Paris Olympics: రెజ్లింగ్​లో భారత్​కు ఖరారైన పతకం.. స్వర్ణ ప‌త‌క పోరుకు సిద్దంగా ఉన్న‌ మహిళా స్టార్‌ రెజ్లర్‌!!

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం ఖరారైంది.

విశ్వ క్రీడల్లో తమ ‘పట్టు’ను నిలబెట్టుకుంటూ వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ క్రీడాంశంలో భారత్‌కు పతకం ఖరారైంది. మహిళల ఫ్రీస్టయిల్‌ 50 కేజీల విభాగంలో వినేశ్‌ ఫొగాట్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆగ‌స్టు 6వ తేదీ జరిగిన 50 కేజీల ఈవెంట్‌లో వినేశ్‌ వరుసగా మూడు బౌట్‌లలో విజయం సాధించి స్వర్ణ–రజత పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో వినేశ్‌ 5–0తో పాన్‌ అమెరికన్‌ గేమ్స్‌ చాంపియన్‌ యుస్నెలిస్‌ గుజ్మాన్‌ లోపెజ్‌పై గెలిచింది. 

ఆగ‌స్టు 7వ తేదీ రాత్రి 11 తర్వాత అమెరికా రెజ్లర్‌ సారా హిల్డెబ్రాంట్‌తో జరిగే ఫైనల్లో వినేశ్‌ విజయం సాధిస్తే ఒలింపిక్స్‌ క్రీడల చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. ఒకవేళ ఓడిపోయినా రజత పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా ఆమె గుర్తింపు పొందుతుంది.   

యూరోపియన్‌ మాజీ విజేతను ఓడించి.. 
క్వార్టర్‌ ఫైనల్లో వినేశ్‌ 7–5 పాయింట్ల తేడాతో 2018 ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత, 2019 యూరోపియన్‌ చాంపియన్‌ ఒక్సానా లివాచ్‌ (ఉక్రెయిన్‌)ను ఓడించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ బౌట్‌లో వినేశ్‌ ఆరంభంలోనే 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌ రెజ్లర్‌ కోలుకొని స్కోరును సమం చేసింది. అయితే చివర్లో వినేశ్‌ దూకుడుగా వ్యవహరించి రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది.

Paris Olympics: టేబుల్‌ టెన్నిస్‌ క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టిన భార‌త్‌.. ఇదే తొలిసారి..

ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్‌ను మట్టికరిపించి.. 
అంతకుముందు తొలి రౌండ్‌లో వినేశ్‌ పెను సంచలనం సృష్టించింది. 50 కేజీల విభాగంలో ప్రస్తుత ఒలింపిక్‌ చాంపియన్, మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌ సుసాకి యుయి (జపాన్‌)పై 3–2తో గెలిచి రెజ్లింగ్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 25 ఏళ్ల సుసాకి ఈ బౌట్‌కు ముందు తన అంతర్జాతీయ కెరీర్‌లో ఒక్క పరాజయం కూడా చవిచూడలేదు. తాను పోటీపడిన 82 బౌట్‌లలోనూ సుసాకి విజేతగా నిలిచింది.

టోక్యో ఒలింపిక్స్‌లో సుసాకి తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్‌ కూడా ఇవ్వకుండా విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. వినేశ్‌తో పోరులో సుసాకి ఫేవరెట్‌ అని అందరూ భావించారు. బౌట్‌ కూడా అలాగే సాగింది. ఐదు నిమిషాల 49 సెకన్లు ముగిసే వరకు సుసాకి 2–0తో ఆధిక్యంలో నిలిచి విజయం అంచుల్లో నిలిచింది. ఈ దశలోనే వినేశ్‌ అద్భుతం చేసింది. అందివచ్చిన అవకాశాన్ని వదలకుండా ఒక్కసారిగా సుసాకిని కిందపడేసి మూడు పాయింట్లు సాధించి అనూహ్య విజయాన్ని అందుకుంది.

సాక్షి తర్వాత వినేశ్‌.. 
2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ నుంచి భారత్‌కు పతకాలు లభిస్తున్నాయి. 2008 బీజింగ్‌లో సుశీల్‌ కుమార్‌ (66 కేజీలు) కాంస్యం గెలిచాడు. 2012 లండన్‌లో సుశీల్‌ కుమార్‌ (66 కేజీలు) రజత పతకం నెగ్గగా.. యోగేశ్వర్‌ దత్‌ (60 కేజీలు) కాంస్య పతకం సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లర్‌ సాక్షి మలిక్‌ (58 కేజీలు) కాంస్య పతకం సొంతం చేసుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బజరంగ్‌ (65 కేజీలు) కాంస్యం.. రవి కుమార్ (57 కేజీలు) రజతం గెల్చుకున్నారు. సాక్షి మలిక్‌ తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన రెండో భారతీయ మహిళా రెజ్లర్‌గా వినేశ్‌ గుర్తింపు పొందనుంది. 

Paris Olympics: మనూ భాకర్‌కు మరో గౌరవం.. ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో భారత బృందం పతాకధారిగా..

#Tags