ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన

అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, కరువు వంటివాటితో బాధపడుతున్న రైతులకు ఊరటకలిగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పంట బీమా పథకాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)... రైతులు ఆర్థిక అనిశ్చితి నుంచి బయటపడేందుకు దోహదంచేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అతి తక్కువ ప్రీమియం చెల్లించి, బీమా రక్షణ పొందేందుకు ఉద్దేశించిన ఈ పథకం వివరాలు...
గతంలో ప్రవేశపెట్టిన అనేక పంటల బీమా పథకాలు ఆచరణలో విఫలమయ్యాయి. ఈ క్రమంలో మరో కొత్త పథకాన్ని కేంద్రం ప్రకటించింది. జనవరి 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకానికి ఆమోదం లభించింది. రైతుల ఆత్మస్థయిర్యం దెబ్బతినకుండా భారీగా ప్రభుత్వ భాగస్వామ్యంతో తక్కువ ప్రీమియం చెల్లింపునకే ఎక్కువ బీమాను ఈ పథకం అందిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి జరిగే నష్టం నుంచి రైతులను రక్షించేందుకు, మార్కెట్ ధరల ఒడిదొడుకుల బారినపడకుండా, వారి ఆదాయాల్లో స్థిరత్వ సాధనకు కొత్త పథకం ఉపకరిస్తుంది.

సామాజిక భద్రత కల్పనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త బీమా పథకాన్ని ప్రకటించింది. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. పేదలకు అనుకూలంగా బ్యాంకింగ్, పెన్షన్లు, ఉపాధి, బీమాలకు సంబంధించి అనేక పథకాలను ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన పథకంలో చేరడం, లబ్ధి పొందడం సులభతరమైనందు వల్ల దీన్ని ఎక్కువ మంది రైతులు ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న జాతీయ వ్యవసాయ బీమా పథకం, ఆధునికీకరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం ఇకపై మనుగడలో ఉండవు.

సాంకేతికత తోడుగా
కొత్త పంటల బీమా పథకంలో రైతులు తమ వాటాగా చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించినందువల్ల వారిపై ఆర్థిక భారం తగ్గుతుంది. పంట కోత అనంతరం సంభవించే నష్టాలను కూడా బీమా రక్షణ పరిధిలోకి తెచ్చారు. ప్రాంతం ప్రాతిపదికన (Area approach) పథకం అమలవుతుంది. పంట నష్టాల అంచనాను వేగంగా పూర్తిచేసి, నష్టపరిహారం అందించడానికి ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, రిమోట్ సెన్సింగ్ సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. స్మార్ట్‌ఫోన్లతో ఫొటోలు తీసి, ఆన్‌లైన్లో పొందుపరచడం వల్ల వెంటనే నష్టాలను అంచనా వేసేందుకు అవకాశముంటుంది.

గత పథకాల్లో పురోగతి ఎంత?
ప్రస్తుతం వ్యవసాయ రంగం.. వరదలు, కరువు వంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులను రక్షించడం ద్వారా తర్వాతి కాలంలో రుణ అర్హతను పొందే అవకాశం కల్పించడం తప్పనిసరి. ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో భారత ప్రభుత్వం 1985 ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాలు, నూనెగింజలకు వర్తించే విధంగా సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టంది. సహకార పరపతి సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రతి రైతుకు గరిష్టంగా రూ.10 వేల పంట రుణానికి బీమా కల్పించారు. వరి, గోధుమ, చిరుధాన్యాలకు సంబంధించి ప్రీమియంను పంట రుణంలో 2 శాతంగా నిర్ణయించారు. అదే విధంగా పప్పు ధాన్యాలు, నూనెగింజలకు ఒక శాతంగా నిర్దేశించారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని 15 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేశారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాతి నుంచి 1997-98 రబీ వరకు 6.50 కోట్ల మంది రైతులు పథకం పరిధిలోకి వచ్చారు. ఈ కాలంలో వసూలైన ప్రీమియం కేవలం రూ.313 కోట్లు కాగా, రైతుల క్లెయిమ్స్‌కు చెల్లించిన మొత్తం రూ.1623 కోట్లు. పథకం కింద వచ్చిన నష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2:1 నిష్పత్తిలో భరించాయి. ఈ పథకాన్ని 1997లో రద్దు చేశారు.

జాతీయ వ్యవసాయ బీమా పథకం
సమగ్ర పంటల బీమా పథకం అమల్లో విఫలమవడంతో ప్రభుత్వం.. 1999-2000 రబీ సీజన్లో జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని రాష్ట్రీయ కృషి బీమా యోజన పథకంగా పిలుస్తారు. ఇది అన్ని పంటలకు వర్తిస్తుంది. ఎలాంటి గరిష్ట పరిమితి లేకుండా బ్యాంకు రుణాలు తీసుకున్నవారికి తప్పనిసరిగా, ఇతరులకు స్వచ్ఛందంగా పథకం వర్తిస్తుంది. ప్రీమియం 1.5-3.5 శాతం మధ్య ఉంటుంది. జిల్లాను యూనిట్‌గా తీసుకొని పథకం అమలు చేస్తున్నారు. ఉపాంత, చిన్న రైతులు చెల్లించాల్సిన ప్రీమియంలో 50 శాతం సబ్సిడీ ఇస్తారు. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి.
  • 2002, డిసెంబరులో భారత ప్రభుత్వం అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. ఇది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మరో నాలుగు ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, నాబార్డ్ మూలధన భాగస్వామ్యంతో ఏర్పడింది. 2010-11 రబీ సీజన్లో ఆధునికీకరించిన నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయ మంత్రిత్వశాఖ, ఇండియన్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలు సంయుక్తంగా 2003-04లో ఫార్మ్ ఇన్‌కం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ప్రకృతి వైపరీత్యాలతో పాటు మార్కెట్లో ఒడిదొడుకులకు ఈ పథకం వర్తిస్తుంది. చిన్న, ఉపాంత రైతులకు ప్రీమియంలో 75 శాతాన్ని సబ్సిడీగా ఇస్తారు.
  • 2007-08 బడ్జెట్‌లో కర్ణాటకలో పైలట్ పథకంగా వాతావరణ ఆధారిత పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. పంట ఉత్పత్తిపై అల్పంగా, అధికంగా పడే వర్షపాత ప్రభావానికి ఇది బీమానందిస్తుంది. ఈ పథకంలో ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.
  • కేంద్ర ప్రభుత్వం 1993-94లో లైవ్‌స్టాక్ ఇన్సూరెన్స్‌ను ప్రవేశపెట్టి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తోంది. కేరళ, కర్ణాటక, గోవా, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో 2009-10లో కొబ్బరి బీమా పథకాన్ని ప్రారంభించారు. దీన్ని అగ్నికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ద్వారా కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు అమలు చేస్తోంది.

పీఎంఎఫ్‌బీవై లక్ష్యాలు
1985 తర్వాత అనేక పంటల బీమా పథకాలను ప్రవేశపెట్టినప్పటకీ ఆచరణలో అవి విఫలమయ్యాయి. ఈ క్రమంలో వ్యవసాయంపై రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
  • నోటిఫై చేసిన ఏ పంట అయినా ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల కారణంగా దెబ్బతిన్నప్పుడు రైతులకు బీమా, విత్త మద్దతు అందించడం.
  • రైతుల ఆదాయాల్లో స్థిరత్వం సాధించడం ద్వారా వ్యవసాయంలో కొనసాగే విధంగా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం.
  • నవకల్పనలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించే విధంగా రైతులను ప్రోత్సహించడం.
  • వ్యవసాయ రంగానికి పరపతి ప్రవాహం ఉండే విధంగా చూడటం.

పథకం అమలు-ఏజెన్సీ
బహుళ ఏజెన్సీ ఫ్రేంవర్క్ ద్వారా నూతన బీమా పథకాన్ని అమలు చేస్తారు. వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమ డిపార్ట్‌మెంట్; వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ; భారత ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఏజెన్సీల (వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వంటివి) సమన్వయంతో ఎంపిక చేసిన బీమా కంపెనీల ద్వారా పథకాన్ని అమలు చేస్తారు.
  • ఆర్థిక పటిష్టత, అవస్థాపనా సౌకర్యాలు, మానవ వనరులు తదితర అంశాల ప్రాతిపదికగా కొన్ని ప్రైవేటు బీమా కంపెనీలను ప్రభుత్వం నామినేట్ చేసింది. ఇవి వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమ విభాగం ప్రభుత్వ స్పాన్సర్డ్ వ్యవసాయ/ పంటల బీమా పథకాల్లో పాల్గొంటాయి. బీమా కంపెనీల్లో పథకాన్ని అమలు చేసే ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కంపెనీని ఎంపిక చేసుకుంటుంది.

పథకం యాజమాన్యం
నూతన బీమా పథకాన్ని సక్రమంగా అమలు చేసే, పర్యవేక్షించే భాద్యతలను తీసుకునే సంస్థలు..
  • పంటల బీమాపై ప్రస్తుతమున్న రాష్ట్రా స్థాయి సమన్వయ కమిటీ (ఎస్‌ఎల్‌సీసీసీఐ)
  • ఎస్‌ఎల్‌సీసీసీఐకు సంబంధించిన సబ్ కమిటీ
  • ప్రస్తుతం జాతీయ వ్యవసాయ బీమా పథకం, ఆధునికీకరించిన పంట బీమా పథకం, కోకోనట్ పామ్ ఇన్సూరెన్స్ పథకాల అమలు, పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ (Monitoring committee).
  • నోటిఫైడ్ ప్రాంతంలో పంట రుణ అకౌంట్ లేదా కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్ (రుణం తీసుకున్న రైతులు) కలిగి, పరపతి పొందినవారు; లేదా పంట సీజన్లో నోటిఫైడ్ పంటకు సంబంధించి రుణం రెన్యువల్ అయిన రైతులు కొత్త బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు కావాలి.
  • ఇతర రైతులను కూడా ప్రభుత్వ నిర్ణయానుసారం పంట బీమా పథకం పరిధిలోకి తీసుకొచ్చేందుకు అవకాశముంది.
  • నివారించలేని నష్టభయం కారణంగా పంట దిగుబడి నష్టాలు సంభవించినప్పుడు సమగ్ర నష్ట భయ బీమాను కింది పరిస్థితుల్లో అందిస్తారు.
  • సహజంగా నిప్పంటుకోవడం
  • తుఫాన్లు, హరికేన్లు, టోర్నడోలు, వడగళ్ల వానలు
  • వరదలు, జలమయం, కొండ చరియలు విరిగిపడటం
  • కరువు పరిస్థితులు
  • చీడపురుగులు, వ్యాధులు తదితరాలు.
  • రుణాలు తీసుకున్న రైతులకు కచ్చితంగా నూతన బీమా పథకం వర్తిస్తున్నందున వారు బీమా చేయాల్సిన మొత్తం జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ నిర్ణయించిన ప్రకారం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు సమానంగా ఉంటుంది.
  • బీమా పొందిన రైతు ఎంపికకు అనుగుణంగా సాంకేతిక కమిటీ.. బీమా మొత్తాన్ని దిగుబడి విలువ మొత్తం వరకు పెంచవచ్చు.
  • స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కంటే దిగుబడి విలువ తక్కువగా ఉన్నప్పుడు బీమా చేసిన మొత్తంలో పెరుగుదల ఉంటుంది.

ప్రీమియం సబ్సిడీ
బీమా మొత్తం ఆధారంగా ఖరీఫ్ ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలకు 2 శాతం, రబీ ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలకు 1.5 శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. వాణిజ్య లేదా ఉద్యానవన పంటలకు 5 శాతం ప్రీమియంను రైతులు చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. పొలంలో జరిగిన పంటల నష్టంతో పాటు విత్తనాలు, నాట్లు వేయలేకపోవటం, పంట కోత తర్వాత జరిగే పంట నష్టాలకు బీమా వర్తిస్తుంది. వరదలు వంటి విపత్తుల వల్ల జరిగే పంట నష్టానికి కూడా బీమా వర్తించనుంది. ఈ పథకం కింద పంట నష్టం జరిగిన వెంటనే 25 శాతం మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ నుంచి పీఎంఎఫ్‌బీవై పథకం అమల్లోకి రానుంది.

















#Tags