TS EAPCET 2024 Counselling : నేటి నుంచి ఇంజనీరింగ్‌ సీట్లకు వెబ్‌ ఆప్షన్లు ....విడుదలైన కాలేజీలు, సీట్ల జాబితా

TS EAPCET 2024 Counselling : నేటి నుంచి ఇంజనీరింగ్‌ సీట్లకు వెబ్‌ ఆప్షన్లు ....విడుదలైన కాలేజీలు, సీట్ల జాబితా

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల లెక్క పాక్షికంగా తేలింది. ఆఖరి నిమిషంలో కాలేజీలకు విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు లభించింది. దీంతో ఈఏపీసెట్‌ అర్హత పొంది, కౌన్సెలింగ్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు సోమవారం నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 15 వరకు ఈ అవకాశం ఉంటుంది. సాంకేతిక విద్యా విభాగం అందించిన సమాచారం ప్రకారం తొలిదశ ఆప్షన్లు ఇచ్చే నాటికి 173 కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. 

మొత్తం 98,296 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కన్వీనర్‌ కోటా కింద 70,307 సీట్లు భర్తీ చేయనున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 1.18 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు వివిధ విభాగాల్లో ఉండాలి. కానీ కొన్ని కాలేజీలు సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ వంటి బ్రాంచీల్లో సీట్లు, సెక్షన్లు తగ్గించుకున్నాయి. వాటి స్థానంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్‌ కోర్సులు కావాలని దరఖాస్తు చేసుకున్నాయి. 

పెరిగే సీట్ల వివరాలకు ఇంకా ప్రభుత్వం అనుమతి లభించలేదు. దీంతో కోత పడే సీట్లుపోను మిగతా వాటిని కౌన్సెలింగ్‌లో చేర్చారు. సాంకేతిక విద్య కమిషనర్‌ దేవసేన ఆదివారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇందులో 60 శాతానికిపైగా సీట్లు కంప్యూటర్‌ కోర్సుల్లోనే ఉన్నాయి.   

#Tags