MBBS 2024 Seats Cut of Ranks: 2023–24లో కాలేజీలవారీగా ఎంబీబీఎస్‌ సీట్ల కటాఫ్‌ ర్యాంకులు విడుదల

MBBS 2024 Seats Cut of Ranks: 2023–24లో కాలేజీలవారీగా ఎంబీబీఎస్‌ సీట్ల కటాఫ్‌ ర్యాంకులు విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలల్లో 2023–24 సంవత్సరంలో సీట్లు దక్కించుకున్న కటాఫ్‌ ర్యాంకు వివరాలను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 54 మెడికల్‌ కాలేజీలుండగా... ఇందులో 8,715 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లన్నీ ఆల్‌ ఇండియా కోటాలో 15 శాతం, మిగిలిన సీట్లు కన్వినర్‌ కోటాలో భర్తీ చేస్తుండగా... ప్రైవేటు కాలేజీల్లోని సీట్లలో 50 శాతం కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. 

మిగిలిన సీట్లలో బీ కేటగిరీ సీట్లు పోను ఎన్‌ఆర్‌ఐ, మేనేజ్‌మెంట్‌ కేటగిరీల్లో యాజమాన్యాలకు భర్తీ అవకాశాన్ని కల్పిస్తారు. 2023–24 విద్యా సంవత్సరంలో మాప్‌అప్‌ కౌన్సెలింగ్‌ ముగిసే నాటికి కాలేజీల వారీగా, కేటగిరీ వారీగా సీటు దక్కించుకున్న చివరి ర్యాంకు వివరాలతో కూడిన జాబితాను కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌ శనివారం విడుదల చేసింది. ఈ జాబితాను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. 

Also Read:  NEET AP Provisional Final Merit List Released: Download here

కేఎన్‌ఆర్‌ యూహెచ్‌ఎస్‌ విడుదల చేసిన చివరి ర్యాంకుల జాబితా కేవలం 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కౌన్సెలింగ్‌లోనివి మాత్రమే.  రాష్ట్రంలో కొత్తగా 8 వైద్య కళాశాలలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో కొత్తగా 4 వందల సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో గతేడాది కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.  

స్థానికతపై తెగని పంచాయితీ... 
యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ జాడలేదు. ఆల్‌ ఇండియా కోటా సీట్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఇప్పటికే తొలిరౌండ్‌ పూర్తి కాగా... రెండో రౌండ్‌ దరఖాస్తు, ఆప్షన్ల నమోదు ప్రక్రియ సైతం ముగిసింది. నేడో, రేపో రెండోరౌండ్‌ సీట్ల కేటాయింపు సైతం పూర్తి కానుంది. సాధారణంగా ఆలిండియా కోటా     సీట్ల భర్తీ తొలి రౌండ్‌ పూర్తయిన వెంటనే రాష్ట్ర స్థాయిలో మొదటి రౌండ్‌ సీట్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలయ్యేది.

కానీ రాష్ట్రంలో విద్యార్థుల స్థానికత ఖరారుపై నెలకొన్న వివాదంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ చిక్కుల్లో పడింది. ఇప్పటికే హైకోర్టు తీర్పు వెల్లడించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మంచి కాలేజీలో సీటు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ ప్రారంభం కాకపోవడంతో ఎలాంటి కాలేజీలో సీటు వస్తుంది? ఎక్కడ చేరితే మేలు? అనే అంశంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

రాష్ట్రంలో ఈసారి 77,848 మంది నీట్‌ యూజీ పరీక్షకు హాజరు కాగా... 47,356 మంది అర్హత సాధించారు. పరీక్ష రాసిన వారిలో అత్యధికులు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఏపీకి 10 శాతం కోటా సీట్ల కేటాయింపును రద్దు చేయడంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లలో నేషనల్‌ కోటా మినహా మిగిలిన కన్వీనర్‌ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి.   

#Tags