Computer Viruses: సెకనుకో సైబర్ నేరం.. ప్రతీరోజు పుట్టుకొస్తున్న 90 లక్షల కంప్యూటర్ వైరస్‌లు!
ప్రతి 8 నిమిషాలకు ఒక ర్యాన్సమ్‌వేర్ దాడి జరుగుతోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజు 90 లక్షల కంప్యూటర్ వైరస్‌లు పుట్టుకొస్తున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బిట్‌కాయిన్ల రేటు పెరుగుతోందంటే ఓ భారీ సైబర్ దాడికి రంగం సిద్ధమవుతోందని సంకేతమని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు వసూళ్లకు పాల్పడేది.
లావాదేవీలు జరిపేది బిట్‌కాయిన్ల రూపంలోనే కావడమే అందుకు కారణమని వివరించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నగర పోలీసులు, సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ నవంబర్ 6వ తేదీ ‘హైదరాబాద్ యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్–2024’(హాక్–2.0) నిర్వహించింది.
దీనికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సినీ నటుడు అడవి శేషు తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సులో కృష్ణశాస్త్రి కీలకోపన్యాసం చేశారు. సాఫ్ట్‌వేర్ రంగంతోపాటు దేశంలోని అన్నిరంగాలకు సైబర్ దాడుల ముప్పు పొంచి ఉన్నదని తెలిపారు. ప్రతీరోజూ పుట్టుకొస్తున్న 90 లక్షల కంప్యూటర్ వైరస్‌లలో రెండు శాతం వైరస్‌ల లక్షణాలు ఎవరికీ తెలియదని అన్నారు.
కృష్ణశాస్త్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
గుర్తించటం కష్టమే..
సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త మార్గాల్లో దాడులకు పాల్పడుతుండటంతో వాటిని గుర్తించటం కష్టంగా మారింది. విమాన సర్వీసులకు జీపీఎస్ స్ఫూఫింగ్, డ్రాపింగ్ పెద్ద సవాల్‌గా పరిణమించింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల జీపీఎస్‌ను హ్యాక్ చేసేందుకు 64 శాతం అవకాశం ఉంది. ప్రపంచంలోని ప్రతి ఆటోమేటిక్ వ్యవస్థకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉంది.
ఎస్సెమ్మెస్‌ల ద్వారా లింకులు పంపే విషింగ్, ఈ–మెయిల్స్ ద్వారా పంపే ఫిషింగ్ స్కామ్‌లు ఇప్పటివరకు చూశాం. తాజాగా క్యూఆర్ కోడ్ పంపిస్తూ చేసే క్యూఆర్ ఇషింగ్ కూడా జరుగుతోంది. పుణేలోని కాస్మోస్ బ్యాంక్ సర్వర్‌పై మాల్‌వేర్‌తో దాడి చేసిన సైబర్ నేరగాళ్లు రూ.94 కోట్లు కాజేశారు. 2018లో ఇది జరిగినా ఆ మొత్తం ఎక్కడకు వెళ్లిందో ఇప్పటికీ గుర్తించలేకపోయాం.
హెల్త్ డేటా లీకైతే బయోవెపన్స్ ముప్పు
వ్యక్తిగత, ఆర్థిక డేటాతోపాటు హెల్త్ డేటా కూడా అత్యంత కీలకం. ఇటీవల కాలంలో వైద్య రంగానికి చెందిన సంస్థలు, ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు, ఆస్పత్రులకు సంబంధించిన సర్వర్ల మీద సైబర్ దాడులు చేస్తూ ప్రజల హెల్త్ డేటాను కాజేస్తున్నారు. ఇది శత్రుదేశాల చేతికి చిక్కితే భవిష్యత్తులో బయోవెపన్స్ (జీవాయుధాలు) ముప్పు పెరుగుతుంది.
ఈ హెల్త్ డేటా ద్వారా ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లు ఏ ప్రాంతంలో ఎక్కువ నివసిస్తున్నారు అనేది వారికి తెలుస్తుంది. దీంతో ఆయా బ్లడ్ గ్రూప్స్ వారిపైనే ఎక్కువ ప్రభావం చూపేలా బయోవెపన్స్ తయారు చేసి ప్రయోగించే ప్రమాదం ఉంటుంది. ఈ ఏడాది డిజిటల్ ఫోరెన్సిక్‌కు సిల్వర్ జూబ్లీ ఇయర్. ఈ నేపథ్యంలో ప్రిడెక్టివ్, రెస్పాన్సివ్ కంట్రోల్స్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉంది.
Andhra Pradesh Voters: ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన ఓటర్ల సంఖ్య.. ఎంతంటే?