TGCHE: జేఈఈ అడ్వాన్స్‌డ్ తర్వాతే ఈఏపీ సెట్?
జాతీయ, రాష్ట్ర పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈఏపీ సెట్ తేదీని గత ఏడాదికన్నా ముందుకు జరపడం సాధ్యంకాదని తెలిపినట్లు సమాచారం. ప్రధాన పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతే ఈఏపీ సెట్ తేదీని ఖరారు చేయాలని ఇటీవల తమతో భేటీ అయిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి టీసీఎస్ ప్రతినిధులు సూచించినట్లు తెలిసింది.
ఈసారి సెట్‌ను ముందే నిర్వహిస్తామని బాలకిష్టారెడ్డి మండలి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజుల్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ పరీక్ష తేదీలను పరిశీలించి టీసీఎస్ సెట్ తేదీని మండలికి సూచించడం ఆనవాయితీ.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | టిఎస్-ప్రివియస్ పేపర్స్ | గెస్ట్ కాలమ్
మే 18 తర్వాత అయితే ఓకే..
మార్చి ఆఖరి వారంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తవుతాయని అధికారులు అంటున్నారు. ఈ ఫలితాలు ఏప్రిల్ రెండో వారం వెల్లడించే వీలుంది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రాస్తారు. ఇంటర్ పరీక్షల తర్వాత ఈఏపీ సెట్‌కు సన్నద్ధమవ్వడానికి విద్యార్థులకు సమయం అవసరం. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8 వరకు నిర్వహిస్తున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను మే 18న నిర్వహిస్తామని ఐఐటీ కాన్పూర్ ప్రకటించింది. దీని తర్వాత ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ ఉంటుంది. ఏటా ఈ కౌన్సెలింగ్ పూర్తయ్యే సమయంలో రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చేపడుతుంటారు. జాతీయ కాలేజీల్లో సీట్లు రాని వారికి ఇది ఉపయోగపడుతుంది.
ఇవన్నీ పట్టించుకోకుండానే ఈఏపీ సెట్‌ను ఏప్రిల్‌లో నిర్వహించాలని మండలి భావించింది. ఇలా చేయడం వల్ల మెయిన్స్, అడ్వాన్స్‌డ్ రాసే విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదం ఉందని టీసీఎస్ భావిస్తోంది. అడ్వాన్స్‌డ్ తర్వాతే ఎప్పటిలాగే సెట్ నిర్వహించాలని సూచించినట్లు టీసీఎస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
మండలిలోనూ భిన్నాభిప్రాయాలు
ఈఏపీ సెట్‌ను ముందుకు జరపాలన్న ప్రతిపాదనపై మండలిలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలిసింది. వివిధ సెట్స్ ఏ వర్సిటీకి ఇవ్వాలి? కన్వీనర్‌ను ఎవరిని పెట్టాలనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈఏపీసెట్ నిర్వహించే జేఎన్‌టీయూహెచ్‌కు వీసీని కూడా నియమించలేదు.
ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేస్తామని చెబుతున్నా... ప్రభుత్వం నుంచి అందుకు సమ్మతి రాలేదు. ఇన్ని సమస్యల మధ్య సెట్ నిర్వహణ ముందే ఎలా చేపడతామని మండలి వైస్ చైర్మన్ ఒకరు సందేహం వ్యక్తంచేశారు.