Chalapathi Rao: విలక్షణ నటుడు చలపతిరావు కన్నుమూత
కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రులో మణియ్య, వియ్యమ్మ దంపతులకు 1944 మే 8న చలపతిరావు జన్మించారు. నందమూరి తారక రామారావు అంటే ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ స్ఫూర్తితో తాను కూడా హీరో కావాలని అవకాశాల్ని వెతుక్కుంటూ మద్రాస్ (చెన్నై) వెళ్లారు చలపతిరావు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘గూఢచారి 116’ (1966) ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు చలపతిరావు. ఆ తర్వాత ‘సాక్షి, బుద్ధిమంతుడు, టక్కరి దొంగ చక్కని చుక్క’ వంటి చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ‘కథానాయకుడు’ (1969) సినిమాలో మున్సిపల్ కమిషనర్ పాత్ర చేశారు.
ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగా కెరీర్ ఆరంభంలో ఐదారేళ్ల పాటు ఆయన సినిమాల్లోనే నటించారు చలపతిరావు. హీరో కావాలని వెళ్లిన చలపతిరావుకి ఎక్కువగా విలన్ పాత్రలే వచ్చేవి. అయితే ‘దాన వీర శూర కర్ణ’ చిత్రం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ సినిమాలో ఐదు పాత్రల్లో నటించారాయన. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా మానభంగం సన్నివేశాల్లో నటించారు చలపతిరావు. దాదాపు 90కి పైగా రేప్ సీన్స్‌లో నటించారాయన. అప్పటివరకు విలన్ పాత్రలు చేసిన చలపతిరావుని ‘నిన్నే పెళ్లాడతా’ (1996) సినిమా నటుడిగా ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. సాఫ్ట్ క్యారెక్టర్స్‌కు ఆయన న్యాయం చేయగలరనే నమ్మకం దర్శక–నిర్మాతల్లో కలిగించింది ఆ సినిమా. దీంతో ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత మంచి తండ్రి, బాబాయ్ పాత్రలు కూడా ఆయన్ని వరించాయి.
ప్రముఖ సినీనటుడు సీనియర్ నటుడు కైకాల కన్నుమూత.. ఈయన జీవిత ప్రస్థానం ఇలా..
ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణంరాజు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో పాటు నేటి తరం యువ హీరోల సినిమాల్లోనూ ఆయన వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో దాదాపు 1200లకుపైగా సినిమాల్లో నటించారు చలపతిరావు. తనయుడు రవిబాబు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారాయన. అయితే అనుకోని విధంగా హఠాన్మరణం పొందారు.
☛ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చలపతిరావు ఆర్‌సీ క్రియేషన్స్ అనే బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారారు. తొలి చిత్రంగా బాలకృష్ణతో ‘కలియుగ కృష్ణుడు’ నిర్మించారు. ఆ తర్వాత ‘కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, ప్రెసిడెంట్‌గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి’ వంటి చిత్రాలు నిర్మించారు.
☛ చలపతిరావుకు 19 ఏళ్లకే ఇందుమతితో పెళ్లయింది. వీరిది ప్రేమ వివాహం. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. తన 28వ ఏట జరిగిన ఓ ప్రమాదంలో భార్య ఇందుమతిని కోల్పోయారు చలపతిరావు. ఆ తర్వాత ఆయన మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడగా, కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా కొనసాగుతున్నారు.