Sheikh Hasina: ఘనమైన రికార్డు.. అప్రతిష్ట మూటగట్టుకున్న ఐరన్‌ లేడీ.. ఈమెనే!!

బంగ్లాదేశ్‌కు స్వేచ్ఛా వాయువులందించిన బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ గారాలపట్టి. ఆయన వారసురాలిగా తొలినాళ్లలో బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు గళమెత్తిన నేతగా అంతర్జాతీయ గుర్తింపు.

అనంతర కాలంలో రాజకీయ రంగంపైనా తిరుగులేని ముద్ర. దేశ చరిత్రలో ఏకంగా ఐదుసార్లు ప్రధాని పదవిని అధిష్టించిన ఏకైక నేత. ఇంతటి ఘనమైన రికార్డులు షేక్‌ హసీనా సొంతం. 

ఐరన్‌ లేడీగా పేరు..
అభిమానుల దృష్టిలో ఐరన్‌ లేడీగా పేరు. కానీ ప్రధానిగా 2009లో రెండో దఫా పగ్గాలు చేపట్టిన నాటినుంచీ నియంతగా ఆమె ఇంటా బయటా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. గత గత జనవరిలో విపక్షాలన్నీ మూకుమ్మడిగా బహిష్కరించిన ఏకపక్ష ఎన్నికల్లో ‘ఘనవిజయం’ సాధించి వరుసగా నాలుగోసారి ప్రధాని అయ్యారు. కానీ ఆర్నెల్లు కూడా తిరగకుండానే ప్రజల ఛీత్కారాలకు గురయ్యారు. అవమానకర రీతిలో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దేశం వీడారు! 

విద్యార్థిగానే రాజకీయాల్లోకి.. 
1947లో నాటి తూర్పు పాకిస్తాన్‌ (నేటి బంగ్లాదేశ్‌)లో జన్మించారు హసీనా. ఢాకా వర్సిటీలో చదివే రోజుల్లోనే చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నారు. 1975లో సైన్యం ముజిబుర్, ఆయన భార్య, ముగ్గురు కుమారులతో పాటు 18 మంది కుటుంబీకులను దారుణంగా కాల్చి చంపింది. హసీనా, ఆమె చెల్లెలు రెహానా విదేశాల్లో ఉండటంతో ఈ మారణకాండ నుంచి తప్పించుకున్నారు. 

Israel Hamas war: ఇస్మాయిల్ హనియే హత్య వెనక ఉన్న‌ మతిపోయే ప్లాన్!!

భారత్‌లో ఆరేళ్ల ప్రవాసం అనంతరం 1981లో హసీనా బంగ్లా గడ్డపై కాలు పెట్టారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా గళం విప్పారు. పలుమార్లు గృహనిర్బంధానికి గురయ్యారు. 1996లో తొలిసారి ప్రధాని అయ్యారు. 2001లో ఓటమి చవిచూసినా 2008 ఎన్నికల్లో రెండోసారి గద్దెనెక్కారు. నాటినుంచీ ప్రధానిగా కొనసాగుతున్నారు. 2004లో గ్రెనేడ్‌ దాడి నుంచి త్రుటిలో బయటపడ్డారు.

విపక్షాలను వెంటాడి..  
నిజానికి ప్రధానిగా హసీనా సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. రాజకీయ అస్థిరతతో, ఆర్థిక అవ్యవస్థతో కొట్టుమిట్టాడిన బంగ్లాదేశ్‌ను ఒడుపుగా ఒడ్డున పడేశారు. కానీ 2009లో రెండోసారి పగ్గాలు చేపట్టాక విపక్ష నేతలే లక్ష్యంగా ప్రతీకార రాజకీయాలకు హసీనా తెర తీశారు. 1971 యుద్ధ నేరాల కేసులను తిరగదోడారు. ట్రిబ్యునల్‌ ద్వారా శరవేగంగా విచారణ జరిపి పలువురు ఉన్నతస్థాయి విపక్ష నేతలను దోషులుగా తేల్చారు. ఖలీదా సారథ్యంలోని విపక్ష బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్‌పీ) కీలక భాగస్వాములను 2013లో ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు.

అవినీతి ఆరోపణలపై జైలుశిక్ష!
అవినీతి ఆరోపణలపై ఖలీదాకు 17 ఏళ్ల జైలుశిక్ష పడింది. వీటికి తోడు ఆర్థిక పరిస్థితి దిగజారింది. దేశంలో ఏకంగా 3.2 కోట్లమంది నిరుద్యోగులున్నారు. ఇలాంటి సమయంలో రిజర్వేషన్ల కోటాను తిరగదోడటం హసీనాకు రాజకీయంగా మరణశాసనం రాసింది. నాటి యుద్ధంలో ప్రధానంగా పాల్గొన్నది నేటి అధికార పార్టీ అవామీ లీగే. దాంతో, సొంత పార్టీ కార్యకర్తలకు అత్యధిక లబ్ధి చేకూర్చేందుకే రిజర్వేషన్లను తిరిగి తెరపైకి తెచ్చారంటూ దేశమంతా భగ్గుమంది. కీలక సమయంలో సైన్యం కూడా సహాయ నిరాకరణ చేయడంతో హసీనా రాజీనామా చేసి ప్రాణాలు కాపాడుకునేందుకు దేశం వీడాల్సి వచ్చింది.

Wayanad Landslides: పర్యావరణ విధ్వంసం.. దీనికి మనిషి దురాశే కారణం!

నాడూ ఆరేళ్లు భారత్‌ ఆశ్రయం 
ఆపత్కాలంలో షేక్‌ హసీనాకు భారత్‌ ఆశ్రయమివ్వడం కొత్తేమీ కాదు. ముజిబుర్‌ను సైన్యం పొట్టన పెట్టుకున్నాక 1975 నుంచి 1981 దాకా ఆరేళ్లపాటు సోదరి, భర్త, ప్లిలలతో పాటు ఆమె భారత్‌లోనే ఆశ్రయం పొందారు. ఢిల్లీలోని లజ్‌పత్‌ నగర్, పండోరా రోడ్‌ నివాసాల్లో గడిపారు. రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో నాటి రోజులను హసీనా గుర్తు చేసుకున్నారు. ‘అప్పుడు నేను, నా భర్త పశ్చిమ జర్మనీలో ఉన్నాం. మాకు ఆశ్రయమిస్తామంటూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ వర్తమానం పంపారు. ఢిల్లీలో దిగగానే నేరుగా ఆమెను కలిశాను. నా తండ్రితో పాటు కుటుంబంలో 18 మందిని సైన్యం పొట్టన పెట్టుకున్నట్టు ఆమె ద్వారానే నాకు తెలిసింది. రహస్యంగా ఢిల్లీలోనే కాలం వెళ్లదీశాం. నా భర్త ఇక్కడే ఉద్యోగం కూడా చేశారు’ అని చెప్పుకొచ్చారు హసీనా.

Apollo 11 Mission: అందరాని చందమామను మానవాళి సగర్వంగా అందుకున్న రోజు ఇదే..

#Tags