LignoSat: ప్రపంచంలో తొలిసారి.. నింగిలోకి దూసుకెళ్లిన కలప ఉపగ్రహం

ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారైన ‘లిగ్నోశాట్’ ఉపగ్రహం అమెరికాలోని నాసా వారి కెన్నడీ అంతరిక్షప్రయోగ కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌లో నింగిలోకి దూసుకుపోయింద‌ని క్యోటో వర్సిటీ హ్యూమన్‌ స్పేసాలజీ సెంటర్ న‌వంబ‌ర్ 5వ తేదీ ప్రకటించింది.

అత్యంత కఠినమైన లోహాలతో రూపొందిన కృత్రిమ ఉపగ్రహాలు కాలంచెల్లాక కక్ష్యల్లో స్పేస్‌జంక్‌గా పోగుబడుతున్న నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా కలపను భవిష్యత్తులో వాడే ఉద్దేశ్యంతో జపాన్‌ శాస్త్రవేత్తలు కలపతో ఉపగ్రహాన్ని తయారుచేశారు.  

కేవలం అరచేయి సైజులో 10 సెంటీమీటర్ల వృత్తాకార పరిమాణంలో ఈ బుల్లిశాటిలైట్‌ను తయారుచేశారు. ఒక కంటైనర్‌లో అమర్చి పంపారు. త్వరలో ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకోంది. కొద్దిరోజుల విరామం తర్వాత దీనిని ఐఎస్‌ఎస్‌ బయట ప్రవేశపెట్టనున్నారు. ఆరునెలలపాటు ఇది తన కక్ష్యలో తిరగనుంది. శూన్యంలో రోదసీ వాతావరణంలో కలప ఏ మేరకు మన్నికగా ఉంటుందనే విషయాలపై అధ్యయనం చేయనున్నారు. 

ప్రతి 45 నిమిషాలకు ఇది రోదసీలో చీకటి మొదలు తీక్షణమైన సూర్యరశ్ని దాకా అంటే మైనస్‌ 100 డిగ్రీ సెల్సియస్‌ నుంచి 100 డిగ్రీ సెల్సియస్‌దాకా భిన్న ఉష్ణోగ్రతలను తట్టుకోవాల్సి ఉంటుంది. కలపను దహించే ఆక్సిజన్‌ వంటి వాయువులు శూన్యంలో ఉండవుకాబట్టి అక్కడ కలప ధృఢంగా ఉండగలదని జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయ అటవీశాస్త్ర ప్రొఫెసర్‌ కోజీ మురాటా వాదిస్తున్నారు. ఖడ్గం పిడి, ఒరగా వాడే మంగోలియా జాతి హొనోకీ చెట్టు కలపను ఈ శాటిలైట్‌ తయారీలో వాడారు.

Analog Space Mission: మొట్టమొదటి అనలాగ్ స్పేస్ మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో

వీటిని వాడకుండానే.. 
జపాన్‌ సంప్రదాయక కళతో ఎలాంటి నట్లు, బోల్ట్‌లు, జిగురు వాడకుండానే లిగ్నోశాట్‌ను సిద్ధంచేశారు. కాలం చెల్లిన శాటిలైట్‌ తిరిగి భూవాతావరణంలోకి వచ్చేటపుడు ప్రమాదకర అల్యూమినియం ఆక్సైడ్‌ అణువులను వెలువరుస్తుంది. అదే కలప శాటిలైట్‌తో పర్యావరణానికి, కమ్యూనికేషన్‌ కక్ష్యలకు ఎలాంటి సమస్యలు ఉండవని క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట కలపశాటిలైట్‌ మన్నిక బాగుందని తేలితే భవిష్యత్తులో చంద్రుడు, మార్స్‌పై వ్యోమగాముల ఆవాసాలకు కలపను విరివిగా వాడే అవకాశముంది. ఐఎస్‌ఎస్‌ నుంచి సరకుల రాకపోకల్లోనూ కంటైనర్లకు కలపను వాడే వీలుంది.  

Shenzhou 19 Mission: ‘డ్రీమ్‌’ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించిన చైనా

#Tags