Election Commission: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
భారత ఎన్నికల కమిషన్(Election Commission of India-ఈసీఐ) 25వ ప్రధాన కమిషనర్(Chief Election Commissioner of India-సీఈసీ)గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈసీగా ఉన్న సుశీల్ చంద్ర మే 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మే 15న నూతన సీఈసీగా రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారని కేంద్ర న్యాయ శాఖ వెల్లడించింది. ఎలక్షన్ కమిషనర్లలో అత్యంత సీనియర్‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. రాజీవ్ కుమార్ ప్రస్తుతం ఈసీఐలో 2వ కమిషనర్‌గా ఉన్నారు. ఈసీఐ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
GK National Quiz: ఏ రాష్ట్ర హైకోర్టు బహిరంగ ప్రదేశాల్లో జంతు వధను నిషేధించింది?
1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్.. బిహార్, జార్ఖండ్ కేడర్ అధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కేంద్ర సర్వీసులకు వచ్చిన తర్వాత ఆర్‌బీఐ, సెబీ, నాబార్డ్‌లలో డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆర్థిక రంగానికి చెందిన పలు ఇతర సంస్థలకు సేవలందించారు. అంతకుముందు ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు చైర్మన్‌గా ఆయన వ్యవహరించారు.
కేంద్ర ఎన్నికల సంఘం
భారత రాజ్యాంగం 15వ భాగంలో ప్రకరణ 324 నుంచి 329 వరకు ఎన్నికలు, ఎన్నికల సంఘం నిర్మాణం, అధికార విధులకు సంబంధించి సమగ్ర వివరణలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది. అందువల్ల జనవరి 25ని జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు. దీన్ని 2011 నుంచి పాటిస్తున్నారు. దేశ తొలి చీఫ్ ఎన్నికల కమిషనర్‌గా సుకుమార్ సేన్(కాలం 1950, మార్చి 21–1958, డిసెంబర్ 19) పనిచేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం – బహుళ సభ్యత్వం
రాజ్యాంగం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం బహుళ సభ్య సంస్థ. 1950 జనవరి 25 నుంచి 1989 అక్టోబర్ 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏక సభ్య సంస్థగా, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో మాత్రమే పనిచేసింది. 1989లో మొట్టమొదటిసారిగా బహుళ సభ్య సంస్థగా మార్పు చేస్తూ ఇద్దరు ఇతర కమిషనర్లను నియమించారు. కానీ 1990లో తిరిగి ఏక సభ్య సంస్థగా మారింది. తిరిగి 1993లో బహుళ సభ్య సంస్థగా మారుస్తూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. దానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 1993 నుంచి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు సభ్యులతో కొనసాగుతోంది.
ప్రత్యేక వివరణ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లకు అధికారాలు, హోదాలు, జీతభత్యాల్లో వ్యత్యాసం లేదు. నిర్ణయాలను సాధారణంగా ఏకగ్రీవంగా తీసుకుంటారు. లేకుంటే మెజార్టీ ప్రాతిపదికపై నిర్ణయాలను అమలుచేస్తారు.
నియామకం–అర్హతలు–పదవీకాలం
చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లు, రీజనల్ కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. ఇది పార్లమెంటు రూపొందించిన చట్టాలకు లోబడి ఉంటుంది. నియామకానికి రాజ్యాంగ పరంగా ప్రత్యేక అర్హతలేమీ లేవు. ప్రకరణ 324(5) ప్రకారం ఎలక్షన్ కమిషనర్ల పదవీకాలం, ఇతర సర్వీసు నిబంధనలను పార్లమెంటు చట్టం ప్రకారం నిర్ణయిస్తుంది. సాధారణంగా సీనియర్ బ్యూరోక్రాట్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లుగా నియమిస్తారు. వీరి పదవీ కాలం ఆరేళ్లు, పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. పదవిలో కొనసాగే కాలంలో ఈ రెండింటిలో ఏది ముందువస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రత్యేక వివరణ: ప్రస్తుతానికి రీజనల్ కమిషనర్ల నియామకం చేపట్టలేదు.
జీతభత్యాలు
వీరి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి జీతాలు చెల్లిస్తారు. సాధారణ పరిస్థితుల్లో వాటిని తగ్గించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తుల వేతనాలతో సమానంగా వీరి వేతనాలుంటాయి.
తొలగింపు
ప్రకరణ 324(5) ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధంగానే పార్లమెంటు తొలగిస్తుంది. కానీ, ఇతర కమిషనర్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సలహా మేరకు అవినీతి, అసమర్థత అనే కారణాలపై రాష్ట్రపతి తొలగిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) 25వ ప్రధాన కమిషనర్(సీఈసీ)గా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : రాజీవ్ కుమార్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ప్రస్తుతం సీఈసీగా ఉన్న సుశీల్ చంద్ర మే 14న పదవీ విరమణ చేయడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్