ఏపీ ఎంసెట్‌లో 95% హాజరు ... 26న ఫలితాల వెల్లడి

హైదరాబాద్, కాకినాడ: రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా విడిగా ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం నిర్వహించిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎంసెట్) విజయవంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనూ పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బస్సుల్లేక ఇక్కట్లు ఏర్పడినప్పటికీ.. ప్రతికూల పరిస్థితుల్లోనూ విద్యార్థులు ఎంసెట్‌కు 95శాతం మంది హాజరయ్యారు. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోపాటు అభ్యర్థులు ఎక్కడికక్కడ తమకు తాముగా రవాణా ఏర్పాట్లు చేసుకోవడంతో గతంలో కన్నా ఈసారి పరీక్షలు రాసిన వారి శాతం పెరిగింది. ఇంజనీరింగ్‌లో 95.39 శాతం మంది, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షకు 95.62 శాతం మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్‌కు మొత్తం 1,70,680 మంది దరఖాస్తు చేయగా 1,62,807 మంది పరీక్ష రాశారు. మెడికల్‌కు సంబంధించి 84,732 మంది దరఖాస్తు చే యగా 81,027 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్‌తోపాటు అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాలకు కలపి మొత్తం 2,55,412 మంది దరఖాస్తు చేసుకోగా 2,43,834 మంది పరీక్షలకు హాజరయ్యూరు. 11,578 మంది గైర్హాజరయ్యూరు. రాష్ట్రంలో శ్రీకాకుళంలో అత్యల్పంగా 92.26 శాతం మంది పరీక్ష రాశారు.
#Tags