Engineering: కంప్యూటర్‌ సైన్స్‌ సీటు కోసం పోటాపోటీ

సెప్టెంబర్‌ 28న మొదలు కానున్న ఇంజనీరింగ్‌ రెండోవిడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు దక్కించుకునేందుకు ఎక్కువగా పోటీపడుతున్నారు.
కంప్యూటర్‌ సైన్స్‌ సీటు కోసం పోటాపోటీ

కన్వీనర్‌ కోటాతోపాటు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కోసం ఈసారి విపరీతమైన పోటీ కన్పిస్తోంది. చాలామంది తొలిదశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చినా, సీటు, కాలేజీ నచ్చని కారణంగా వదిలేసుకున్నారు. ఇలాంటివాళ్లు 17 వేలమంది వరకూ ఉన్నారు. ఇందులో చాలామంది కంప్యూటర్‌ సైన్స్, దాని అనుబంధ కోర్సులను ఇష్టపడుతున్నారు. దీంతో రెండోవిడతలో సీటు వస్తుందనే ఆశతో ఉన్నారు. తాజాగా ప్రభుత్వం కంప్యూటర్‌ సైన్స్‌సహా పలు అనుబంధ కోర్సుల్లో 9,240 సీట్లకు అనుమతించింది. ఇది కూడా విద్యార్థులు ఆశలు రేకెత్తిస్తోంది. మరోవైపు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. ఇందులో సీటు వచ్చేవారు తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కౌన్సెలింగ్‌ నుంచి తప్పుకునే అవకాశముంది. ఇది కూడా తమకు కలిసి వస్తుందని పలువురు విద్యార్థులు భావిస్తున్నారు. 

 College Predictor 2022 AP EAPCET TS EAMCET

ఇదే సరైన సమయం... 

రాష్ట్రంలో తొలివిడత ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు మొత్తం 71,286 సీట్లు కన్వీనర్‌ కోటా కింద సిద్ధంగా ఉండగా, 60,208 సీట్లు కేటాయించారు. విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు ఈ కేటాయింపు జరిగింది. సెప్టెంబర్‌ 13వ తేదీ నాటికి సీటు వచ్చినవారు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటే, కేవలం 43 వేల మంది మాత్రమే రిపోర్టింగ్‌ చేశారు. 17 వేలమంది సీటు వచ్చినా, అది తమకు నచ్చలేదని భావించారు. ఇలాంటివారిలో ఎక్కువమంది కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ లేదా ఐటీ, ఆఖరుకు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో సీట్లు ఆశపడుతున్నవారే ఉన్నారు. తొలిదశలో పెంచిన కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు సీట్లు 9,240 అందుబాటులోకి రాలేదు. అందుకే తమకు ఆశించిన సీటు రాలేదనే భావనతో వారు ఉన్నారు. 25 వేలలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా మెరుగైన కాలేజీ, సీటు కోసం తొలిదశలో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టారు. కొంతమంది కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌(సీఎస్‌సీ)లో సీటు వచ్చినా, ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్‌ వంటి కోర్సుల కోసం మొదటి విడతలో జాయిన్‌ అవ్వలేదు. 

☛ Top Engineering Colleges 2022Andhra Pradesh | Telangana

మేనేజ్‌మెంట్‌కు పోటీ 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ సీట్లలో 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా కింద ఉంటాయి. ఇందులో 15 శాతం ఎన్‌ఆర్‌ఐకి ఇవ్వాలి.నిబంధనలు ఎలా ఉన్నా, యాజమాన్యాలు నచ్చినవారికి, నచ్చిన రేటుకు అమ్ము­కోవడం ఏటా జరిగే తంతే. కాలేజీని బట్టి కంప్యూటర్‌సైన్స్‌ సీట్ల రేట్లు రూ.10 నుంచి 16 లక్షల వరకూ పలుకుతున్నాయి. 40 వేలపైన ఎంసెట్‌ ర్యాంకు వచ్చినవారిలో చాలామంది మేనేజ్‌మెంట్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్, సీఎస్‌సీ కోర్సులకు డిమాండ్‌ బాగా కన్పిస్తోంది. 

చదవండి: Coding and Programming Jobs: కోడింగ్‌తో కొలువులు.. నైపుణ్యాలు, సొంతం చేసుకునేందుకు మార్గాలు..

ఈసారి ఆప్షన్లు కీలకమే 

రెండోవిడత ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 28 నుంచి మొదలవుతుంది. తొలి విడత కన్నా, ఇది చాలా కీలకమైందని సాంకేతిక రంగం నిపుణులు అంటున్నారు. కొత్తగా 12 వేలకుపైగా సీట్లు పెరగడం, జేఈఈ ర్యాంకర్లు ఈసారి పోటీలో పెద్దగా ఉండకపోవడం వల్ల రాష్ట్రస్థాయి విద్యార్థులకు సానుకూలంగా ఉండే వీలుందని చెబుతున్నారు. 40 వేల లోపు ర్యాంకు విద్యార్థులు ఆచితూచి ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచిదని చెబుతున్నారు. దాదాపు 5 వేల లోపు ర్యాంకుల్లో ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది ఈసారి పోటీలో ఉండరని, 10 వేల లోపు ర్యాంకు విద్యార్థుల్లో 50 శాతం మాత్రమే ఉండే వీలుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి 40 వేలలోపు ర్యాంకు విద్యార్థులు కోరిన కాలేజీ, సీటు కోసం పోటీపడేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఆపై ర్యాంకు విద్యార్థులు కాలేజీ విషయం పక్కన పెట్టినా, కోరుకున్న సీటును ఎక్కడైనా పొందేందుకు ప్రయత్నించి సఫలం కావచ్చని చెబుతున్నారు. 

#Tags