేదు అనేది వాస్తవం. దాదాపు 1,200 మంది తెలంగాణ వాదులు మలి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. కేసీఆర్‌ అమరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్తూ మొదటి అసెంబ్లీ సమావేశంలోనే బిల్లు పెట్టారు. ఆ తర్వాత జీఓ నంబర్‌ 80 విడుదలయింది. 

దీనిలో అమరుల కుటుంబాల్లో అర్హులైనవారికి ఉద్యోగం ఇవ్వడం, రూ. 10 లక్షలు ధనసహాయం చేయడం, విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం, ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల కుటుంబాలకు గృహసముదాయం నిర్మించడం, అలాగే ప్రతి కుటుంబానికీ మూడెకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేయడం, రాజధాని హైదరాబాద్‌లో పెద్ద స్మారక స్తూపాన్ని నిర్మించడం వంటి విషయాలను ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు 576 మందికి మాత్రమే ఉద్యోగం, పది లక్షల రూపాయల ధన సహాయం లభించింది.

#Tags