Engineering Fees: ఫీజులు 25% పెంచాల్సిందే.. ఇంజనీరింగ్‌ కాలేజీల డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపు దిశగా కసరత్తు మొదలైంది. రెండేళ్ల జమా ఖర్చుల లెక్కలు సమర్పించాలని తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ప్రైవేటు కాలేజీలను ఆదేశించింది.

ఆగ‌స్టు 21 నుంచి అక్టోబర్‌ వరకు వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించింది. వాటి ఆధారంగా ఫీజుల పెంపును ఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించనుంది. ఇవి వచ్చే ఏడాది (2025–26) నుంచి అమల్లోకి వస్తాయి. ఈసారి కనీసం 25 శాతం మేర ఫీజులు పెంచాలని ప్రైవేటు కాలేజీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

రెండేళ్లుగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, అనుబంధ కోర్సుల్లో సీట్లు పెరగడం వల్ల అత్యధిక వేతనాలతో ఫ్యాకల్టీని నియమించుకున్నామని చెబుతున్నాయి. అలాగే బ్రాంచీలు మారడంతో కొత్తగా లేబొరేటరీలు, లైబ్రరీల ఏర్పాటుకు ఎక్కువ వ్యయం చేశామని వివరిస్తున్నాయి.

చదవండి: ఇంజనీరింగ్‌ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్

ఇందుకు అనుగుణంగానే లెక్కలు రూపొందిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే ఫీజులు పెరిగాయని, ఇక పెంచొద్దని వివిధ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఫీజుల పెంపునకు ఎఫ్‌ఆర్‌సీ దేన్ని ప్రాతిపదికగా తీసుకుంటుందనే విషయమై స్పష్టత లేదు.

మౌలికవసతుల కల్పనకు పెట్టే ఖర్చును అంగీకరించబోమని ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు అంటున్నాయి. కొత్త కోర్సుల ఏర్పాటు నేపథ్యంలో అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలనేది ప్రైవేటు కాలేజీల వాదన. దీన్ని పరిగణలోకి తీసుకుంటే ఇంజనీరింగ్‌ ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఫీజుల పెంపుపై డిసెంబర్‌ నాటికి స్పష్టత ఇవ్వాలని ఎఫ్‌ఆర్‌సీ భావిస్తోంది.   

#Tags