DSC: కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ కేటగిరీలో ప్రాథమిక స్థాయిలో బోధించే స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల (ప్రత్యేక అవసరాల పిల్లలు) కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) జారీ చేసిన నిబంధనలను మారుస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. తాజాగా ప్రకటించిన డీఎస్సీలో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల కేటగిరీ కింద 796 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీరికి ఇంటర్మీడియట్‌లో కనీస అర్హత మార్కులను ఓసీలకు 50 శాతం, ఇతరులకు 45 శాతంగా నిర్ణయించింది. దీంతో పాటు రెండేళ్ల డీఈడీ పూర్తి చేసి ఉండాలని పేర్కొంది.

50 శాతం అర్హత మార్కులు పేర్కొనడాన్ని సవాల్‌ చేస్తూ సంగారెడ్డి జిల్లా ఆందోల్‌కు చెందిన విజయాచారితో పాటు మరో 10 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిబ్రవరి 28న పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన జీవో 4ను కూడా సవాల్‌ చేశారు.

చదవండి: TS TET 2024 Registrations Extended: టెట్‌ దరఖాస్తు గడువు పెంపు.. వీరూ కూడా టెట్ రాయాలి: సుప్రీంకోర్టు

ఓసీలకు ఇంటర్‌లో 45 శాతంగా, ఇతరులకు 40 శాతంగా కనీస అర్హత మార్కులను పరిగణించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి , జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం ఏప్రిల్ 16న‌ విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎన్‌.రమేశ్‌ వాదనలు వినిపిస్తూ.. స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో జీవో ఎంఎస్‌ నంబర్‌ 1 కింద జారీ చేసిన సవరించిన నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. అందులో ఓసీలకు ఇంటర్మీడియట్‌ స్థాయిలో 45 శాతం, ఇతరులకు 40 శాతం కనీస అర్హత మార్కులను తగ్గించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

#Tags