New Indian Criminal Laws: అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు ఇవే..
భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర గత అర్ధరాత్రితో ముగిసింది.
కొత్త చట్టాలతో జీరో ఎఫ్‌ఐఆర్, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, ఎస్‌ఎంఎస్ వంటి ఎలక్టాన్రిక్ పద్ధతిలో సమన్లు పంపడం, హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోల్లో బంధించడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా, న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ ఆత్మతో రూపొందించామన్నారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని చెప్పారు.
➤ భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల శిక్ష పడుతుంది. దీన్నిప్పుడు యావజ్జీవంగా మార్చారు. హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్ల వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేశారు.
➤ నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది. విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్నీ ఉగ్రవాదంగా నిర్వచించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు.
➤ మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని జోడించారు. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా మార్చారు. మైనర్‌పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు. పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను వదిలేయడం వంటి కేసులకు కొత్త నిబంధన పెట్టారు.
మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి. మహిళలు, 15 ఏళ్లలోపు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇంటినుంచే పోలీసు సాయం పొందవచ్చు. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా నిబంధన చేర్చారు.
➤ కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి సమన్లదాకా అన్నీ ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. పోలీసు స్టేషన్‌కు వెళ్లే పని లేకుండా ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా సమన్లు పంపవచ్చు. పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లో అయినా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసే జీరో ఎఫ్‌ఐఆర్ విధానం ప్రవేశపెట్టారు. అరెస్టయిన వ్యక్తి కుటుంబానికి, స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతోపాటు వివరాలను పోలీస్ స్టేషన్లలో ప్రదర్శిస్తారు.