Engineering Colleges: మేనేజ్‌మెంట్‌ కోటాలో భారీగా డబ్బులు వసూలు.. హైకోర్టు తీర్పుతో తలకిందులు, డబ్బులు వెనక్కి ఇస్తారా?

సాక్షి, హైదరాబాద్‌:  సీట్లు పెరుగుతాయి..మేనేజ్‌మెంట్‌ కోటాలో బీటెక్‌ అడ్మిషన్‌ గ్యారంటీ అని కొన్ని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు చెప్పడంతో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు పేమెంట్‌ చేసి జాయినింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల పెంపు, కుదింపు, బ్రాంచ్‌ల మార్పునకు హైకోర్టు అంగీకరించలేదు. 

యాజమాన్యాల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. దీంతో ఇప్పటికే డబ్బులు కట్టిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ముందస్తుగా డబ్బు చెల్లించినవారు 1500 మంది వరకూ ఉన్నారు. వారంతా  కాలేజీల చుట్టూ తిరుగుతూ డబ్బులు తీసుకున్నారు... ఇప్పుడు సీట్లెలా ఇస్తారు?’ అంటూ యాజమాన్యాలను నిలదీస్తున్నారు. 

‘కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని భావించాం..ఇప్పుడు మేం ఏం చేయగలం?’ అంటూ కాలేజీ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. డబ్బు వాపస్‌ ఇస్తారా? లేదా? అనేది అనుమానంగానే ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.  

CM Revanth Reddy US Tour: తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 30,750 ఉద్యోగాలు.. 19 కంపెనీలతో ఒప్పందాలు

ఇక ఆ సీట్లు రానట్టే!
రాష్ట్రవ్యాప్తంగా 28 ఇంజనీరింగ్‌ కాలేజీలు బ్రాంచ్‌ల మార్పిడి, సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌లలో దాదాపు 10 వేల సీట్లు రద్దు చేసుకున్నాయి. వీటిస్థానంలో సీఎస్‌ఈ, ఇతర కంప్యూటర్‌ కోర్సుల్లో సీట్లు పెంచాలని అడిగాయి. అయితే, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచ్‌లలో సీట్ల కుదింపునకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతించింది. 

అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అంది. ఇలా కుదిస్తే ఈ బ్రాంచ్‌లు తెరమరుగయ్యే ప్రమాదముందని అడ్డు చెప్పింది. ఇదే క్రమంలో కొత్తగా సీఎస్‌ఈ, డేటాసైన్స్, ఏఐ ఎంఎల్, సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లలో సీట్లు పెంచాలని పలు కాలేజీలు కోరాయి. 

కంప్యూటర్‌ సైన్స్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌ వంటి వాటిల్లో సీట్ల తగ్గింపునకు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికే ఆయా కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్, అనుబంధ బ్రాంచ్‌లలో సీట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావించింది. ఇలా దాదాపు 5 వేల సీట్లకు అనుమతి లభించలేదు. కోర్టు అనుమతిస్తే మూడో విడత కౌన్సెలింగ్‌లో వీటిని చేర్చాలని భావించారు. 

 

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే మూడు వేల పోస్టుల భర్తీ

ముందే ఖరారు
కోర్టు అనుమతిస్తే  సీఎస్‌ఈ, కంప్యూటర్‌ సైన్స్‌ అనుబంధ బ్రాంచ్‌లలో 5 వేల సీట్లు పెరిగేవి. 30 శాతం యాజమాన్య కోటా కింద దాదాపు 1500 సీట్లు అందుబాటులో ఉండేవి. దీనిని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రైవేట్‌ కాలేజీల యాజ మాన్యాలు ముందే సీట్లు అమ్ముకున్నాయి. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశించాయి. ఒక్కో సీటును రూ. 8 నుంచి రూ. 18 లక్షలకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. 

కోర్టుకెళ్లిన వారిలో పెద్ద కాలేజీలే ఉండటంతో  మేనేజ్‌మెంట్‌ సీట్లకూ గిరాకీ బాగానే పలికింది. ఇలా సీట్లు కొనుగోలు చేసిన వారిలో రాష్ట్ర ఈఏపీసెట్‌లో అతి తక్కువ స్కోర్‌ వచ్చినవారు, అసలు సెట్‌ పాసవ్వని వారూ ఉన్నారు. ఇప్పుడు వీరికి ఆఖరిదశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చే అవకాశం కూడా లేదు. చెల్లించిన సొమ్ముకు ఎలాంటి రసీదు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సొమ్మును రాబట్టడానికి గట్టిగా అడిగే పరిస్థితి కూడా లేదు. దీంతో కాలేజీల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఓ విద్యార్థి తండ్రి తెలిపారు. 

అప్పీల్‌కు వెళ్లేలోగా.. కౌన్సెలింగ్‌ ఖతం
హైకోర్టులో చుక్కెదురు కావడంతో కొన్ని ప్రైవేట్‌ కాలేజీలు అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ను త్వరగా ముగించాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలొచ్చాయి. ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్‌ పూర్తయింది. మూడో దశ కౌన్సెలింగ్‌ సీట్ల కేటాయింపు ఈ నెల 13న చేపడతారు.

వెనువెంటనే స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టే వీలుందని అధికారులు అంటున్నారు. ప్రైవేట్‌ కాలేజీలు అప్పీల్‌కు వెళ్లి, కేసు తేలేలోగా ఇంజనీరింగ్‌ క్లాసులు కూడా మొదలవుతాయి.  ఇది ప్రైవేట్‌ కాలేజీలకు ఇబ్బంది కలిగించే పరిణామమని అధికారులు అంటున్నారు. 

#Tags