ISSF Junior World Championship: షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన ముకేశ్.. ఆరు పతకాలు..

పెరూలో జరుగుతున్న వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ, ఆంధ్రప్రదేశ్‌ షూటర్ ముకేశ్ నేలవల్లి తన అద్భుత ప్రదర్శనతో కొన‌సాగుతున్నాడు.

ఈ ఈవెంట్‌లో ముకేశ్ ఖాతాలో ఆరో పతకం చేరింది. ఇప్పటికే నాలుగు స్వర్ణాలు, ఓ కాంస్యం నెగ్గిన అతను అక్టోబ‌ర్ 6వ తేదీ మరో బ్రాంజ్ మెడల్ సాధించాడు. జూనియర్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో 548 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాడు. 

దీపక్(545) 5వ స్థానంలో నిలువగా.. ఉమేశ్ చౌదరి(530), రాజ్ చంద్ర(528) 17, 18 స్థానాల్లో నిలిచారు. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు గెలిచిన ముకేశ్.. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం గెలిచాడు. 

మరోవైపు, జూనియర్ మహిళల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో పరిషా గుప్తా రజతం సాధించింది. 540 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా రెండు పతకాలు చేరడంతో భారత్ మెడల్స్ సంఖ్య 23కు చేరింది. ఈ టోర్నీలో భారత్ 23 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇందులో 13 స్వర్ణాలు, మూడు రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి. 

Indian Railways: ఇండియన్‌ రైల్వేస్‌కు మురుగప్ప గోల్డ్‌కప్

#Tags