ప్రమాణాలు లేని 48 ఇంజనీరింగ్ కాలేజీలకు చెక్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 48 ఇంజనీరింగ్ కాలేజీలకు 2020-21 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరం అడ్మిషన్లను ప్రభుత్వం నిలిపివేసింది.
ఈ కాలేజీలను ఎంసెట్-2020 కౌన్సెలింగ్‌లోకి అనుమతించడం లేదు. రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది, ల్యాబ్‌లను సరిగ్గా నిర్వహించడం లేదు. దీంతో ఆయా ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువు పూర్తిచేసుకుని బయటకు వస్తున్న విద్యార్థులు ఉద్యోగాల అన్వేషణలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు నిర్ణీత ప్రమాణాలకు లోబడి ఉంటున్నాయో లేదో పరిశీలన చేయాలని విద్యాశాఖను సీఎం వైఎస్ జగన్ గతంలో ఆదేశించారు. ఆ మేరకు అధికారులు గతేడాదిలో ఇంజనీరింగ్ కళాశాలల్లో విసృ్తతస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. పలు కాలేజీలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని, నిబంధనల ప్రకారం సదుపాయాలు, బోధనా సిబ్బంది, ల్యాబ్‌లు లేవని తనిఖీల్లో గుర్తించారు. లోపాలను సరిదిద్దుకొనేందుకుగాను ఆయా కళాశాలలకు ఆరు నెలల సమయం కూడా ఇచ్చారు. ఆ గడువు మించిపోయినా లోపాలు సరిదిద్దుకోకపోవడంతో 48 ఇంజనీరింగ్ కాలేజీలు, 5 బీఫార్మసీ కళాశాలల్లో అడ్మిషన్లను అధికారులు నిలిపివేశారు. వీటిని జీరో అడ్మిషన్ల కేటగిరీలో చేర్చామని, లోపాలు సరిదిద్దుకొని ప్రమాణాలను మెరుగుపర్చుకుంటే వచ్చే ఏడాదిలో అడ్మిషన్లకు అవకాశం ఉంటుందని అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఆదివారం తెలిపారు.
వర్సిటీల వారీగా జీరో అడ్మిషన్ల కాలేజీలు ఇలా...
వర్సిటీల వారీగా జీరో అడ్మిషన్ల కాలేజీలు ఇలా...
వర్సిటీ | ఇంజనీరింగ్ | బీఫార్మసీ |
ఏఎన్‌యూ | 1 | -- |
జేఎన్‌టీయూ-ఏ | 21 | 2 |
జేఎన్‌టీయూ-కే | 26 | 2 |
ఏయూ | -- | 1 |
#Tags