TS TET and DSC Updates 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. టెట్ 2024 ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు.. ఇక డీఎస్సీకి కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌కు తెలంగాణ విద్యాశాఖ టెట్‌ దరఖాస్తుల గడువును పెంచారు. మాములుగా అయితే.. ఏప్రిల్ 10వ తేదీతో టెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగిసింది. అయితే అభ్యర్థుల విన్న‌పం మేర‌కు విద్యాశాఖ ఏప్రిల్ 20వ తేదీ వరకు గడువును ప్రభుత్వం పెంచింది.

అలాగే ఏప్రిల్‌ 11 నుంచి 20వ తేదీ వరకు టెట్ ద‌ర‌ఖాస్తును ఎడిట్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 

ఈ సారి భారీగా తగ్గిన ద‌ర‌ఖాస్తులు..
మరోవైపు టెట్‌ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ సారి టెట్‌కు 3 లక్షలు వస్తాయనుకుంటే 2 లక్షలు కూడా దాటలేదు. టెట్ 2024కు ఇప్పటి వరకూ 1,93,135 దరఖాస్తులొచ్చాయి. 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు,2023లో 2.83 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ పదోన్నతుల కోసం సర్వీస్‌ టీచర్లు కూడా టెట్‌ రాయాలన్న నిబంధన ఉండటంతో ఈ సారి 3 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. 80 వేల మంది టీచర్లు టెట్‌ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు. 

మాకు టెట్‌తో అవసరం ఏమిటి..?
సెకండరీ గ్రేడ్‌ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రమోషన్‌కు టెట్‌ అవసరం. కానీ ఎస్‌జీటీగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్‌ హెచ్‌ఎంగా వెళితే, అది సమాన హోదాగా టీచర్లు చెబుతున్నారు. మరోవైపు స్కూల్‌ అసిస్టెంట్లు ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా వెళ్ళినా హోదాలో మార్పు ఉండదనే వాదన టీచర్లు లేవనెత్తారు. అలాంటప్పుడు టెట్‌తో అవసరం ఏమిటనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి.

Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌..

ఈ నేపథ్యంలో పాఠశాల విద్య అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ)కి లేఖ రాశారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు ఏయే పేపర్లు రాయాలి..? ఎంత మంది రాయాలనే విషయాల్లో స్పష్టత వస్తుంది.
 
ఇక పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవ్‌.. ప‌రీక్ష తేదీలు ఇవే..
కేవలం టెట్‌ దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపుకు మాత్రమే గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్‌ పరీక్ష మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్‌ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలుగా ఆ పరీక్ష గడువునూ పెంచారు.

☛ తెలంగాణ డీఎస్సీ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి
 
డీఎస్సీకీ అంతంతే..
డీఎస్సీ జూలై 17 నుంచి 31వ తేదీ వరకూ జరుగుతుంది. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా వచ్చిన దరఖాస్తులు 37,700. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

#Tags